City Traffic Wing
-
కస్సు బస్సు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు రోడ్లపై హడలెత్తిస్తున్నాయి. సిటీ, ఇతర జిల్లాలు, రాష్ట్రాల బస్సులనే తేడా లేకుండా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. ఇటీవల ఆ సంస్థ తీసుకున్న ‘డ్రైవర్ నంబర్’ నిర్ణయం సైతం సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను ప్రోత్సహించేలా ఉంది. మరోపక్క నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గించే ఉద్దేశంతో పోలీసు విభాగం ప్రతిపాదించిన రూట్ల పొడిగింపు అంశాన్నీ ఆ సంస్థ పట్టించుకోవట్లేదు. నడిరోడ్లే వారికి బస్‌బేలు.. నగరంలో తిరిగే సిటీ బస్సుల కోసం అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా బస్టాపులు, బస్ బేలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఇతర వాహనాలు ఆగకుండా కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ సిబ్బంది కూడా పని చేస్తుంటారు. అనేక సిటీ బస్సులు వీటిల్లో కాకుండా నడిరోడ్డుపై ఆగుతుంటాయి. ఒకేసారి అనేక బస్సులు రావడంతో పాటు డ్రైవర్ల నిర్లక్ష్యమూ దీనికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇది చాలదన్నట్లు ఇటీవల ఆర్టీసీ అధికారులు ప్రయాణికులు ఎక్కడ చెయ్యెత్తితే అక్కడ బస్సులు ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో బస్టాప్‌లు, బస్ బేలు ఉన్న చోట మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ నడిరోడ్లపై ఆగుతున్న ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్నాయి. రూట్లపై స్పందన నామమాత్రం.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరే ఆర్టీసీ బస్సుల గమ్యస్థానం మెహిదీపట్నంగా ఉంటోంది. ఈ రూట్లు ఇక్కడితో ముగిసిపోతుండటంతో స్థానికంగా ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. అవే ఆర్టీసీ బస్సు రూట్లు అటు షేక్‌పేట్, ఇటు అత్తాపూర్ వరకు ఉంటే మెహిదీపట్నం ప్రాంతంలో రద్దీ తగ్గుతుంది. రాజధానిలోని అనేక ఆర్టీసీ రూట్లు ఇలానే ఉన్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్ వింగ్ వీటి పొడిగింపుపై దృష్టి పెట్టింది. దీనికి అవసరమైన అధ్యయనంలో బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ నిపుణుల సహాయం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆర్టీసీ అధికారులను కోరింది. దీనిపైనా ఆ విభాగం నుంచి నామమాత్రపు స్పందనే వచ్చింది. అధ్యయనానికి ఏమాత్రం ఉపకరించని విధంగా ప్రతిపాదనలు పంపడం విమర్శలకు తావిస్తోంది. (చదవండి: పైసలు తీసుకుంటూ పట్టుబడ్డారు) -
‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో వాహనాల వేగానికి కళ్లెం వేసేలా పక్కాగా ప్రణాళిక అమలు చేయడానికి సిటీ ట్రాఫిక్ వింగ్ సన్నాహాలు చేస్తోంది. ఈ–చలాన్లు విధించడం మొదలెట్టడానికి ముందు కొన్ని రోజుల పాటు వాహనచోదకులకు అవగాహన పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రవాణా శాఖ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డివైడర్లు ఉన్న మార్గాల్లో కార్లు గరిష్టంగా గంటకు 60 కి.మీ., మిగిలిన వాహనాలు 50 కి.మీ., అవి లేని రూట్లలో వీటి వేగాన్ని గంటకు 50 కి.మీ., 40 కి.మీ.గా నిర్దేశించారు. కాలనీల్లో ఏ వాహనమైనా గంటకు 30 కి.మీ. వేగమే. ప్రస్తుతం రహదారులపై ఉన్న సూచికల బోర్డుల్లో పాత వేగ పరిమితులే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో ఆయా ప్రాంతాల్లో కొత్తగా బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఇక పరిమితికి మించిన వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించడానికి ప్రస్తుతం ఆరు స్పీడ్ లేజర్ గన్స్, 44 సీసీ కెమెరాలను అనుసంధానించిన సాఫ్ట్వేర్ ఉపకరిస్తున్నాయి. వీటిని మరింతగా పెంచాలని భావిస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించి ఉండే సీసీ కెమెరాలు తమ ముందు ప్రయాణిస్తున్న వాహనం వేగాన్ని క్షణాల్లో గుర్తించగలుగుతాయి. పగలు, రాత్రి కూడా వేగాన్ని గుర్తించడానికి ఉపకరించే విధంగా సాఫ్ట్వేర్, కెమెరాలను అభివృద్ధి చేయనున్నారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణించే వాహనాలకు చలాన్లు జారీ చేసే ముందు పెద్ద ఎత్తున అవగాహన కల్పించనున్నారు. దీనికోసం సైనేజ్ బోర్డులు, సోషల్ మీడియా తదితరాలను వాడాలని నిర్ణయించారు. సుదీర్ఘ అధ్యయనం చేశాం నగరంలో వేగ పరిమితుల విధింపుపై సుదీర్ఘ అధ్యయనం చేశాం. చండీఘర్, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు సిటీల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేశాం. చండీఘర్ మోడల్‌ను హైదరాబాద్‌కు అనువుగా మార్పుచేర్పులు చేసి సిఫార్సు చేశాం. ఉత్తర్వుల్లో ఉన్న వేగ పరిమితులు అన్ని రహదారులకు వర్తిస్తాయి. తాజా ఉత్తర్వులు అమలులో వచ్చినా ఓఆర్ఆర్, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌వే మార్గాల్లో గతంలో సూచించిన వేగమే వర్తిస్తుంది. రింగ్ రోడ్ మీద లారీలు గంటకు 80 కి.మీ., కార్లు వంటివి గంటకు 100 కి.మీ., ఎక్స్‌ప్రెస్ వే మీద గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్ (చదవండి: ప్రజాప్రయోజనాల కోసమే భూసేకరణ: హైకోర్టు ) -
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌కు స్వాగతం!!
►ఐవీఆర్ఎస్ కాల్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం ►పెండింగ్ ఈ–చలాన్ల వివరాలు తెలిపేందుకే ►భవిష్యత్తులో అందుబాటులోకి జోనల్ సెంటర్లు సిటీబ్యూరో: ‘హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌కు స్వాగతం... తెలుగు కోసం ఒకటి నొక్కండి... హిందీ కే లియే దో దబాయే... ఫర్ ఇంగ్లీష్ ప్రెస్ త్రీ’... ఇదేంటా అనుకుంటున్నారా...? సిటీ ట్రాఫిక్ వింగ్ ఏర్పాటు చేయనున్న ఐవీఆర్ఎస్ కంట్రోల్ రూమ్ నుంచి వినిపించనున్న మాటలు...వివరాల్లోకి వెళితే.. ఒకప్పుడు రహదారులపై చలాన్ పుస్తకాలతో కనిపించే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిర్వహణను కూడా పక్కన పెట్టి జరిమానాలు విధించడం, వసూలు చేయడంపై దృష్టి పెట్టేవారు. అయితే ప్రస్తుతం సిటీలో పూర్తి స్థాయిలో నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానం అమలవుతుండటంతో క్షేత్రస్థాయి సిబ్బంది నేరుగా జరిమానాలు విధించడం మానేశారు. కేవలం తమ వద్ద ఉన్న కెమెరాలో ఉల్లంఘనని బంధించడం ద్వారా ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ చలాన్లు పంపిస్తున్నారు. పక్కాగా లేని చిరునామాలు... ఈ–చలాన్లను ట్రాఫిక్ విభాగం అధికారులు ఆర్టీఏ అధికారుల రికార్డుల్లో ఉన్న చిరునామాల ఆధారంగా జారీ చేస్తున్నారు. ఆ డేటాబేస్‌తో అనుసంధానం ఏర్పాటు చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు తమ కంప్యూటర్లో ఓ ఉల్లంఘనకు పాల్పడిన వాహనం నెంబర్ ఎంటర్ చేస్తే... ఆటోమేటిక్‌గా ఆర్డీఏ డేటాబేస్ నుంచి సదరు వాహనం చిరునామా గుర్తించే సర్వర్ ఆ చిరునామాకు ఈ–చలాన్ జారీ చేస్తుంది. అయితే ప్రస్తుతం దాదాపు 50 శాతం వాహనదారుల చిరునామాలు అప్డేట్ కాలేదు. వాహనం ఓ చిరుమానాతో ఉంటే ప్రస్తుతం యజమాని మరో చిరునామాలో నివసిస్తున్నాడు. దీంతో తమ వాహనంపై చలాన్ జారీ అయిందనే విషయం దాని యజమానికి తెలియట్లేదు. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ యూజర్స్కే... దీంతో ట్రాఫిక్ విభాగం అధికారులు పెండింగ్ ఈ–చలాన్ల వివరాలు తెలుసుకోవడానికి అనేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా వెబ్సైట్లు, యాప్స్ రూపొందించడంతో పాటు ట్రాఫిక్, నగర పోలీసు అధికారిక వెబ్సైట్లలోనూ దీనికి సంబంధించిన లింకులు ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ కేవలం కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న వాహనచోదకులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటున్నాయి. ప్రస్తుతం సిటీలో బేసిక్ ఫోన్లను వినియోగిస్తున్న వారి సంఖ్యా ఎక్కువగానే ఉంటోంది. వీరెవరికీ ఈ వెబ్సైట్లు, యాప్స్ అందుబాటులో ఉండట్లేదు. వీరి కోసమే ఐవీఆర్ఎస్ కాల్ సెంటర్... ఇలాంటి వాహనచోదకుల కోసం ప్రత్యేకంగా ఇంటర్యాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్ఎస్) విధానంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నగర ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. ఇందుకుగాను ఓ కంపెనీతో జరుపుతున్న సంప్రదింపులు తుది దశకు చేరాయి. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఇది సేవలు అందించనుంది. దీనికి కేటాయించే ప్రత్యేక నెంబర్‌కు ఫోన్ చేసే వాహనచోదకుడు తమ భాషను ఎంచుకుని, వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు... దానిపై పెండింగ్‌లో ఉన్న చలాన్లు, ఎంత మొత్తం అనే వివరాలు కంప్యూటరే వివరిస్తుంది. జోన్ల స్థాయిలోనూ సెంటర్ల ఏర్పాటు.. నగర ట్రాఫిక్ విభాగం అధికారులే ఈ ఐవీఆర్ఎస్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచి జారీ అయిన ఈ–చలాన్ల వివరాలు ఇది అందిస్తుంది. ఈ మూడింటి డేటాను ఇప్పటికే పోలీసులు అనుసంధానించిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు రావు. భవిష్యత్తులో జోన్ల వారిగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్న ట్రాఫిక్ పోలీసులు అనేక సేవల్ని అందించనున్నారు. కాల్ సెంటర్లో ఏఏ రకాలైన సేవలు అందుబాటులో ఉంచాలనేది తెలుసుకునేందుకు పక్షం రోజులుగా సర్వే చేస్తున్నారు. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు వచ్చే ప్రతి కాల్‌ను రికార్డు చేస్తూ... ఫోన్ చేసిన వారి అవసరాలను పరిగణలోకి తీసుకుంటూ జాబితా రూపొందిస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్ సెంటర్‌ను మరో రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు.