మన్నెం.. చిన్నాభిన్నం
చింతూరు: పోలవరం ముంపులో భాగంగా మండలాన్ని ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించడంతో చింతూరు కేంద్రంగా ఉన్న ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల అనుసంధానమెలా అనేదానిపై స్పష్టత కొరవడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ నాలుగు రాష్ట్రాల సరిహద్దులు బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురవుతాయి. ఇప్పటివరకు ఈ రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న రహదారులు సైతం ముంపునకుగురై కనుమరుగు కానున్నాయి. ఇందులో విజయవాడ, జగ్దల్పూర్ జాతీయ రహదారి-30, ఎర్రంపేట, మల్కనగిరి జాతీయ రహదారి-360తో పాటు చట్టి, రాజమండ్రి ఆర్అండ్బీ రహదారులున్నాయి.
{పస్తుతం చింతూరు ఆంధ్రప్రదేశ్‌లో కలవడంతో ఆంధ్రకు చిడుమూరు, తెలంగాణకు భద్రాచలం, ఛత్తీస్‌గఢ్‌కు కుంట, ఒడిశాకు మోటులు సరిహద్దులు అవుతాయి. నెల్లిపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన ప్రజలు వ్యాపారలావాదేవీలతో పాటు ఇతర పనుల నిమిత్తం చింతూరు మీదుగానే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు వెళ్లాలి. ప్రస్తుతం రాకపోకలు సాగుతున్న ఈ రహదారులన్నీ బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురవుతాయి. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా రహదారులను అనుసంధానం (కనెక్టివిటీ) చేయాలి.
తెలంగాణ నుంచి రహదారి అనుసంధానానికి చింతూరు మండలం సింగన్నగూడెం నుంచి చింతూరు శబరినది వంతెనను కలుపతూ ఎర్రంపేటకు బ్యాక్‌వాటర్‌పై రహదారిని నిర్మించాల్సి ఉంటుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి రహదారి అనుసంధానానికి ఆ రాష్ట్రంలోని వింజరం నుంచి చింతూరు శబరినది వంతెన వరకు రహదారి నిర్మించాలి. ఒడిశా నుంచి రహదారి అనుసంధానానికి మోటు, కల్లేరు మీదుగా ఎర్రంపేటకు రహదారి ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతాలన్నీ పోలవరం బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురవుతుండటంతో రహదారులు ఎలా నిర్మిస్తారనే అనే దానిపై సందిగ్ధత నెలకొంది. బ్యాక్‌వాటర్ నీటి పైనుంచి ఫ్లైఓవర్లు నిర్మిస్తేనే రహదారులను అనుసంధానం చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి అనునిత్యం వందలాది వాహనాలు చింతూరు మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి. బ్యాక్‌వాటర్‌పై రహదారుల అనుసంధానం చేయకపోతే రవాణా వ్యవస్థ దెబ్బతినే అవకాశముందని వాహనదారులతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ చింతూరు మండలం కల్లేరు, మల్కనగిరి జిల్లా మోటుల నడుమ నిర్మించ తలపెట్టిన వంతెన నిర్మాణం ఇంతవరకు ప్రారంభం కాలేదు.
రూ.11 కోట్ల ఎల్‌డబ్ల్యూఈఏ నిధులతో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి డిజైన్ అప్రూవల్ ఆలస్యం కావడంతో ఇప్పటికే కాలపరిమితి తీరిపోయినా వంతెన నిర్మాణం మాత్రం ప్రారంభం కాలేదు. ఇక్కడ ప్రస్తుత డిజైన్‌తో వంతెన నిర్మాణం చేపట్టినా పోలవరం ముంపనకు గురయ్యే అవకాశముండటంతో వంతెన ఎత్తు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.
కదలిక లేని అధికారులు?
చింతూరు మండలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కలవడంతో ఇకపై ఈ మండలానికి సంబంధించిన ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంటుంది. ఈ మండలం తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వెళ్లడంతో ఆ జిల్లా అధికారులు రహదారుల అనుసంధానంపై సర్వే చేపట్టి నివేదికలు ఇవ్వాలి. కానీ ఇంతవరకు అలాంటి ప్రయత్నాలు ఎక్కడా జరగలేదు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కంటే ముందే రహదారుల నిర్మాణం జరగాలని లేదంటే బ్యాక్‌వాటర్‌తో ప్రస్తుత రహదారులు ముంపునకు గురయ్యే అవకాశముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే రవాణాపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రజలు వాపోతున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిసారించి రహదారుల అనుసంధానంపై సర్వేలు చేపట్టి త్వరితగతిన నిర్మించాలని కోరుతున్నారు.