Chodavaram Assembly Constituency
-
మహిళలపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలు
అనకాపల్లి, సాక్షి: ఇచ్చిన హామీల ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వాన్ని తిట్టిపోయడమే రోజూ పనిగా పెట్టుకున్నారు. పైగా అరాచకాలతో ఏపీని రావణ కాష్టంగా మార్చేశారు. దీనికి తోడు ఇప్పుడు ఓ అధికార ఎమ్మెల్యే మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని తాను సీఎంకు చెప్పానని అన్నారాయన. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారు. ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసి మందు తాగుతున్నారు అని అన్నారాయన. అక్కడితో ఆగకుండా.. ‘‘పథకాల వల్లే.. ఆడవాళ్లు ఇంట్లో వంట మానేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అలవాటు పడుతున్నారు. ఇచ్చిన డబ్బులతో చిల్లర ఖర్చులు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు కొనుక్కుంటున్నారు అంటూ తన నోటి దురుసును కొనసాగించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు ఎమ్మెల్యే రాజు క్షమాపణలు చెప్పాలని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. -
చోడవరం చక్కెర కర్మాగారం రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త
సాక్షి, అనకాపల్లి జిల్లా: చోడవరం చక్కెర కర్మాగారం రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. షుగర్ ఫ్యాక్టరీకి గ్రాంట్ రూపంలో రూ.12 కోట్ల 30 లక్షల రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. చెరుకు రైతుల బాకీల నిమిత్తం రూ.9 కోట్ల 30 లక్షల రూపాయలు, కార్మికుల జీతాల పెండింగ్ బిల్లుల కోసం మూడు కోట్ల రూపాయలు గ్రాండ్ రూపంలో ప్రభుత్వం విడుదల చేసింది. నిధులు విడుదల పట్ల రైతులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధన్యవాదాలు తెలిపారు. -
చోడవరంలో సాధికార స్వరం
సాక్షి, అనకాపల్లి: అనకాపలి జిల్లా చోడవరంలో మంగళవారం సాధికార నినాదం హోరెత్తింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు నియోజకవర్గంలో కదం తొక్కాయి. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేశాయి. ఇది బడుగు, బలహీన వర్గాల విజయయాత్రలా సాగింది. యువత బైక్ ర్యాలీతో సందడి చేశారు. వందలాది బైక్‌లు, కార్లు, ఆటోలతో ప్రారంభమైన బస్సు యాత్రలో నియోజకవర్గంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. కొత్తకోట జెడ్పీ హైస్కూల్లో నాడు–నేడు ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బుచ్చెయ్యపేటలో జల్‌జీవన్ మిషన్‌ను ప్రారంభించారు. అనంతరం వేలాదిమందితో వడ్డాదిలో భారీ బహిరంగ సభ జరిగింది. జయహో జగన్ అంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు నినదించారు. పేదల స్థితిగతులు మార్చిన సీఎం జగన్: మంత్రి ధర్మాన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదల స్థితిగతులను మార్చారని, ఆర్థికంగా బలోపేతం చేసి సంఘంలో గౌరవాన్ని పెంచారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల రూపంలో రూ.2.60 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో సీఎం జమ చేశారని తెలిపారు. అవినీతికి తావు లేకుండా పాలన అందిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయం దయనీయంగా ఉండేదని, వ్యవసాయ వృద్ధి రేట్లో 16వ స్థానంలో ఉండేదని తెలిపారు. సీఎం జగన్ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, రైతులకు అండదండలందించారని, దాంతో వ్యవసాయ రంగంలో ఏపీ 4వ స్థానానికి ఎదిగిందని వివరించారు. కోట్లాది రైతులు, పేదల కుటుంబాలలో వెలుగులు నింపిన వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేదికపై ప్రసంగిస్తున్న మంత్రి కారుమూరి జగన్ పథకాలతో పేదరికం తగ్గింది : ఎంపీ నందిగం సురేష్ వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదరికం తగ్గిందని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు వస్తే అప్పటి సీఎం చంద్రబాబు బిచ్చగాళ్లను దాచిపెట్టారని, ఇలా పేదరికాన్ని దాచకూడదని, తగ్గించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించడం ద్వారా సీఎం జగన్ పేదరికాన్ని రూపుమాపుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సీఎం జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరు అద్భుతమని చెప్పారు. దళిత రైతు బిడ్డనైన తనను సీఎం జగన్ ఢిల్లీలో ప్రధానమంత్రి పక్కన కూర్చోబెట్టారన్నారు. ఒకప్పుడు ఏ ప్రధానిని చూడాలనుకున్నానో.. అదే ప్రధాని పక్కన కూర్చున్నానంటే ఇది కాదా సామాజిక సాధికారత అని అన్నారు. ఒంటరిగా పోరాటం చేసిన దళిత బిడ్డ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్‌కు తెలంగాణలో రాలేదని, వారు వచ్చే ఎన్నికల్లో ఏమి సాధిస్తారని ప్రశ్నించారు. అందరి సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం: మంత్రి కారుమూరి రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్యేయమని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. సీఎం జగన్ సంక్షేమాన్ని అందించడంలో కుల, మత, పార్టీ, ప్రాంతీయ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పైసా అవినీతికి తావు లేకుండా సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు కదిలి మరోసారి జగన్‌ను సీఎంగా ఎన్నుకోవాలన్నారు. చోడవరంలో రూ.1,900 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి : కరణం ధర్మశ్రీ ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. సీఎం జగన్ చోడవరం నియోజకవర్గంలో 90 శాతం రాజకీయ, నామినేటెడ్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే అందించారన్నారు. నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి రూ.1,900 కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రధానంగా రూ.80 కోట్లతో రోడ్లు, నాడు – నేడు ద్వారా రూ.87 కోట్లు విద్యా రంగంలో ఖర్చు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, గొల్ల బాబురావు, తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పాల్గొన్నారు. -
‘చోడవరం’లో గ్రీన్ ఫీల్డ్ ఇథనాల్ ప్లాంట్
సాక్షి, అమరావతి: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సహకార చక్కెర కర్మాగారాలను తిరిగి బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా పంచదార ఉత్పత్తికంటే అధికాదాయాన్నిచ్చే బయో ఇథనాల్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. తద్వారా చెరకు రైతులను అన్ని విధాలా ఆదుకోనుంది. తొలి దశలో అనకాపల్లి జిల్లా చోడవరంలోని చోడవరం సహకార సంఘ చక్కెర కర్మాగారంలో గ్రీన్ ఫీల్డ్ బయో ఇథనాల్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోజుకు 60 కిలోలీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేసేలా ఈ యూనిట్ ఏర్పాటుకానుంది. చోడవరం చక్కెర కర్మాగారంలో బయో ఇథనాల్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి కోసం దరఖాస్తు చేయగా.. జూలై 10న అనుమతులు మంజూరు చేసి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికను పంపాల్సిందిగా కేంద్రం కోరింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ప్రాజెక్టు ఎంత వ్యయం అవుతుంది.. ముడిపదార్థాలు ఎంత అవసరం.. ఆదాయం.. రుణం ఎంత కాలంలో తీర్చగలం? వంటి అన్ని అంశాలతో ఈ నివేదికను తయారు చేయాల్సిందిగా కోరింది. ఆసక్తి గల సంస్థలు ఆగస్టు 28లోగా దాఖలు చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని కలిపి వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే లీటరు పెట్రోలో 10 శాతం ఇథనాల్ కలుపుతుండగా, ఈ మొత్తాన్ని 2025–26 నాటికి 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ఆ మేరకు మిగులు ధాన్యాల నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించేలా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్(ఈబీపీ) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం బయో ఇథనాల్‌లో పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షించేలా ప్రత్యేకంగా ఓ పాలసీనే తీసుకొచ్చింది. ఇప్పుడు సహకార చక్కెర కర్మాగారాల్లో కూడా బయో ఇథనాల్ యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా వాటిని ఆర్థికంగా పరిపుష్టి చేయనుంది.