హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రిస్‌మస్, న్యూ ఇయర్ వచ్చాయంటే ఇళ్లలో, స్థానికంగా ఉత్సవాలు జరుపుకొనే వారితో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్యా ఎక్కువే. కానీ ఈ ఏడాది ఆ హడావుడి పెద్దగా కనిపించటం లేదు. రూపాయి క్షీణతతో ఎయిర్ టికెట్ల ధరలు ఈ సారి బాగా పెరిగాయి. దీంతో వేరే చోటికి వెళ్లి సరదాగా గడపాలనుకునే వారి సంఖ్య బాగా తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులను ఆకర్షించడానికి విమానయాన సంస్థలు టికెట్లపై డిస్కౌంట్ రేట్లను ప్రకటిస్తున్నాయి. స్పైస్ జెట్, ఇండిగో సంస్థలు ఎంపిక చేసిన ప్రదేశాలకు టికెట్లపై 15 నుంచి 20 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుండగా, గో-ఎయిర్ అయితే ఏకంగా 50 శాతం కూడా డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇన్ని ప్రకటించినా డిసెంబర్లో ఉండే హడావుడి ఈ ఏడాది కనిపించడం లేదు. 60 నుంచి 90 రోజులు ముందుగా టికెట్లను బుక్ చేసుకునే వారి సంఖ్యలో 12 శాతం క్షీణత నమోదయిందని మేక్ మై ట్రిప్ ఇండియా సీఈవో రాజేష్ మాగో తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఎయిర్ టికెట్ల ధరలు బాగా పెరగడమే ఈ ఏడాది టికెట్లకు డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
డిమాండ్ అధికంగా ఉండే ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-గోవా వంటి రూట్లలో గతేడాదితో పోలిస్తే ఎయిర్ టెకెట్ల ధరలు 12 నుంచి 27% వరకు పెరిగి నట్లు మేక్ మై ట్రిప్ తన సర్వేలో పేర్కొంది. దీంతో ఈ పండుగల సీజన్‌లో ప్రయాణికులను ఆకర్షించడానికి ఎయిర్‌లైన్స్ సంస్థలు డిస్కౌంట్ మంత్రాన్ని ప్రయోగిస్తున్నాయి. అయితే ఈ సీజన్‌లో సరదాగా గడపడానికి హైదరాబాదీయులు గోవా, మున్నార్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నట్లు ట్రిప్ అడ్వైజర్ సర్వే పేర్కొంది. అదే అంతర్జాతీయంగా అయితే బ్యాంకాక్, దుబాయ్ వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నట్లు ట్రిప్ అడ్వైజర్ కంట్రీ మేనేజర్ నిఖిల్ గంజు తెలిపారు. వారసత్వ ప్రదేశాల విషయానికి వస్తే జైపూర్, ఉదయ్‌పూర్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారన్నారు.