నకోజరి హీరో
క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందిన, వేల మైళ్ల దూరంలోని ఇద్దరు అన్న మాటలివి !‘ఈ రోజు మనం చేసే మంచి పనే రేపటి మన ఆనందంగా మారుతుంది’ - సోక్రటీస్
‘ప్రపంచంలోని చెడ్డ వాళ్ల కన్నా మంచివాళ్లు తమ మంచితనాన్ని ఉపయోగించకపోవడం వల్లే ప్రజల్లో అధిక శాతం మంది దుఃఖానికి గురవుతున్నారు’ - చాణుక్యుడు
21వ శతాబ్దంలో దలైలామా ఓ సందర్భంలో ఇలా అన్నారు... ‘ఆలయాలకి వెళ్లాల్సిన పని లేదు. క్లిష్టమైన వేదాంత సారం చదవాల్సిన పని లేదు. మన హృదయమే, మన మెదడే మన ఆలయం. ఆ వేదాంతం కరుణ’.
అందుకు మనిషి హృదయంలో ఓ చదరపు అంగుళం దయ ఉన్నా చాలు. అలాంటి దయ గల కొందరిని కలుసుకోండి. ఇది మీలో మంచిని ప్రేరేపించవచ్చు.
నవంబర్ 7, 1907లో మెక్సికోలోని నకోజరి గ్రామంలో డైనమేట్లని రవాణా చేసే ఓ రైలు పెట్టె అంటుకుంది. ఇది గమనించిన ఇంజిన్ డ్రైవర్ జెసుస్ గార్షియా... వెంటనే రైలు ఇంజిన్‌ని స్టార్ట్ చేసి గ్రామానికి పది మైళ్ల దూరం తీసుకెళ్లాక డైనమేట్ అంటుకుని పేలింది. ఆ చప్పుడు ఆ గ్రామంలోని వారందరికీ వినిపించింది. అతను రైలుని వెంటనే తీసుకెళ్లి ఉండకపోతే నకోజరి గ్రామం మొత్తం ఆ పేలుడికి నాశనమైపోయేది. గ్రామాన్ని రక్షించిన గార్షియా శరీరం పేలుడి ధాటికి ఛిన్నాభిన్నమైపోయింది.
అతని త్యాగానికి కృతజ్ఞతగా ఆ గ్రామానికి నకోజరి డి గార్షియా అనే పేరు పెట్టుకున్నారు. అంతేకాక మెక్సికోలోని చాలా వీధులకి అతని పేరు పెట్టారు. గార్షియా గౌరవార్థం ఏటా నవంబర్ 7న రైల్వే దినోత్సవంగా జరుపుతున్నారు. అతని త్యాగాన్ని వర్ణిస్తూ అనేక పాటలు, నాటకాలు, పద్యాలు ఉన్నాయి.
పృథ్వీరాజ్