డ్రోన్లు.. నేల పైనుంచి ఆపరేట్ చేసే వారి కంటికి కనిపించే దూరం వరకే ఎగురుతాయి. ఇకపై ఇది పాత మాట కానుంది. రానున్న రోజుల్లో కనుచూపు మేర దాటి (బియాండ్ విజువల్ లైన్ ఆఫ్‌సైట్) డ్రోన్లు గగన వీధుల్ని ఏలనున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సూత్రప్రాయంగా ఆమోదం తెలపగా.. రెండు కంపెనీలు ఇలాంటి డ్రోన్ల తయారీకి ముందుకొచ్చాయి. త్వరలోనే వీటి పని తీరును పౌర విమానయాన సంస్థ పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.
సాక్షి, అమరావతి: సివిల్ ఏవియేషన్ (పౌర విమానయాన) చట్టం ప్రకారం మన దేశంలో కనుచూపు మేర వరకు ఎగిరే డ్రోన్ల తయారీకి మాత్రమే అనుమతి ఉంది. అంటే డ్రోన్ ఆపరేటర్ తన కనుచూపు మేర వరకు మాత్రమే డ్రోన్లను ఆకాశంలో నడుపుతారు. కాగా నిఘా, వస్తు రవాణా అవసరాలకు ఆకాశంలో ఎంత దూరమైనా (కనుచూపు మేర దాటి–బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్) ప్రయాణించే డ్రోన్ల తయారీ దిశగా భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బియాండ్ విజువల్ లైన్ ఆఫ్‌సైట్ (బీవీఎల్‌ఓఎస్) డ్రోన్లకు కూడా అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనను కొన్నేళ్లుగా పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం వీటి తయారీకి గత మే నెలలో సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో బీవీఎల్‌ఓఎస్ డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ ఏడాది మే నెలలో నోటిఫై చేసింది. దాంతో పలు సంస్థలు బీవీఎల్‌ఓఎస్ (కనుచూపు మేర దాటి ప్రయణించే) డ్రోన్ల తయారీ దిశగా సన్నాహాలు చేపట్టాయి. ఈ ఏడాది జూన్‌లో పలు కంపెనీలు ఈ తరహా డ్రోన్ల తయారీకి దరఖాస్తు చేశాయి. వాటిలో ఏడు కంపెనీలకు డీజీసీఏ ప్రాథమికంగా అనుమతి ఇచ్చింది.
ప్రయోగాత్మక పరీక్షకు ఎంపికైన రెండు సంస్థలు
గూగుల్ సహకారంతో నిర్వహిస్తున్న హైపర్ లోకల్ డెలివరీ స్టార్టప్ కంపెనీ డున్జో , బెంగళూరుకు చెందిన థ్రోట్ల్ కంపెనీ బీవీఎల్‌ఓఎస్ డ్రోన్లను ప్రయోగాత్మకంగా రూపొందించడం తాజా విశేషం. తమ డ్రోన్లను పరీక్షించి పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు లైసెన్స్ మంజూరు చేయాల్సిందిగా ఆ రెండు కంపెనీలు డీజీసీఏకు దరఖాస్తు చేశాయి. ఆ రెండు కంపెనీలు రూపొందించిన డ్రోన్లను పరీక్షల నిమిత్తం డీజీసీఏ ఎంపిక చేసింది. బీవీఏల్‌ఓఎస్ అసెస్‌మెంట్, మానిటరింగ్ కమిటీ (బీఈఏమ్) వీటిని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో పరీక్షించి డీసీజీఏకు నివేదిక సమర్పించనుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. భద్రత, సామర్థ్యం, ఇతర ప్రమాణాలను ప్రాథమికంగా నిర్ధారించేందుకు ఆ రెండు కంపెనీల డ్రోన్లను కనీసం 100 గంటల చొప్పున పరీక్షిస్తారు.
నిఘా, వస్తు రవాణా అవసరాలకు..
వ్యూహాత్మక, నిఘా, వస్తు రవాణా అవసరాల కోసం బీవీఎల్‌ఓఎస్ డ్రోన్లను ఉపయోగించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ప్రధానంగా వ్యూహాత్మక, నిఘా అవసరాల నిమిత్తం సైన్యం, పోలీసులకు వీటిని అందజేయాలన్నది ప్రధాన ఆలోచన. ట్రాఫిక్ నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా తదితర అవసరాల కోసం దేశంలోని పోలీసులకు ఈ డ్రోన్లు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. వస్తు రవాణాకు కూడా వీటిని విరివిగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఉంది. చిన్న చిన్న ప్యాకేజీలను తక్కువ వ్యయంతో.. తక్కువ సమయంలో రవాణా చేయొచ్చన్నది అధికారుల ఆలోచన. ప్రధానంగా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉండే నగరాల్లో వస్తు రవాణాకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తున్నారు. బీవీఎల్‌వోఎస్ డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించిన అనంతరం బీవీఎల్‌వోఎస్ అసెస్‌మెంట్, మానిటరింగ్ కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే డీజీసీఏ దీనిపై కేంద్రానికి సిఫార్సులను సమర్పిస్తుంది. అనంతరం కేంద్ర హోం, రక్షణ, పౌర విమాన యాన శాఖలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాయని ఓ ఉన్నతాధికారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment