ప్రశ్నించడం నేర్పిన తొలి మేధావులు | Sakshi
Sakshi News home page

ప్రశ్నించడం నేర్పిన తొలి మేధావులు

Published Sun, May 26 2024 4:18 AM

ఎపిక్యురస్, సోక్రటీస్‌

సందర్భం

‘దేవుడు చెడును ఆపాలని కోరుకుంటున్నా ఆపలేకపోతున్నాడా? అలా అయితే, అతను సృష్టి లయలను తన అధీనంలో ఉంచుకున్నవాడు కాదు. అతను సమర్థుడే, కానీ ఆపాలని కోరుకోవడం లేదా? అయితే అతను పగ, ద్వేషమూ గలవాడన్న మాట! అతను చెడును ఆపాలని కోరుకునేవాడు, పైగా సమర్థుడూ అయితే... మరి చెడు ఎందుకు రాజ్యమేలుతోందీ?– సమాధానం కావాలి!  పోనీ, అతను చెడును ఆపాలని కోరుకోవడమూ లేదు – పైగా సామర్థ్యమూ లేదా? ఇక ఎందుకండీ ఆయనకు ఆ దేవుడనే బిరుదూ?’ అని ప్రశ్నించాడు ఎపిక్యురస్‌ (క్రీస్తు పూర్వం 341–270) అనే పురాతన గ్రీకు తత్త్వవేత్త. ‘ఎపిక్యురిజమ్‌’కు ఆయనే సిద్ధాంతకర్త. ఆయన రచనలు సుమారు మూడు వందల రాత ప్రతులున్నట్లు తెలిసింది. 

ఆయనపై డెమోక్రైటస్‌ అరిస్టిప్పస్, పైరో లాంటి వారి ప్రభావం ఉంది. ఎపిక్యురస్‌ బోధనలు తొలి దశలో సైన్సుకు ఆధారమయ్యాయి. ఎందుకంటే ఆయన రుజువుల్ని యథార్థాలనే నమ్మాలన్నాడు.  క్రీ.పూ. 800–200 మధ్య కాలాన్ని ఏగియల్‌ యుగంగా పరిగణించారు. ఆ యుగంలో వైజ్ఞానిక ధోరణితో ఆలోచించి శాస్త్రయుగ కర్తగా నిలిచినవాడు ఎపిక్యురస్‌! గ్రీస్‌లో లాగానే ఇలాంటి ఆలోచనా ధోరణి గల వారు ఇండియా, చైనా, ఇరాన్‌ లాంటి దేశాల్లో ఉన్నారని కార్ల్‌ జాస్‌పర్స్‌ (1883–1969) అనే జర్మనీ తత్వవేత్త పరిశీలనలో తేలింది. ఆయన పరిశీలనల్లో వాస్తవం ఉందనిపిస్తుంది. ఎందుకంటే సాధారణ శకానికి పూర్వమే మన భారత్‌లో చార్వాకులు, హేతువాదులు విస్తరించి ఉన్నారు. సమాజానికి ప్రశ్నించడం నేర్పారు.

ఎపిక్యురస్‌ ఆనాటి మేధావులందరితో విభేదించినా, డెమోక్రైటస్‌ (క్రీ.పూ. 460–370) వెలుగులోకి తెచ్చిన అటమిక్‌ థియరీని బలపరిచాడు. ఈ విశ్వం అతి సూక్ష్మమైన అణువులతో రూపొందిందనీ, అవి ఒకదానితో ఒకటి ఢీ–కొట్టుకుంటూ, విడిపోతూ, మళ్ళీ దగ్గరవుతూ ఉంటాయనీ, ఇవి నాశనం కావనీ, వీటి వల్లనే ‘పదార్థం’  ఏర్పడుతుందనీ డెమోక్రైటస్‌ భావించాడు. ఈ ‘ఆటమిక్‌ థియరీ’ని ఎపిక్యురస్‌ గట్టిగా నమ్మాడు. అయితే డెమోక్రైటస్‌ ఈ సిద్ధాంతం తనదని చెప్పుకోలేదు. తనకు గురుతుల్యుడైన లుసిప్పస్‌ (క్రీ.పూ. 5వ శతాబ్దం) ప్రతిపాదించాడనీ, తను కేవలం ఆ ఆటమిక్‌ థియరీని వెలుగులోకి తెచ్చానన్నాడు. లుసిప్పస్‌ తత్వవేత్త. మెటాఫిజిస్ట్‌ ఆటమిక్‌ ధియరీ ఎవరిదైనా కావచ్చు. కానీ అది వాస్తవం! ఆనాడు డెమోక్రైటస్‌ ప్రభావం ఎపిక్యురస్‌ పైనే కాదు, ఆధునిక కాలపు కార్ల్‌మార్క్స్‌పైనా ఉంది. 

ఎపిక్యురస్‌కు కొంచెం అటు ఇటుగా దృష్టి సారిస్తే, మనకు మిలోస్‌కు చెందిన డయగోరస్, సైరిన్‌కు చెందిన థియడోరస్‌లు కనిపిస్తారు (క్రీ.పూ. 5వ శతాబ్దం) వీరిలో డయగోరస్‌ గ్రీకు కవి, హేతువాది. థియడోరస్‌ నాటి గ్రీకు గణిత శాస్త్రవేత్త. ఆయన పేరుతోనే ‘స్పైరల్‌ ఆఫ్‌ థియడోరస్‌’ అనే గణిత సూత్రం ఉంది. 

పశ్చిమాన పరిస్థితి అలా ఉంటే, మన తూర్పు దేశాల్లో బౌద్ధం, జైనం, టోయిజం వంటివి వ్యాపించి విగ్రహారాధనను నిరసించాయి.  డయగోరస్‌ తర్వాత– థియడోరస్, యుథిమిరస్‌ వెలుగులోకి వచ్చారు. గ్రీస్‌లో నిరీశ్వర వాదం ఆ రోజుల్లో పెద్ద నేరం! తత్త్వవేత్త సోక్రటీస్‌ (క్రీ.పూ. 399)కు శిక్ష పడింది కూడా ఆ విషయం గురించే! నాటి సమాజం గుడ్డిగా నమ్ముతున్న దేవుళ్ళను సోక్రటీస్‌ తిరస్కరించాడు. అతని ప్రభావంలో పడి యువత చెడిపోతోందని పాలకులు అతనికి మరణశిక్ష విధించారు. ఆ ఆ శిక్షను నింపాదిగా, నిబ్బరంగా స్వీకరించాడు. 

ఫ్రెంచ్‌ విప్లవ నేపథ్యంలో యూరోప్‌లో హేతువాదం బాగా పుంజుకుంది. ఫ్రెంచ్‌ విప్లవ ప్రభావం యూరోప్‌ సమాజంపై బాగా పడిన తర్వాత, విశ్వాసానికి – విశ్వసనీయతకు ఘర్షణ జరిగింది. క్రైస్తవ రహిత సమాజం రూపుదిద్దుకో నారంభించింది.

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 19వ శతాబ్దంలో వచ్చిన సామాజిక ఉద్యమాల వల్ల అక్కడి సమాజంలో ‘స్వేచ్ఛాలోచన’ బాగా స్థిరపడింది. కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం 1917 రష్యా విప్లవం ప్రభావంతో సమాజంలో హేతువాదం బాగా పెరిగింది. అందువల్ల మార్క్సిస్టు – లెనినిస్టుల ప్రభుత్వం ఏర్పడింది. 

సమాజంలో హేతుబద్ధత పెంచాలంటే, లక్షల సంఖ్యలో కార్యకర్తలు నడుం బిగించాలి. వేల సంఖ్యలో రచయితలు కలాలు పట్టాలి. అప్పుడు గానీ, వైజ్ఞానిక స్పృహ గల ప్రభుత్వాలు ఏర్పడవు.  అమాయకులంతా మాయమాటలు చెప్పే మోసగాళ్ళనే నమ్ముతారు. దీనికి పరిష్కారమెక్కడుందీ? వాస్తవాలు తెలుసుకోవడంలో ఉంది. నిజాల్ని జీర్ణించుకోవడంలో ఉంది.  

డాక్టర్‌ దేవరాజు మహారాజు 
వ్యాసకర్త సాహిత్య అకాడెమీ అవార్డ్‌ గ్రహీత

Advertisement
 
Advertisement
 
Advertisement