సర్జికల్ స్ట్రైక్స్‌పై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులపై ప్రధాని నరేంద్రమోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వాటిని ఆయన 'చిన్న దీపావళి'గా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ''మనం సెప్టెంబర్ 29వ తేదీన చిన్న దీపావళి సంబరాలు చేసుకున్నాం'' అన్నారు. సరిగ్గా అదేరోజు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద లాంచ్ప్యాడ్లపై భారత సైన్యం విరుచుకుపడి పెద్దసంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చింది. మన సైన్యం సరిహద్దుల్లో తమ ధీరత్వాన్ని ప్రదర్శించినప్పుడు వారణాసి మొత్తం ఆనందం వెల్లువెత్తందని, అందుకు అందరికీ కృతజ్ఞతలని ఆయన అన్నారు.
సైన్యం చూపించిన ధైర్యసాహసాలకు దేశం మొత్తం అభినందనలతో పాటు అపార మద్దతు కూడా తెలిపిందని, జాతికి వాళ్లు చేస్తున్న సేవలను కొనియాడిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. జవాన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేయాలని దేశవాసులను ఆయన కోరారు. రోజులో ప్రతి నిమిషం మనం వారిపట్ల గర్వంగా ఉన్నామన్న విషయాన్ని తెలియజేయాలన్నారు. వాళ్లు పగలు, రాత్రి మనకోసం పోరాడుతున్నారు కాబట్టి దీపావళి రోజున మన భద్రతాదళాలకు సందేశం పంపుదామన్నారు. రెండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకు గాను 71 స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. సుదీర్ఘ కాలం తర్వాత మరోసారి ఆ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోంది. గత 15 ఏళ్లుగా సమాజ్‌వాదీ పార్టీయే అక్కడ రాజ్యమేలుతోంది.