నా తప్పుంటే ఉరి తీయండి
అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ ఒప్పందంలో తన తప్పు ఉన్నట్లు రుజువైతే తనను ఉరితీయాలని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. బీజేపీ తనమీద చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, వాళ్లు అసలు తన పేరు ఎలా ప్రస్తావించారని ప్రశ్నించారు. అసలు తాను ఆ ఫైలుమీద ఏమీ రాయలేదని, అది తన చేతిరాత కాదని చెప్పారు. ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంటే వాళ్లు విచారణ చేయాలని అన్నారు.
ప్రభుత్వం వద్ద ఈ వ్యవహారంపై ఏమైనా ఆధారాలుంటే.. వాళ్లు సభలో ప్రకటన చేయాలని మరో కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ అన్నారు. హెలికాప్టర్ల కాంట్రాక్టు పొందడానికి అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీ దాదాపు రూ. 120-125 కోట్ల వరకు భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చినట్లు ఇటలీ హైకోర్టు తన తీర్పులో నిర్ధారించడంతో పార్లమెంటు ఉభయ సభల్లో ఈ అంశంపై బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. అగస్టా సంస్థ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆయన సన్నిహితుడు అహ్మద్ పటేల్, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులతో లాబీయింగ్ చేసినట్లు కోర్టు తన పరిశీలనలో తెలిపింది.