క్రీస్తు పూర్వం నుంచే పాత్రలపై పేరు చెక్కే పద్ధతి
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో ఉపయోగించే పాత్రలపై పేర్లు రాయించుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఆ వస్తువు కొన్నందుకు గుర్తుగా కొందరు రాయించుకుంటే, ఇతరులకు బహుమతిగా ఇచ్చేప్పుడు కొందరు రాయిస్తారు. ఇలా పాత్రలపై పేర్లు రాయించుకునే అలవాటు ఎప్పటినుంచి ఉందో తెలుసా..? క్రీ.పూ. నుంచే ఆ ఆనవాయితీ ఉందని తాజాగా లభించిన ఓ ఆధారం చెబుతోంది.
2 వేల ఏళ్ల క్రితం వినియోగించిన రాతి పాత్ర ఇటీవల వెలుగు చూసింది. దానిపై ప్రాకృత భాషలో చెక్కిన బ్రాహ్మీ లిపిని పరిశోధకులు గుర్తించారు. అది ఓ బౌద్ధ భిక్షుకి పేరుగా భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సమీపంలోని బొర్లామ్ గ్రామంలోని కవి మడివాళ్లయ్య మఠానికి చెందిన ఆది బసవేశ్వర దేవాలయం పరిసరాల్లోని ఓ మట్టి దిబ్బలో క్రీ.పూ.ఒకటో శతాబ్దికి చెందిన ఆ రాతి పాత్ర దొరికింది. పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ సంస్థ (ప్రీహా) బృందం ఆ పాత్రను గుర్తించింది.
బౌద్ధం జాడలు మరింత లోతుగా..
ఆ ప్రాంతంలో గతంలో బౌద్ధం జాడలు వెలుగుచూసిన నేపథ్యంలో.. ఈ పాత్ర కూడా బౌద్ధాన్ని అనుసరించిన వారు వినియోగించినదిగా ప్రాథమికంగా భావించారు. నిశితంగా పరిశీలించగా.. బ్రాహ్మీ లిపిలో రాసిన ప్రాకృత భాష అక్షరాలు కనిపించాయి. ‘హిమాబుహియ’ లేదా ‘హిమాబుధియా’ అన్న అక్షరాలుగా వాటిని గుర్తించారు. ప్రీహా బృంద ప్రతినిధులు డాక్టర్ ఎంఏ శ్రీనివాసన్, బి.శంకర్రెడ్డి, చుక్కా నివేదిత, శాలినులు దీనిపై పరిశోధించినట్టు ప్రీహా ఓ ప్రకటనలో పేర్కొంది.
హిమా అన్నది బౌద్ధ భిక్షుకి (మహిళ) పేరు అని బుధియ/బుహియ ఆమె ఇంటి పేరు అయి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. అది భిక్షా పాత్రేనన్నది వారి మాట. ఎపిగ్రఫిస్ట్ డాక్టర్ మునిరత్నం రెడ్డి ఆ అక్షరాలను పరిశీలించి.. ఆ లిపి పరిణామం ఆధారంగా అది క్రీ.పూ.ఒకటో శతాబ్దానికి చెందిందిగా చెప్పారు. లిపి తీరు ఆధారంగా ఆ రాతి పాత్ర కాలాన్ని గుర్తించారు.
ఈ ప్రాంతం మంజీరా నదికి ఐదు కి.మీ. దూరంలో ఉంది. గతంలో ఇక్కడికి చేరువలోని మాల్తుమ్మెదలో ఒక బ్రాహ్మీ శాసనం, ఏడుపాయల పరిసరాల్లో నాలుగు బ్రాహ్మీ శాసనాలు దొరికాయని, మంజీరా పరివాహక ప్రాంతంలో మరింత పరిశోధిస్తే శాతవాహనుల చరిత్ర మాత్రమే కాకుండా తెలంగాణలో బౌద్ధం జాడలు మరింత లోతుగా తెలుస్తాయని ప్రీహా ప్రతినిధి శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఈ రాతి పాత్రను గుర్తించటంలో స్థానిక మఠాధిపతి సోమాయప్ప సహకరించారని తెలిపారు.
కామారెడ్డి జిల్లా బొర్లామ్లో వెలుగుచూసిన రాతి పాత్ర.. దానిపై ప్రాకృత భాషలో
బ్రాహ్మీ లిపి అక్షరాలు