Civil aviation companies
-
పదేళ్లలో గణనీయ వృద్ధి
దేశీయ వైమానిక రంగంలో గత పదేళ్లలో ఆశించినమేర వృద్ధి సాధించిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పదేళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఢిల్లీలో జరిగిన ఆసియా పసిఫిక్ మంత్రుల సదస్సులో మోదీ పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ)తో సహా 29 దేశాలు, ఎనిమిది అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘ఒకప్పుడు విమాన ప్రయాణం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండేది. మధ్యతరగతి ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విమాన ప్రయాణాన్ని ఎంచుకునేవారు. కానీ ప్రస్తుతం దేశంలో పరిస్థితి మారిపోయింది. టైర్ 2, 3 నగరాల్లోనూ విమానయానానికి అనువైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. దానివల్ల ఆయా నగరాల్లో ప్రజలు విమాన ప్రయాణాలు చేసేందుకు అవకాశం లభించినట్లయింది. ఈ రంగంలో పదేళ్ల కిందటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’ అని తెలిపారు.ఇదీ చదవండి: వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం, విమానయాన రంగంలో పెరుగుతున్న సవాళ్లను పరిష్కరించడం, పౌర విమానయానంలో స్థిరమైన వృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా ‘ఢిల్లీ డిక్లరేషన్’ పేరుతో కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. వీటిని ప్రధాని నరేంద్రమోదీ ఆమోదించారు. తాజాగా జరిగిన సమావేశంలో ఢిల్లీ డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ..‘విమానయాన రంగంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నిపుణులతో చర్చించి ఢిల్లీ డిక్లరేషన్‌ను రూపొందించాం. ఐసీఏఓ గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ప్లాన్, గ్లోబల్ ఎయిర్ నావిగేషన్ ప్లాన్, ఏవియేషన్ భద్రత..తదితర అంశాలను అందులో పొందుపరిచాం’ అని మంత్రి తెలిపారు. -
విను విధుల్లో.. ఇక సుదూర డ్రోన్లు
డ్రోన్లు.. నేల పైనుంచి ఆపరేట్ చేసే వారి కంటికి కనిపించే దూరం వరకే ఎగురుతాయి. ఇకపై ఇది పాత మాట కానుంది. రానున్న రోజుల్లో కనుచూపు మేర దాటి (బియాండ్ విజువల్ లైన్ ఆఫ్‌సైట్) డ్రోన్లు గగన వీధుల్ని ఏలనున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సూత్రప్రాయంగా ఆమోదం తెలపగా.. రెండు కంపెనీలు ఇలాంటి డ్రోన్ల తయారీకి ముందుకొచ్చాయి. త్వరలోనే వీటి పని తీరును పౌర విమానయాన సంస్థ పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. సాక్షి, అమరావతి: సివిల్ ఏవియేషన్ (పౌర విమానయాన) చట్టం ప్రకారం మన దేశంలో కనుచూపు మేర వరకు ఎగిరే డ్రోన్ల తయారీకి మాత్రమే అనుమతి ఉంది. అంటే డ్రోన్ ఆపరేటర్ తన కనుచూపు మేర వరకు మాత్రమే డ్రోన్లను ఆకాశంలో నడుపుతారు. కాగా నిఘా, వస్తు రవాణా అవసరాలకు ఆకాశంలో ఎంత దూరమైనా (కనుచూపు మేర దాటి–బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్) ప్రయాణించే డ్రోన్ల తయారీ దిశగా భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బియాండ్ విజువల్ లైన్ ఆఫ్‌సైట్ (బీవీఎల్ఓఎస్) డ్రోన్లకు కూడా అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనను కొన్నేళ్లుగా పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం వీటి తయారీకి గత మే నెలలో సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో బీవీఎల్ఓఎస్ డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ ఏడాది మే నెలలో నోటిఫై చేసింది. దాంతో పలు సంస్థలు బీవీఎల్ఓఎస్ (కనుచూపు మేర దాటి ప్రయణించే) డ్రోన్ల తయారీ దిశగా సన్నాహాలు చేపట్టాయి. ఈ ఏడాది జూన్‌లో పలు కంపెనీలు ఈ తరహా డ్రోన్ల తయారీకి దరఖాస్తు చేశాయి. వాటిలో ఏడు కంపెనీలకు డీజీసీఏ ప్రాథమికంగా అనుమతి ఇచ్చింది. ప్రయోగాత్మక పరీక్షకు ఎంపికైన రెండు సంస్థలు గూగుల్ సహకారంతో నిర్వహిస్తున్న హైపర్ లోకల్ డెలివరీ స్టార్టప్ కంపెనీ డున్జో , బెంగళూరుకు చెందిన థ్రోట్ల్ కంపెనీ బీవీఎల్ఓఎస్ డ్రోన్లను ప్రయోగాత్మకంగా రూపొందించడం తాజా విశేషం. తమ డ్రోన్లను పరీక్షించి పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు లైసెన్స్ మంజూరు చేయాల్సిందిగా ఆ రెండు కంపెనీలు డీజీసీఏకు దరఖాస్తు చేశాయి. ఆ రెండు కంపెనీలు రూపొందించిన డ్రోన్లను పరీక్షల నిమిత్తం డీజీసీఏ ఎంపిక చేసింది. బీవీఏల్‌ఓఎస్ అసెస్మెంట్, మానిటరింగ్ కమిటీ (బీఈఏమ్) వీటిని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో పరీక్షించి డీసీజీఏకు నివేదిక సమర్పించనుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. భద్రత, సామర్థ్యం, ఇతర ప్రమాణాలను ప్రాథమికంగా నిర్ధారించేందుకు ఆ రెండు కంపెనీల డ్రోన్లను కనీసం 100 గంటల చొప్పున పరీక్షిస్తారు. నిఘా, వస్తు రవాణా అవసరాలకు.. వ్యూహాత్మక, నిఘా, వస్తు రవాణా అవసరాల కోసం బీవీఎల్ఓఎస్ డ్రోన్లను ఉపయోగించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ప్రధానంగా వ్యూహాత్మక, నిఘా అవసరాల నిమిత్తం సైన్యం, పోలీసులకు వీటిని అందజేయాలన్నది ప్రధాన ఆలోచన. ట్రాఫిక్ నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా తదితర అవసరాల కోసం దేశంలోని పోలీసులకు ఈ డ్రోన్లు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. వస్తు రవాణాకు కూడా వీటిని విరివిగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఉంది. చిన్న చిన్న ప్యాకేజీలను తక్కువ వ్యయంతో.. తక్కువ సమయంలో రవాణా చేయొచ్చన్నది అధికారుల ఆలోచన. ప్రధానంగా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉండే నగరాల్లో వస్తు రవాణాకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తున్నారు. బీవీఎల్వోఎస్ డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించిన అనంతరం బీవీఎల్వోఎస్ అసెస్మెంట్, మానిటరింగ్ కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే డీజీసీఏ దీనిపై కేంద్రానికి సిఫార్సులను సమర్పిస్తుంది. అనంతరం కేంద్ర హోం, రక్షణ, పౌర విమాన యాన శాఖలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాయని ఓ ఉన్నతాధికారి చెప్పారు. -
ఉన్నచోటే వేడుకలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రిస్మస్, న్యూ ఇయర్ వచ్చాయంటే ఇళ్లలో, స్థానికంగా ఉత్సవాలు జరుపుకొనే వారితో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్యా ఎక్కువే. కానీ ఈ ఏడాది ఆ హడావుడి పెద్దగా కనిపించటం లేదు. రూపాయి క్షీణతతో ఎయిర్ టికెట్ల ధరలు ఈ సారి బాగా పెరిగాయి. దీంతో వేరే చోటికి వెళ్లి సరదాగా గడపాలనుకునే వారి సంఖ్య బాగా తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులను ఆకర్షించడానికి విమానయాన సంస్థలు టికెట్లపై డిస్కౌంట్ రేట్లను ప్రకటిస్తున్నాయి. స్పైస్ జెట్, ఇండిగో సంస్థలు ఎంపిక చేసిన ప్రదేశాలకు టికెట్లపై 15 నుంచి 20 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుండగా, గో-ఎయిర్ అయితే ఏకంగా 50 శాతం కూడా డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇన్ని ప్రకటించినా డిసెంబర్లో ఉండే హడావుడి ఈ ఏడాది కనిపించడం లేదు. 60 నుంచి 90 రోజులు ముందుగా టికెట్లను బుక్ చేసుకునే వారి సంఖ్యలో 12 శాతం క్షీణత నమోదయిందని మేక్ మై ట్రిప్ ఇండియా సీఈవో రాజేష్ మాగో తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఎయిర్ టికెట్ల ధరలు బాగా పెరగడమే ఈ ఏడాది టికెట్లకు డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. డిమాండ్ అధికంగా ఉండే ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-గోవా వంటి రూట్లలో గతేడాదితో పోలిస్తే ఎయిర్ టెకెట్ల ధరలు 12 నుంచి 27% వరకు పెరిగి నట్లు మేక్ మై ట్రిప్ తన సర్వేలో పేర్కొంది. దీంతో ఈ పండుగల సీజన్లో ప్రయాణికులను ఆకర్షించడానికి ఎయిర్‌లైన్స్ సంస్థలు డిస్కౌంట్ మంత్రాన్ని ప్రయోగిస్తున్నాయి. అయితే ఈ సీజన్లో సరదాగా గడపడానికి హైదరాబాదీయులు గోవా, మున్నార్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నట్లు ట్రిప్ అడ్వైజర్ సర్వే పేర్కొంది. అదే అంతర్జాతీయంగా అయితే బ్యాంకాక్, దుబాయ్ వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నట్లు ట్రిప్ అడ్వైజర్ కంట్రీ మేనేజర్ నిఖిల్ గంజు తెలిపారు. వారసత్వ ప్రదేశాల విషయానికి వస్తే జైపూర్, ఉదయ్‌పూర్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారన్నారు.