చింతచిగురు... రుచుల పొగరు!!
ఓ పట్టాన ఏదీ తిననంటూ మారాం చేసే పిల్లలున్నారా? ఆ తల్లి చెంత చింతచిగురుండగా ఏల చింత? ఇకపై అంతా నిశ్చింత! లొట్టలేసుకుని తింటారంతా!! చింతచిగురు పప్పు చేస్తే ఆ వంట ఓ క్లాసిక్. చింతచిగురుతో చేపలు వండితే అదో ఎథ్నిక్... నాన్వెజ్ ప్రియుల కోసం మటన్ కలిపినా... వెజ్ తినేవాళ్ల కోసం మీల్మేకర్ మిక్స్ చేసినా... చింతచిగురు వంటతో పెరుగుతుంది రుచుల విగరు. చింతచిగురు టేస్టు ఎంత గొప్పదంటే... చింత చచ్చినా పులుపు ఛస్తుందో లేదోగానీ... దాని తాలూకు రుచులు మాత్రం చచ్చినా చావవు... అదీ చిగురు విగరు తాలూకు పొగరు.రైసూ, పచ్చడీ, పొడీ అంటూ కొత్త కొత్త రుచులు ట్రై చేయండి... ఆలస్యమెందుకు, చింత వదిలి... చిగురుతో ఐటమ్స్ వండేయండి.
చింతచిగురు మటన్ కూర
కావలసినవి:
నూనె - టేబుల్ స్పూను; ఆవాలు - టేబుల్ స్పూను; జీలకర్ర -టేబుల్ స్పూను; ఎండు మిర్చి - నాలుగు; గరం మసాలా - టీ స్పూను; ఉల్లితరుగు - పావు కప్పు; పసుపు - చిటికెడు; అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; కొబ్బరి తురుము - టీ స్పూను; మటన్ - అర కేజీ; చింతచిగురు - అర కేజీ; ధనియాల పొడి - టీ స్పూను; పుదీనా - చిన్న కట్ట; ఉప్పు - తగినంత; కొత్తిమీర - ఒక కట్ట
తయారీ:
బాణలిలో కొద్దిగా నూనె వేసి, కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, గరం మసాలా వేసి వేయించాలి
పుదీనా ఆకు జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి
ఉల్లి తరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కొద్దిగా ఉడికించాలి కొబ్బరి తురుము, ధనియాల పొడి, మటన్, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి (అవసరమనుకుంటే కుకర్లో ఉడికించవచ్చు)
మటన్ ఉడికిన తర్వాత చింతచిగురు జత చేసి, బాగా కలిపి తడి పోయేవరకు ఉడికించాలి
కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించాలి.
చింతచిగురుచిత్రాన్నం
కావలసినవి:
నూనె - అర కప్పు; చింత చిగురు - 2 కప్పులు; ఆవాలు - టీ స్పూను; ఎండు మిర్చి - 7; పచ్చి మిర్చి - 6; ఉప్పు - తగినంత; మినప్పప్పు - టీ స్పూను; సెనగపప్పు - 2 టీ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; కరివేపాకు - 2 రెమ్మలు; జీడిపప్పు పలుకులు - 4 టేబుల్ స్పూన్లు; అన్నం - 8 కప్పులు
తయారీ:
ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక చింత చిగురు వేసి బాగా కలిపి మూత పెట్టాలి
ఉప్పు వేసి మరోమారు కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించి, దింపి, చల్లారాక, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
చిన్న బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించాలి
పెద్ద పళ్లెంలో అన్నం వేసి బాగా పరిచి, అందులో వేయించి ఉంచుకున్న పోపు, మెత్తగా చేసుకున్న చింతచిగురు వేసి కలపాలి
జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేయాలి.
మీల్ మేకర్ చింతచిగురు కూర
కావలసినవి:
నూనె - 3 టీ స్పూన్లు; జీలకర్ర - అర టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; ఉల్లి తరుగు - అర కప్పు; అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; పసుపు - చిటికెడు; మీల్ మేకర్ - 2 కప్పులు (సుమారు రెండు గంటలు నానబెట్టి, నీరు తీసేయాలి); చింతచిగురు - కప్పు; జీలకర్ర పొడి - టీ స్పూను; ధనియాల పొడి - టీ స్పూను;
ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను
తయారీ:
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక జీలకర్ర, కరివేపాకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, తరుగు, పసుపు వేసి వేయించి మూత ఉంచాలి
ఉడికిన తర్వాత మూత తీసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి
నానబెట్టుకున్న మీల్ మేకర్ జతచేయాలి
ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి బాగా కలిపి మూత ఉంచి, సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి
చింతచిగురు జత చేసి, ఆకు మెత్తపడే వరకు ఉడికించి, దించాలి
ఇది చపాతీలలోకి బాగుంటుంది.
చింతచిగురు వంకాయ కూర
కావలసినవి:
చింతచిగురు - కప్పు; కారం - టీ స్పూను; వెల్లుల్లి రేకలు - 2; ఎండుకొబ్బరి తురుము - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; వంకాయలు - పావు కేజీ (చిన్న ముక్కలుగా తరగాలి); ఉల్లితరుగు - అర కప్పు; పసుపు - చిటికెడు
పోపు కోసం: నూనె - టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; సెనగపప్పు - అర టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; ఎండు మిర్చి - 3; కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ:
చింతచిగురును శుభ్రం చేసి, కడిగి నీడలో ఆరబోయాలి
మిక్సీ జార్లో చింతచిగురు, కారం, వెల్లుల్లి రేకలు, ఎండుకొబ్బరి తురుము, ఉప్పు వేసి మెత్తగా చేసి, పక్కన ఉంచాలి
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మినప్పప్పు, సెనగపప్పు వేసి వేయించాలి ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి మరో మారు వే యించాలి
ఉల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి
వంకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత ఉంచాలి
ముక్కలు ఉడుకుపడుతుండగా, చింతచిగురు పేస్ట్ వేసి, వంకాయ ముక్కలకు పట్టేలా కలిపి సుమారు ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి
వేడి వేడి అన్నంలో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.
చింతచిగురు చేపల పులుసు
కావలసినవి:
చేపలు - అర కే జీ; పసుపు - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; నూనె - 4 టీ స్పూన్లు; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చి మిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; మెంతి కూర - అర కప్పు; అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 టీ స్పూన్లు; చింతపండు రసం - 3 టీ స్పూన్లు; చింతచిగురు - కప్పు; గరం మసాలా పొడి - టీ స్పూను
తయారీ:
ఒక పాత్రలో చేపలు, పసుపు, ఉప్పు, కారం వేసి కొద్దిసేపు ఊరనివ్వాలి
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి
మెంతి కూర వేసి వేయించాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు కలపాలి
ఊరబెట్టిన చేపలను జత చేసి జాగ్రత్తగా కలిపి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి
చింతపండు రసం, కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి
చింతచిగురు వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి
గరంమసాలా పొడి వేసి కలిపి రెండు నిమిషాలు ఉడకనిచ్చి దించేయాలి.
చింతచిగురు పొడి
కావలసినవి:
చింతచిగురు - కప్పు; నూనె - టీ స్పూను; వెల్లుల్లి రేకలు - 2; పల్లీలు - 4 టీ స్పూన్లు; సెనగపప్పు - 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి - 8; ధనియాలు - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత;
తయారీ:
చింత చిగురును శుభ్రం చేసి నీళ్లలో బాగా కడిగి, బయటకు తీసి, నీడలో ఆరబెట్టాలి బాణలిలో నూనె వేసి కాగాక వెల్లుల్లి రేకలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి
పల్లీలు, సెనగపప్పు, ఎండు మిర్చి వేసి రెండు నిమిషాలు వేయించాలి
చివరగా ధనియాలు జత చేసి వేయించి దింపి, చల్లార్చాలి
అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆరబెట్టుకున్న చింత చిగురు వేసి పొడి పొడిలాడే వరకు వేయించి, దించేయాలి
మిక్సీలో ముందుగా వేయించి ఉంచుకున్న పల్లీల మిశ్రమం, ఉప్పు వేసి మెత్తగా చేయాలి
వేయించి ఉంచుకున్న చింత చిగురు జత చేసి మరోమారు తిప్పి పొడి చేసుకోవాలి వేడి వేడి అన్నంలో, నెయ్యి జత చేసుకుని తింటే రుచిగా ఉంటుంది.