civil supplies company
-
వచ్చేనెల నుంచి చిరుధాన్యాల పంపిణీ
సాక్షి, అమరావతి : బియ్యం కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాల పంపిణీకి రంగం సిద్ధంచేస్తోంది. తొలిదశలో వచ్చేనెల నుంచి పైలట్ ప్రాజెక్టు కింద రాయలసీమ జిల్లాల్లో అమలుచేయనుంది. లబ్ధిదారులకు ప్రతినెలా ఇచ్చే రేషన్‌లో రెండు కేజీల బియ్యం బదులు రాగులు, జొన్నలు సరఫరా చేస్తుంది. ఇందులో భాగంగా పౌరసరఫరాల సంస్థ తొలిసారిగా చిరుధాన్యాలైన రాగులు, జొన్నలను మద్దతు ధరకు (రాగులు–రూ.3,578.. జొన్నలు రూ.2,970 (హైబ్రిడ్), రూ.2,990 (మల్దండి))కొనుగోలు చేస్తోంది. రైతులను చిరుధాన్యాల సాగువైపు ప్రోత్సహించేందుకు ఉత్పత్తులను కొ నుగోలు చేసిన వెంటనే నగదు చెల్లింపులు చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చింది. కర్ణాటక నుంచి రాగుల సేకరణ రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ నుంచి రాగుల ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పౌరసరఫరాల సంస్థ కర్ణాటక ప్రభుత్వం నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ద్వారా 25 వేల టన్నుల రాగులను సేకరిస్తోంది. మరోవైపు.. రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే జొన్నల కొనుగోలు నిమిత్తం పౌరసరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాలు తెరిచింది. అయితే, మద్దతు ధర కంటే మార్కెట్ రేటు ఎక్కువగా ఉండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జొన్నల పంపిణీకి వీలుగా, రైతులకు మరింత మేలు చేసేలా మద్దతు ధరను పెంచాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. లబ్దిదారుల ఆసక్తి మేరకు.. ఇక రాయలసీమ జిల్లాల్లోని బియ్యం కార్డుదారుల ఆసక్తి మేరకు ప్రతినెలా ఒక కేజీ నుంచి రెండు కేజీల వరకు రాగులను అందించనున్నారు. ఇప్పటికే జొన్నలు ప్రైవేటు మార్కెట్‌కు తరలిపోవడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సేకరణ నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటివరకు 500 టన్నులే సేకరించింది. దీంతో భవిష్యత్తులో రైతులకు మరింత మేలు చేసేందుకు వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా చిరుధాన్యాల సాగు ప్రోత్సాహాకానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాయి. రాష్ట్రంలో డిమాండ్, సప్లైకు అనుగుణంగా సాగు విస్తీర్ణాన్ని పెంచేలా రైతులకు అవగాహన కల్పించనుంది. పేదలకు బలవర్థకమైన ఆహారం రాష్ట్రంలో ప్రజలకు బలవర్థకమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సీఎం జగన్ సంకల్పానికి అనుగుణంగా వచ్చేనెల నుంచి పేదలకు చిరుధాన్యాలు పంపిణీ చేయనున్నాం. రాష్ట్రంలో రాగుల నిల్వలు అందుబాటులో లేకపోవడంతో కర్ణాటక నుంచి సేకరించి ఇక్కడ పంపిణీ చేస్తాం. ఇప్పటికే జొన్నల సేకరణ చేపట్టాం. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ మంత్రి విస్తీర్ణం పెంచేలా చర్యలు రాష్ట్రంలో రేషన్ కింద రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నాం. బియ్యం కార్డుదారుల అవసరానికి అనుగుణంగా పంట ఉత్పత్తులు పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి రేటు ఉంది. జొన్నలకు పౌల్ట్రీ రంగంలో డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల సంస్థ సేకరణ నెమ్మదిగా ఉంది. అందుకే మద్దతు ధర పెంచాలని కేంద్రానికి లేఖ రాశాం. – హెచ్.అరుణ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ -
వడ్లు దగ్గరవడ్డయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు దగ్గరపడుతున్నాయి. 13 జిల్లాల్లో సేకరణ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 6,875 కేంద్రాలకు గాను 1,657 కేంద్రాల్లోనే కొనుగోళ్లు నడుస్తున్నాయి. శుక్రవారం రాత్రి వరకు రాష్ట్రంలో 12.21 లక్షల మంది రైతుల నుంచి 67 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ఈ ధాన్యం విలువ రూ. 13,093 కోట్లు కాగా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి రూ. 10,619 కోట్లు చేరింది. సంక్రాంతికల్లా కొనుగోళ్లు దాదాపు పూర్తవ్వొచ్చని, కొన్నిప్రాంతాల్లోనే ఇంకాస్త ఆలస్యమవ్వొచ్చని అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో నాట్లు వేయడంలో జాప్యమవడం, సాగు నీటిని ఆలస్యంగా విడుదల చేయడం వల్ల కోతలు ఆలస్యంగా మొదలయ్యాయని అంటున్నారు. మూతబడ్డ 5,218 కేంద్రాలు రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణకు 32 జిల్లాల్లో 6,875 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయి కేంద్రాలను పూర్తిగా మూసేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జనగాం, నల్లగొండ, యాదాద్రి, మహబూబ్‌నగర్‌ల్లోనూ కొనుగోళ్లు చాలా వరకు పూర్తయినా అక్కడక్కడ మిల్లర్ల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులతో కేంద్రాలను కొనసాగిస్తున్నారు. మొతం్తగా ఇప్పటివరకు 5,218 కొనుగోలు కేంద్రాలు మూతబడ్డాయి. సాగునీటిని ఆలస్యంగా విడుదల చేయడం, నాట్లు ఆలస్యమవడం లాంటి కారణాలతో ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, హన్మకొండ, భూపాలపల్లి, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల్లో వరి కోతలు ఆలస్యమయ్యాయని అధికారులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో ట్రాన్స్‌పోర్టు సమస్యతో పాటు గోడౌన్లు ఖాళీ లేవంటూ మిల్లర్లు ధాన్యం తీసుకోవట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల లోపు ధాన్యం సేకరించే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ లెక్క కడుతోంది. -
బియ్యం ఎక్కడ నిల్వ చేయాలి?
సాక్షి, హైదరాబాద్: ఎఫ్‌సీఐ గోదాములన్నీ నిండిపోయిన పరిస్థితుల్లో రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ అయిన బియ్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఒప్పందం మేరకు ఎఫ్‌సీఐకి బియ్యం ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో చేసిన ప్రకటన బాధ్యతారాహిత్యమని ఆయన ధ్వజమెత్తారు. పౌరసరఫరాల భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎఫ్‌సీఐకి రాష్ట్రంలో 20.37 లక్షల సామర్థ్యం గల గోదాములు ఉండగా, ప్రస్తుతం సామర్థ్యానికి మించి మరో 28 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎక్కువగా నిల్వచేసినట్లు తెలిపారు. గోదాముల నుంచి ఎప్పటికప్పుడు బియ్యాన్ని రైల్వే వ్యాగన్ల ద్వారా రవాణా చేయకుండా కేంద్రం తన వైఫల్యాన్ని తెలంగాణ ప్రభుత్వంపై రుద్దడానికి పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమన్నారు. -
74.35 లక్షల మందికి రూ.1,115 కోట్లు
సాక్షి,హైదరాబాద్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని 74.35 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,500 చొప్పున మొత్తం రూ.1,115 కోట్లను శనివారం బ్యాంకుల్లో జమ చేసినట్లు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బ్యాంకు ఖాతా లేని 5.38 లక్షల మంది లబ్ధిదారులకు పోస్టాఫీసు ద్వారా రానున్న మూడ్రోజుల్లో రూ.1,500 అందజేస్తామన్నారు. శనివారం సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 87.55 లక్షల కుటుంబాలకు గాను ఈ రెండ్రోజుల్లో 9 లక్షల (10%) మంది 37 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకున్నారన్నారు. బియ్యం తీసుకోవడానికి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులు భౌతికదూరాన్ని పాటిస్తూ బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి నగదును పొందాలన్నారు. గత నెల 23 వరకు రేషన్ పంపిణీ చేసినట్టుగానే ఈ నెల కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రేషన్ అందేవరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయని తెలిపారు. చదవండి: అడవిబిడ్డలు ఆగమాగం -
అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దుతా: మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ తనపై ఉం చిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పౌరసరఫరాల సంస్థను అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దుతా నని ఆ సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం సివిల్ సప్లయ్స్ భవన్లో సంస్థ చైర్మన్‌గా శ్రీనివాస్‌రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. మారెడ్డి మాట్లాడుతూ సంస్థ, రైతు సమస్యలపై క్షేత్రస్థాయిలో అవగాహన ఉందని, సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రత్యక్షంగా రైతుల వెతలను పరిశీలించానని తెలిపారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, దానికి అనుగుణంగానే మా కార్పొరేషన్ ముందుకెళ్తుందన్నారు. పౌరసరఫరాల విభాగం ప్రభుత్వానికి చాలా కీలకమైందని, ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల వల్ల రాబోయే రోజుల్లో అదనంగా లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ధాన్యం దిగుబడులు భారీగా పెరగనున్న నేపథ్యంలో రైతులకు కనీస మద్దతు ధర లభించేలా, కోటి టన్నులకు పైగా ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకుంటామన్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సభర్వాల్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జదగీశ్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు నాయిని నరసింహారెడ్డి, కర్నె ప్రభాకర్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు శాసనసభ, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. -
మొదలైన ధాన్యం కొనుగోళ్లు
► ఇప్పటివరకు 3.08 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు ► సోయాబీన్ కొనుగోలుకు ఏర్పాట్లు ► మిర్చి రైతులకు కేంద్రం మొండిచెయ్యి! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభ మయ్యాయి. ఈ ఏడాది యాసంగి వరి పంట ప్రస్తుతం మార్కెట్లకు చేరుకుంటోంది. ఈ సీజన్లో 26.41 లక్షల మెట్రిక్ టన్నులమేర దిగుబడులురాగా ఇప్పటివరకు 3.08 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో ‘ఏ’ గ్రేడ్ రకం వరిని రూ.1,450, సాధారణ రకం వరిని రూ.1,410 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. వరి ధాన్యం కొనుగోలుకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 3,076 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. వరి పంటను ఎంఎస్పీకి తగ్గకుండా కొనుగోలు చేస్తామని పార్థసారథి వెల్లడించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2,025 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 16.46 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేశారు. యాసంగిలో అధి కంగా ధాన్యం వస్తుందని గమనించి మరో వెయ్యి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు సోయాబీన్ ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తోంది. అందుకోసం ఆయిల్ ఫెడ్ ద్వారా 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కేవలం 702 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కంది కొనుగోలుకూ చర్యలు ఈ ఏడాది కందికి ఎంఎస్పీ కంటే తక్కువ ధర పలకడంతో ప్రభుత్వ సంస్థలు రంగం లోకి దిగాయి. గతంలో క్వింటాలు కంది మార్కెట్లో రూ. 10 వేలకు పైగా ధర పలకగా, ఈసారి రూ. 4 వేల వరకు పడిపోయింది. దీంతో ప్రభుత్వ సంస్థలు క్వింటాలుకు రూ.5,050 ఎంఎస్పీకి కొనుగోలు చేశాయి. రాష్ట్రంలో 2 లక్షల మంది రైతుల నుంచి 2.08 లక్షల మెట్రిక్ టన్నుల కందిని నాఫెడ్, ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేశారు. ఇందుకు 95 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే పత్తిని 4.50 లక్షల మంది రైతుల నుంచి 6.40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అందుకోసం 92 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. అలాగే 157 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 18,256 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ను మార్క్‌ఫెడ్, ఎఫ్‌సీఐ కొనుగోలు చేశాయి. ఇదిలా వుంటే మిర్చి రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కనికరం చూపలేదు. మార్కెట్లో మిర్చిని వ్యాపారులు క్వింటాలుకు రూ. 4,500 మించి కొనడంలేదు. దీంతో రూ. 7,500కు కొనుగోలు చేసేలా చూడాలని, లేదంటే ప్రతీ మిర్చి రైతుకు క్వింటాలుకు రూ. 1,500 పరిహారంగా ఇవ్వాలని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కేంద్రానికి విన్నవించింది. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం వెలువడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.