అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగిన సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం
సాక్షి, అనకాపల్లి: అనకాపలి జిల్లా చోడవరంలో మంగళవారం సాధికార నినాదం హోరెత్తింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు నియోజకవర్గంలో కదం తొక్కాయి. వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేశాయి. ఇది బడుగు, బలహీన వర్గాల విజయయాత్రలా సాగింది. యువత బైక్ ర్యాలీతో సందడి చేశారు.
వందలాది బైక్‌లు, కార్లు, ఆటోలతో ప్రారంభమైన బస్సు యాత్రలో నియోజకవర్గంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. కొత్తకోట జెడ్పీ హైస్కూల్లో నాడు–నేడు ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బుచ్చెయ్యపేటలో జల్‌జీవన్ మిషన్‌ను ప్రారంభించారు. అనంతరం వేలాదిమందితో వడ్డాదిలో భారీ బహిరంగ సభ జరిగింది. జయహో జగన్ అంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు నినదించారు.
పేదల స్థితిగతులు మార్చిన సీఎం జగన్: మంత్రి ధర్మాన
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదల స్థితిగతులను మార్చారని, ఆర్థికంగా బలోపేతం చేసి సంఘంలో గౌరవాన్ని పెంచారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల రూపంలో రూ.2.60 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో సీఎం జమ చేశారని తెలిపారు. అవినీతికి తావు లేకుండా పాలన అందిస్తున్నారన్నారు.
టీడీపీ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయం దయనీయంగా ఉండేదని, వ్యవసాయ వృద్ధి రేట్‌లో 16వ స్థానంలో ఉండేదని తెలిపారు. సీఎం జగన్ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, రైతులకు అండదండలందించారని, దాంతో వ్యవసాయ రంగంలో ఏపీ 4వ స్థానానికి ఎదిగిందని వివరించారు. కోట్లాది రైతులు, పేదల కుటుంబాలలో వెలుగులు నింపిన వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వేదికపై ప్రసంగిస్తున్న మంత్రి కారుమూరి
జగన్ పథకాలతో పేదరికం తగ్గింది : ఎంపీ నందిగం సురేష్
వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదరికం తగ్గిందని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు వస్తే అప్పటి సీఎం చంద్రబాబు బిచ్చగాళ్లను దాచిపెట్టారని, ఇలా పేదరికాన్ని దాచకూడదని, తగ్గించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించడం ద్వారా సీఎం జగన్ పేదరికాన్ని రూపుమాపుతున్నారని అన్నారు.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సీఎం జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరు అద్భుతమని చెప్పారు. దళిత రైతు బిడ్డనైన తనను సీఎం జగన్ ఢిల్లీలో ప్రధానమంత్రి పక్కన కూర్చోబెట్టారన్నారు. ఒకప్పుడు ఏ ప్రధానిని చూడాలనుకున్నానో.. అదే ప్రధాని పక్కన కూర్చున్నానంటే ఇది కాదా సామాజిక సాధికారత అని అన్నారు. ఒంటరిగా పోరాటం చేసిన దళిత బిడ్డ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్‌కు తెలంగాణలో రాలేదని, వారు వచ్చే ఎన్నికల్లో ఏమి సాధిస్తారని ప్రశ్నించారు.
అందరి సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం: మంత్రి కారుమూరి
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్యేయమని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. సీఎం జగన్ సంక్షేమాన్ని అందించడంలో కుల, మత, పార్టీ, ప్రాంతీయ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పైసా అవినీతికి తావు లేకుండా సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు కదిలి మరోసారి జగన్‌ను సీఎంగా ఎన్నుకోవాలన్నారు.
చోడవరంలో రూ.1,900 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి : కరణం ధర్మశ్రీ
ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. సీఎం జగన్ చోడవరం నియోజకవర్గంలో 90 శాతం రాజకీయ, నామినేటెడ్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే అందించారన్నారు. నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి రూ.1,900 కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రధానంగా రూ.80 కోట్లతో రోడ్లు, నాడు – నేడు ద్వారా రూ.87 కోట్లు విద్యా రంగంలో ఖర్చు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, గొల్ల బాబురావు, తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment