హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌కు స్వాగతం!! | Welcome to the Hyderabad Traffic Police | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌కు స్వాగతం!!

Published Thu, Mar 9 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌కు స్వాగతం!!

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌కు స్వాగతం!!

ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ సెంటర్‌ ఏర్పాటుకు నిర్ణయం
పెండింగ్‌ ఈ–చలాన్ల వివరాలు తెలిపేందుకే
భవిష్యత్తులో అందుబాటులోకి జోనల్‌ సెంటర్లు


సిటీబ్యూరో: ‘హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌కు స్వాగతం... తెలుగు కోసం ఒకటి నొక్కండి... హిందీ కే లియే దో దబాయే... ఫర్‌ ఇంగ్లీష్‌ ప్రెస్‌ త్రీ’... ఇదేంటా అనుకుంటున్నారా...? సిటీ ట్రాఫిక్‌ వింగ్‌ ఏర్పాటు చేయనున్న ఐవీఆర్‌ఎస్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి వినిపించనున్న మాటలు...వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు రహదారులపై చలాన్‌ పుస్తకాలతో కనిపించే  ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ నిర్వహణను కూడా పక్కన పెట్టి జరిమానాలు విధించడం, వసూలు చేయడంపై దృష్టి పెట్టేవారు. అయితే ప్రస్తుతం సిటీలో పూర్తి స్థాయిలో నాన్‌–కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధానం అమలవుతుండటంతో క్షేత్రస్థాయి సిబ్బంది నేరుగా జరిమానాలు విధించడం మానేశారు. కేవలం తమ వద్ద ఉన్న కెమెరాలో ఉల్లంఘనని బంధించడం ద్వారా ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఈ చలాన్లు పంపిస్తున్నారు.

పక్కాగా లేని చిరునామాలు...
ఈ–చలాన్లను ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఆర్టీఏ అధికారుల రికార్డుల్లో ఉన్న చిరునామాల ఆధారంగా జారీ చేస్తున్నారు. ఆ డేటాబేస్‌తో అనుసంధానం ఏర్పాటు చేసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు తమ కంప్యూటర్‌లో ఓ ఉల్లంఘనకు పాల్పడిన వాహనం నెంబర్‌ ఎంటర్‌ చేస్తే... ఆటోమేటిక్‌గా ఆర్డీఏ డేటాబేస్‌ నుంచి సదరు వాహనం చిరునామా గుర్తించే సర్వర్‌ ఆ చిరునామాకు ఈ–చలాన్‌ జారీ చేస్తుంది. అయితే ప్రస్తుతం దాదాపు 50 శాతం వాహనదారుల చిరునామాలు అప్‌డేట్‌ కాలేదు. వాహనం ఓ చిరుమానాతో ఉంటే ప్రస్తుతం యజమాని మరో చిరునామాలో నివసిస్తున్నాడు. దీంతో తమ వాహనంపై చలాన్‌ జారీ అయిందనే విషయం దాని యజమానికి తెలియట్లేదు.

ఇప్పటి వరకు స్మార్ట్‌ ఫోన్‌ యూజర్స్‌కే...
దీంతో ట్రాఫిక్‌ విభాగం అధికారులు పెండింగ్‌ ఈ–చలాన్ల వివరాలు తెలుసుకోవడానికి అనేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా వెబ్‌సైట్లు, యాప్స్‌ రూపొందించడంతో పాటు ట్రాఫిక్, నగర పోలీసు అధికారిక వెబ్‌సైట్లలోనూ దీనికి సంబంధించిన లింకులు ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ కేవలం కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న వాహనచోదకులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటున్నాయి. ప్రస్తుతం సిటీలో బేసిక్‌ ఫోన్లను వినియోగిస్తున్న వారి సంఖ్యా ఎక్కువగానే ఉంటోంది. వీరెవరికీ ఈ వెబ్‌సైట్లు, యాప్స్‌ అందుబాటులో ఉండట్లేదు.

వీరి కోసమే ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ సెంటర్‌...
ఇలాంటి వాహనచోదకుల కోసం ప్రత్యేకంగా ఇంటర్యాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టం (ఐవీఆర్‌ఎస్‌) విధానంలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు నిర్ణయించారు. ఇందుకుగాను ఓ కంపెనీతో జరుపుతున్న సంప్రదింపులు తుది దశకు చేరాయి. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఇది సేవలు అందించనుంది. దీనికి కేటాయించే ప్రత్యేక నెంబర్‌కు ఫోన్‌ చేసే వాహనచోదకుడు తమ భాషను ఎంచుకుని, వాహనం రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేస్తే చాలు... దానిపై పెండింగ్‌లో ఉన్న చలాన్లు, ఎంత మొత్తం అనే వివరాలు కంప్యూటరే వివరిస్తుంది.

జోన్ల స్థాయిలోనూ సెంటర్ల ఏర్పాటు..
నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులే ఈ ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచి జారీ  అయిన ఈ–చలాన్ల వివరాలు ఇది అందిస్తుంది. ఈ మూడింటి డేటాను ఇప్పటికే పోలీసులు అనుసంధానించిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు రావు. భవిష్యత్తులో జోన్ల వారిగా కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు అనేక సేవల్ని అందించనున్నారు. కాల్‌ సెంటర్‌లో ఏఏ రకాలైన సేవలు అందుబాటులో ఉంచాలనేది తెలుసుకునేందుకు పక్షం రోజులుగా సర్వే చేస్తున్నారు. ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌కు వచ్చే ప్రతి కాల్‌ను రికార్డు చేస్తూ... ఫోన్‌ చేసిన వారి అవసరాలను పరిగణలోకి తీసుకుంటూ జాబితా రూపొందిస్తున్నారు. ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ సెంటర్‌ను మరో రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ట్రాఫిక్‌ డీసీపీ ఏవీ రంగనాథ్‌ ‘సాక్షి’కి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement