తోక ముడిచిన సర్కార్
పట్టిసీమ చర్చను వ్యూహాత్మకంగా అడ్డుకున్న ప్రభుత్వం
అనుమతి నిరాకరణ పేరుతో చర్చకు చెక్
పోలీసుల అదుపులో ఉండవల్లి, గోరంట్ల
విజయవాడలో హైడ్రామా
వాస్తవమేంటో తేలుతుందని భావించిన జిల్లా ప్రజలకు నిరాశ
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
‘ఆశ దోశ అప్పడం...పట్టిసీమపై చర్చ జరిగిపోద్దనే!....చర్చిస్తే అవినీతి బయటపడి పోదూ. తమ పరువేం కావాలి....గంగలో కలిసిపోదూ!. అంత ఈజీగా ఒప్పుకుంటామా ఏంటీ? సవాల్ విసిరినంత మాత్రాన చర్చ జరిగిపోవాలా? ఎవరి ఉచ్చులో మనమెందుకు చిక్కుకోవాలి? అని అనుకుందో ఏమో గాని పట్టిసీమపై జరగాల్సిన చర్చ విషయంలో సర్కార్ తోక ముడిచింది. అనుమతి లేదంటూ సవాళ్లు...ప్రతిసవాళ్లు విసిరిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అదుపులోకి తీసుకుని వ్యూహాత్మకంగా చర్చకు చెక్ పెట్టింది. ఏదో ఒకటి తేలిపోతుందని విజయవాడ వైపు చూసిన జిల్లా ప్రజలకు నిరాశే మిగిలింది.
పట్టిసీమ ప్రాజెక్టు వేదికగా అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. సీఎం చంద్రబాబు దగ్గరి నుంచి కింది స్థాయి నేతల వరకు అవినీతిలో భాగముందని రాష్ట్రమంతా కోడై కూస్తోంది. ముడుపుల కోసమే ప్రాజెక్టు చేపట్టారని ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల తరఫున ఉండవల్లి అరుణ్‌కుమార్, ప్రభుత్వం తరపున గోరంట్ల బుచ్చయ్య చౌదరి వకాల్తా పుచ్చుకుని...సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుని చర్చకు సై అన్నారు. విజయవాడను వేదికగా చేసుకున్నారు. ఇద్దరూ సమాయత్తమయ్యారు. దీంతో అందరి దృష్టి విజయవాడపై మళ్లింది. రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ వస్తుందని ఆశపడ్డారు. కానీ సర్కారు వ్యూహాత్మకంగా పావులు కదిపి ముగింపు పలికింది.
.
విజయవాడలో హైడ్రామా...
అనుకున్నట్టే ప్రభుత్వం తోకముడిచింది. పట్టిసీమపై అంత ఈజీగా చర్చకు అనుమతిస్తుందా? అన్న అనుమానాలను నిజం చేసింది. చర్చ జరిగితే ఎక్కడ అవినీతి బయటపడిపోతుందనో..ఎవరికెంత ముడుపులందాయో తెలిసిపోతుందనో... ఎందుకొచ్చిన రాద్ధాంతమనో తెలియదు గాని చర్చ జరిగిన రోజున అనుమతి లేదంటూ వ్యూహాత్మకంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. చర్చ జరగనివ్వకుండా అడ్డుకుంది. అనుమతి నిరాకరణ పేరుతో సవాళ్లు స్వీకరించిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అడ్డుకుని అదుపులోకి తీసుకుంది. చెప్పినట్టుగానే ప్రకాశం బ్యారేజీ వద్దకు ఉండవల్లి అరుణ్‌కుమార్ ముందుగా చేరుకున్నారు. నిర్ధేశించిన ఉదయం 11 గంటలకు మాత్రం బుచ్చయ్య చౌదరి చేరుకోలేదు. ఆ తర్వాత బుచ్చయ్య చౌదరి భారీగా వాహనాలతో తరలివచ్చారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. కాకపోతే ఇక్కడ బుచ్చయ్య చౌదరి ప్రజలకు అనుమానం రాకుండా తమదైన సీన్ రక్తి కట్టించారు. పోలీసులతో వాగ్వాదం చేసి...బహిరంగ చర్చకు వెనక్కి తగ్గేది లేదని పేర్కొంటూ హడావుడి సృష్టించారు. ఇది చూసిన వారు ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రశాంత వాతావరణంలో చర్చకు అనుమతిస్తే ఎవరి లెక్కేంటో? ఎవరి వాదనలో పస ఉందో తేలిపోయేదని....చర్చను అడ్డుకోవడమంటే ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టే అన్న వాదనలు వినిపించాయి. అవినీతి లోగుట్టు బయటపడకూడదనే ఈ ఎత్తుగడ చంద్రబాబు వేశారని పరిశీలకులు భావిస్తున్నారు.