దేశీయ వైమానిక రంగంలో గత పదేళ్లలో ఆశించినమేర వృద్ధి సాధించిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పదేళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఢిల్లీలో జరిగిన ఆసియా పసిఫిక్ మంత్రుల సదస్సులో మోదీ పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ)తో సహా 29 దేశాలు, ఎనిమిది అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘ఒకప్పుడు విమాన ప్రయాణం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండేది. మధ్యతరగతి ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విమాన ప్రయాణాన్ని ఎంచుకునేవారు. కానీ ప్రస్తుతం దేశంలో పరిస్థితి మారిపోయింది. టైర్ 2, 3 నగరాల్లోనూ విమానయానానికి అనువైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. దానివల్ల ఆయా నగరాల్లో ప్రజలు విమాన ప్రయాణాలు చేసేందుకు అవకాశం లభించినట్లయింది. ఈ రంగంలో పదేళ్ల కిందటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’ అని తెలిపారు.
ఇదీ చదవండి: వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?
ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం, విమానయాన రంగంలో పెరుగుతున్న సవాళ్లను పరిష్కరించడం, పౌర విమానయానంలో స్థిరమైన వృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా ‘ఢిల్లీ డిక్లరేషన్’ పేరుతో కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. వీటిని ప్రధాని నరేంద్రమోదీ ఆమోదించారు. తాజాగా జరిగిన సమావేశంలో ఢిల్లీ డిక్లరేషన్లోని ముఖ్యాంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ..‘విమానయాన రంగంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నిపుణులతో చర్చించి ఢిల్లీ డిక్లరేషన్‌ను రూపొందించాం. ఐసీఏఓ గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ప్లాన్, గ్లోబల్ ఎయిర్ నావిగేషన్ ప్లాన్, ఏవియేషన్ భద్రత..తదితర అంశాలను అందులో పొందుపరిచాం’ అని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment