ch.vidyasagar rao
-
బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్‌రావు
చెన్నై: తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్‌గా మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు సాయంత్రం రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్లో ఆయన ఇన్ఛార్జ్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్.. విద్యాసాగర్‌రావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య పదవీ కాలం బుధవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం తన బాధ్యతల్ని రోశయ్య... విద్యాసాగర్‌రావుకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జయలలితతోపాటుగా మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. -
31న దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం జరిగిన బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో నాయకుడిగా దేవేంద్ర ఫడ్నవిస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ఆహ్వానించారని, ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని అక్టోబర్ 31 తేదిగా నిర్ణయించామని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. 15 రోజుల్లోగా బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ సూచించినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. మంత్రివర్గంలో బెర్తుల కోసం శివసేన ప్రతిపాదనల్ని పంపినట్టు సమాచారం. ఈ సాయంత్రం శివసేన, బీజేపీల మధ్య సమావేశం థాక్రే నివాసం మాతోశ్రీలో జరుగనుంది. -
ముచ్చటగా మూడోవాడు!
ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ సహాయమంత్రి సీహెచ్ విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. దాంతో ఆ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ముచ్చటగా మూడో అచ్చ తెలుగువ్యక్తి సిహెచ్. విద్యాసాగరరావు. ఇప్పటికే ఇద్దరు తెలుగు వ్యక్తులు మహారాష్ట్ర గవర్నర్ పదవిని అలంకరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన ప్రభాకర్ రావు (ప్రముఖ సినీ మాటల రచయిత కోన వెంకట్ తాతగారు) మహారాష్ట్ర గవర్నర్ పదవిని చేపట్టిన మొట్టమొదట తెలుగు వ్యక్తి. దాదాపు ఏడాదిపైగా ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆ పదవిని అలంకరించిన రెండో వ్యక్తి. ఆయన రెండేళ్ల వరకు ఆ పదవిలో ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తెలుగు వ్యక్తి సిహెచ్ విద్యాసాగరరావు ఆ పదవిని చేపట్టనున్నారు. బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహారించిన విద్యాసాగరరావు... రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రంలో హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం విదితమే. గతంలో ఎన్డీఏ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వి. రామారావును సిక్కిం గవర్నర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ 282 సీట్లు కైవసం చేసుకుంది. దాంతో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూపీఏ ప్రభుత్వ హాయాంలో నియమించిన గవర్నర్లకు మంగళం పాడుతూ వారి స్థానాల్లో బీజేపీ నాయకులను గవర్నర్ పదవుల్లో నియమించే కార్యక్రమంలో భాగంగా విద్యాసాగర్ రావు ఎంపిక జరిగింది.