దేశంలో మరిన్ని విమానయాన సంస్థలు కార్యకలాపాలు సాగించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం రెండు ప్రముఖ కంపెనీలే అధిక వ్యాపార వాటాను కలిగి ఉన్నాయని చెప్పారు. విమానయాన రంగంలో రెండు సంస్థలే ఆధిపత్యం కొనసాగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈటీ ఇండియా అసెండ్స్ ఈవెంట్‌లో నాయుడు పాల్గొని మాట్లాడారు.
‘ఏ పరిశ్రమలోనైనా పోటీ ఉండాలి. దాంతో వినియోగదారులకు తక్కువ ధరలకే సేవలందుతాయి. కానీ విమానయాన పరిశ్రమలో కేవలం రెండు సంస్థలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ రంగం ఈ సంస్థలకే పరిమితం కావడం సరైందికాదు. మరిన్ని కంపెనీలు ఈ విభాగంలో సేవలందించాలి. దాంతో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందుతాయి. విమాన ప్రయాణం అందుబాటు ధరలో ఉండేలా ప్రభుత్వం టిక్కెట్ ధరలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో ప్రైవేట్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నా ప్రభుత్వం విభిన్న పాలసీలను తయారుచేస్తోంది. ఈ రంగాన్ని మరింత ఉత్తమంగా ఎలా చేయగలమో ఆయా సంస్థలతో చర్చిస్తోంది. ఏదైనా విమానయాన సంస్థ దివాలా తీయడం లేదా పరిశ్రమను వదిలివేయడం మాకు ఇష్టం లేదు. ఈ పరిశ్రమలోకి కొత్త విమానయాన సంస్థలు ప్రవేశించేలా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రైవేట్ మూలధనం ద్వారా కార్యకలాపాలు సాగించే కొత్త కంపెనీలు దివాలా దిశగా వెళితే ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.
ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధం
ఎయిరిండియా గ్రూపులో ఇటీవల విస్తారా విలీనం అయింది. దాంతో దేశీయ విమానయాన మార్కెట్ వాటాలో 80 శాతం ఇండిగో, ఎయిరిండియాలే సొంతం చేసుకుంటున్నాయి. రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 2023లో మరో పదేళ్ల కాలంపాటు అంటే 2033 వరకు ఈ పథకాన్ని పొడిగించారు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్(ఉడాన్) పథకంలో భాగంగా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడం, విమానయానాన్ని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment