భారత్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం తీవ్ర కలకలం రేపుతోంది. అటు దేశీయంగా నడిచే వాటితోపాటు విదేశాలకు వెళ్తున్న అనేక ఎయిర్‌లైన్స్ వరసగా బాంబు బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన ఆరు రోజుల్లో ఏకంగా 70 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయంటే.. వీటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు అధికారులు, కపౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ నకిలీ బెదిరింపులపై దర్యాప్తు జరుపుతున్నప్పటికీ పరిస్థితులో మార్పు కనిపించడం లేదు.
ఈ క్రమంలో తాజాగా ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’ (బీసీఏఎస్) అప్రమత్తమైంది. విమానయాన సంస్థల సీఈఓలతో శనివారం సమావేశమైంది. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే బెదిరింపులను ఎదుర్కోవడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్‌ఓపీ) అనుసరించాలని సీఈవోలను కోరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్న వేళ.. ప్రయాణికులకు అసౌకర్యం, క్యారియర్‌లకు నష్టం కలగకుండా ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించింది. బెదిరింపులు, వాటి పట్ల తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయాలని కోరింది.
ఇక గత వారం రోజులుగా 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ఒక్కరోజే వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు 30కి పైగా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకు జరిపిన విచారణలో బెదిరింపులు వచ్చిన బెదిరింపులు వాటిలో ఐపీ (ఇంటర్నెట్ ప్రోటోకాల్) చిరునామాలు లండన్, జర్మనీ, కెనడా, యూఎస్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment