మొదలైన ధాన్యం కొనుగోళ్లు
► ఇప్పటివరకు 3.08 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు
► సోయాబీన్ కొనుగోలుకు ఏర్పాట్లు
► మిర్చి రైతులకు కేంద్రం మొండిచెయ్యి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభ మయ్యాయి. ఈ ఏడాది యాసంగి వరి పంట ప్రస్తుతం మార్కెట్లకు చేరుకుంటోంది. ఈ సీజన్‌లో 26.41 లక్షల మెట్రిక్ టన్నులమేర దిగుబడులురాగా ఇప్పటివరకు 3.08 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో ‘ఏ’ గ్రేడ్ రకం వరిని రూ.1,450, సాధారణ రకం వరిని రూ.1,410 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. వరి ధాన్యం కొనుగోలుకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 3,076 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. వరి పంటను ఎంఎస్‌పీకి తగ్గకుండా కొనుగోలు చేస్తామని పార్థసారథి వెల్లడించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2,025 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 16.46 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేశారు. యాసంగిలో అధి కంగా ధాన్యం వస్తుందని గమనించి మరో వెయ్యి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు సోయాబీన్ ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తోంది. అందుకోసం ఆయిల్ ఫెడ్ ద్వారా 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కేవలం 702 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు.
కంది కొనుగోలుకూ చర్యలు
ఈ ఏడాది కందికి ఎంఎస్‌పీ కంటే తక్కువ ధర పలకడంతో ప్రభుత్వ సంస్థలు రంగం లోకి దిగాయి. గతంలో క్వింటాలు కంది మార్కెట్లో రూ. 10 వేలకు పైగా ధర పలకగా, ఈసారి రూ. 4 వేల వరకు పడిపోయింది. దీంతో ప్రభుత్వ సంస్థలు క్వింటాలుకు రూ.5,050 ఎంఎస్‌పీకి కొనుగోలు చేశాయి. రాష్ట్రంలో 2 లక్షల మంది రైతుల నుంచి 2.08 లక్షల మెట్రిక్ టన్నుల కందిని నాఫెడ్, ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేశారు. ఇందుకు 95 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే పత్తిని 4.50 లక్షల మంది రైతుల నుంచి 6.40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అందుకోసం 92 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు.
అలాగే 157 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 18,256 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ను మార్క్‌ఫెడ్, ఎఫ్‌సీఐ కొనుగోలు చేశాయి. ఇదిలా వుంటే మిర్చి రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కనికరం చూపలేదు. మార్కెట్లో మిర్చిని వ్యాపారులు క్వింటాలుకు రూ. 4,500 మించి కొనడంలేదు. దీంతో రూ. 7,500కు కొనుగోలు చేసేలా చూడాలని, లేదంటే ప్రతీ మిర్చి రైతుకు క్వింటాలుకు రూ. 1,500 పరిహారంగా ఇవ్వాలని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కేంద్రానికి విన్నవించింది. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం వెలువడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.