Chowdepalle
-
సంపు క్లీన్ చేస్తుండగా విద్యుత్ షాక్.. ముగ్గురు మృతి..
చిత్తూరు: చౌడేపల్లి మండలం పెద్ద కొండామారిలో విషాద ఘటన జరిగింది. విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సంపు క్లీన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచారు. మృతులను రమణ, మునిరాజా, రవిలుగా గుర్తించారు. మోటారు వైరు తెగి సంపులో పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని కుటుంబసభ్యులు తెలిపారు. విగతజీవులుగా మారిన వారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: ఘోర ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం.. -
మేకపోతు తెచ్చిన ఉపద్రవం!.. వంద మీటర్ల లోయలోకి పల్టీలు కొడుతూ..
చౌడేపల్లె: బలి ఇవ్వడానికి తెచ్చిన మేకపోతు లిప్తపాటులో ఉడాయించించి ఓ యువకుడి ప్రాణాలమీదకు తెచ్చింది. దానిని పట్టుకునే ప్రయత్నంలో అదుపు తప్పిన ఆ యువకుడు ఏకంగా వంద మీటర్ల లోయలోకి జారి పడ్డాడు. దీంతో మేకపోతు సంగతి పక్కనబెట్టి ఆ యువకుడిని కాపాడే ప్రయత్నాల్లో పడ్డారు. ఐదు గంటలకు పైగా శ్రమించి తాళ్ల సాయంతో అతడిని పోలీసులు, ఫైర్ సిబ్బంది వెలికితీశారు. బోయకొండలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ రవికుమార్ కథనం.. తిరుపతిలోని సప్తగిరినగర్‌కు చెందిన ఎన్.కుమార్ తన కుటుంబ సభ్యులు, బంధువులతో మంగళవారం బోయకొండ గంగమ్మకు మొక్కులు చెల్లించడానికి వచ్చారు. అమ్మవారికి పూజలు చేసి జంతుబలి సమర్పించడానికి ఉదయం 11 గంటల ప్రాంతంలో మేకపోతును తీసుకొని ఆలయం వద్దకు వచ్చారు. బలి ఇవ్వబోతున్న క్షణంలో అది ఒక్కసారిగా విదిల్చుకుని ఉడాయించింది. అటవీ ప్రాంతం వైపు పరుగులు తీసింది. దానిని కుమార్ కుమారుడు గణేష్(19)తోపాటు బోయకొండలో మటన్ కత్తిరించే కూలీ మంజు(28) వెంబడించారు. అది పరుగులు తీస్తూ సరాసరి చిత్తారికోట సమీపంలోని లోయ వద్ద ఏటవాలుగా ఉన్న బండపై ఆగింది. దానినే అనుసరిస్తూ వెళ్లిన గణేష్ మేకపోతును పట్టుకునే ప్రయత్నంలో అదుపు తప్పాడు. అక్కడి నుంచి వంద మీటర్ల లోయలోకి పల్టీలు కొడుతూ పడిపోయాడు. ఇది గమనించి మంజు ఎస్ఐకు సమాచారం ఇచ్చారు. ఆలయం వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజేష్ తాళ్ల సహాయంతో చాకచక్యంగా లోయలోకి దిగి గణేష్ వద్దకు చేరాడు. గాయాల పాలై షాక్‌లో ఉన్న అతడిని ఓదార్చి ధైర్యం చెప్పారు. నీళ్లు తాగించారు. ఇంతలో పుంగనూరు నుంచి ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. తాళ్ల సాయంతో లోయలోకి దిగారు. గణేష్‌ను లోయలోంచి వెలికి తీశారు. అప్పటికే సాయంత్రమైంది. ప్రభుత్వ వైద్య కేంద్రంలో గణేష్‌కు ప్రథమ చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధితుడిని ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ పరామర్శించారు. అమ్మవారి మహిమ వలనే తమ బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడని బాధితుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అప్పటికే మిగతా వాళ్లు ఆ మేకపోతును పట్టుకున్నారు. ఇక తప్పించుకునే అవకాశం ఏమాత్రం ఇవ్వలేదు. ఆలయం వద్ద మేకపోతు కథ ముగించి తిరుపతికి బయల్దేరారు. -
నేలరాలిన సాహితీ ‘సుమం’
చౌడేపల్లె(చిత్తూరు): ప్రముఖ కవి, సాహితీవేత్త, విజయవాణి ప్రింటర్స్, విజయవాణి విద్యా సంస్థల అధినేత నాయని కృష్ణమూర్తి (67) మరణించారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా నడిమిచెర్లలో 1951లో కృష్ణమూర్తి జన్మించారు. బాల్యం నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న నాయని తన 23 ఏళ్ల వయసులో యామినీ కుంతలాలు అనే నవల రాశారు. ఈ నవలకు 1974 ఉగాది నవలల పోటీలో తృతీయ బహుమతి లభించింది. అనంతరం కొంతకాలం బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలకు ఉపసంపాదకులుగా పనిచేశారు. పిల్లల పత్రిక స్నేహబాలను నడిపించారు. సోదరులతో కలిసి మాబడి, పాఠశాల మాసపత్రికలను నిర్వహించారు. తద్వారా గ్రామీణప్రాంత విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పడ్డారు. సాక్షరతా సమితి అకడమిక్ కమిటీ చైర్మన్‌గా పదిహేను సంవత్సరాలు పనిచేశారు. నిరంతర విద్యాకేంద్రాలకు వెలుగుబాట వారపత్రికను అందించారు. నాయని మరణవార్త తెలిసిన వెంటనే స్థానికులు, రచయితలు, కవులు, పలువురు నేతలు కన్నీటిపర్యంతమయ్యారు. కృష్ణమూర్తి పార్థివదేహానికి శుక్రవారం మధ్యాహ్నం 12:30కి చౌడేపల్లిలోని విజయవాణి స్కూల్ ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సీఎం సంతాపం నాయని కృష్ణమూర్తి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. మా బడి, పాఠశాల తదితర మాస పత్రికలు నిర్వహించి విద్యార్థులకు కృష్ణమూర్తి మార్గదర్శిగా నిలిచారని ఆయన కొనియాడారు. -
బోయకొండ వద్ద మరో ప్రమాదం; ఇద్దరి పరిస్థితి విషమం
చౌడేపల్లి(చిత్తూరు జిల్లా): బోయకొండ వద్ద వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుండ్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ గ్రామం సమీపంలో జరిగింది. వివరాలు.. బోయకొండలోని గంగమ్మ ఆలయానికి వెళ్లి వస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి గుండ్లను ఢీ కొట్టింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, ట్రాక్టర్ లోయలో పడిన సంఘటనకు 100 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది.