chopper scam
-
అగస్టా కేసులో ఈడీ మరో చార్జిషీటు
న్యూఢిల్లీ: అగస్టావెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో అరెస్టయిన మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్, తదితరులు రూ.300 కోట్ల మేర లబ్ధి పొందారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పేర్కొంది. 3వేల పేజీల రెండో చార్జిషీటును గురువారం ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. ఈ చార్జిషీటులో మిషెల్ వ్యాపార భాగస్వామి డేవిడ్ సిమ్స్‌నూ చేర్చింది. వీరిద్దరూ గ్లోబల్ ట్రేడ్ అండ్ కామర్స్, గ్లోబల్ సర్వీసెస్ ఎఫ్జెడ్ఈ అనే సంస్థలు నడుపుతున్నారు. భారత ప్రభుత్వం, ఇటలీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ అగస్టావెస్ట్‌ల్యాండ్‌తో 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలో మధ్యవర్తులుగా మిషెల్, సిమ్స్ తదితరులు ఈ సొమ్మును పొందారని ఈడీ పేర్కొంది. ఆ రూ.300 కోట్ల సొమ్ము అగస్టా సంస్థే గ్లోబల్ ట్రేడ్ అండ్ కామర్స్, గ్లోబల్ సర్వీసెస్‌లకు చెల్లించిందని ఆరోపించింది. ఈడీ తాజా చార్జిషీటును పరిగణనలోకి తీసుకోవాలో వద్దో ఈ నెల 6వ తేదీన ప్రకటిస్తానని స్పెషల్ జడ్జి తెలిపారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసుకు సంబంధించి మిషెల్, ఇతర మధ్యవర్తులు రూ.225 కోట్ల మేర లబ్ధి పొందారని 2016లో న్యాయస్థానానికి సమర్పించిన మొదటి చార్జిషీటులో ఈడీ పేర్కొంది. -
చాపర్ స్కామ్‌లో త్యాగిపై చార్జిషీట్
న్యూఢిల్లీః యూపీఏ హయాంలో చోటుచేసుకున్న వీవీఐపీల చాపర్ స్కామ్‌కు సంబంధించి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి, మరో తొమ్మిది మందిపై సీబీఐ శుక్రవారం 30,000 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేసింది. అప్పటి ఎయిర్ వైస్ చీఫ్ జేఎస్ గుజ్రాల్, ఎస్పీ త్యాగి వరుసకు సోదరుడు సంజీవ్ అలియాస్ జూలీ త్యాగి, అగస్టావెస్ట్‌ల్యాండ్ మాజీ సీఈవోలు గిసెప్పి ఒర్సి, ఫిన్మెకానికాకు చెందిన బ్రూనో, దళారీ క్రిస్టియన్ మైఖేల్ తదితరులపై అభియోగాలు నమోదయ్యాయి. ముడుపులు స్వీకరించిన ఎస్పీ త్యాగి అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు కాంట్రాక్టు దక్కేలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసులో గత ఏడాది డిసెంబర్లో ఎస్పీ త్యాగి, సంజీవ్ త్యాగిలను సీబీఐ అరెస్ట్ చేయగా, వారిపై అభియోగాలు నమోదు చేయడంలో సీబీఐ విఫలం కావడంతో బెయిల్‌పై విడుదలయ్యారు. -
త్యాగికి ఊరట!
న్యూఢిల్లీ: వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో అరెస్టయిన మాజీ ఐఏఎఫ్ చీఫ్ ఎస్పీ త్యాగికి ఊరట లభించింది. ఆయనకు సోమవారం ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, మరొకరి ష్యూరిటీపై ఆయనకు ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి అరవింద్ కుమార్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తుకు ఆటంకం కల్పించవద్దని, సాక్షులను ప్రభావితం చేయకూదని షరతులు విధించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాపర్ల కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న త్యాగిని, అతని సోదరుడు సంజీవ్ త్యాగిని, లాయర్ గౌతం ఖైతాన్‌ని సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. త్యాగీ సోదరుడు, లాయర్ బెయిల్ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయి. -
నా తప్పుంటే ఉరి తీయండి
అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ ఒప్పందంలో తన తప్పు ఉన్నట్లు రుజువైతే తనను ఉరితీయాలని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. బీజేపీ తనమీద చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, వాళ్లు అసలు తన పేరు ఎలా ప్రస్తావించారని ప్రశ్నించారు. అసలు తాను ఆ ఫైలుమీద ఏమీ రాయలేదని, అది తన చేతిరాత కాదని చెప్పారు. ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంటే వాళ్లు విచారణ చేయాలని అన్నారు. ప్రభుత్వం వద్ద ఈ వ్యవహారంపై ఏమైనా ఆధారాలుంటే.. వాళ్లు సభలో ప్రకటన చేయాలని మరో కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ అన్నారు. హెలికాప్టర్ల కాంట్రాక్టు పొందడానికి అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీ దాదాపు రూ. 120-125 కోట్ల వరకు భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చినట్లు ఇటలీ హైకోర్టు తన తీర్పులో నిర్ధారించడంతో పార్లమెంటు ఉభయ సభల్లో ఈ అంశంపై బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. అగస్టా సంస్థ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆయన సన్నిహితుడు అహ్మద్ పటేల్, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులతో లాబీయింగ్ చేసినట్లు కోర్టు తన పరిశీలనలో తెలిపింది.