సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు దగ్గరపడుతున్నాయి. 13 జిల్లాల్లో సేకరణ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 6,875 కేంద్రాలకు గాను 1,657 కేంద్రాల్లోనే కొనుగోళ్లు నడుస్తున్నాయి. శుక్రవారం రాత్రి వరకు రాష్ట్రంలో 12.21 లక్షల మంది రైతుల నుంచి 67 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది.
ఈ ధాన్యం విలువ రూ. 13,093 కోట్లు కాగా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి రూ. 10,619 కోట్లు చేరింది. సంక్రాంతికల్లా కొనుగోళ్లు దాదాపు పూర్తవ్వొచ్చని, కొన్నిప్రాంతాల్లోనే ఇంకాస్త ఆలస్యమవ్వొచ్చని అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో నాట్లు వేయడంలో జాప్యమవడం, సాగు నీటిని ఆలస్యంగా విడుదల చేయడం వల్ల కోతలు ఆలస్యంగా మొదలయ్యాయని అంటున్నారు.
మూతబడ్డ 5,218 కేంద్రాలు
రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణకు 32 జిల్లాల్లో 6,875 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయి కేంద్రాలను పూర్తిగా మూసేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జనగాం, నల్లగొండ, యాదాద్రి, మహబూబ్‌నగర్‌ల్లోనూ కొనుగోళ్లు చాలా వరకు పూర్తయినా అక్కడక్కడ మిల్లర్ల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులతో కేంద్రాలను కొనసాగిస్తున్నారు.
మొతం్తగా ఇప్పటివరకు 5,218 కొనుగోలు కేంద్రాలు మూతబడ్డాయి. సాగునీటిని ఆలస్యంగా విడుదల చేయడం, నాట్లు ఆలస్యమవడం లాంటి కారణాలతో ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, హన్మకొండ, భూపాలపల్లి, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల్లో వరి కోతలు ఆలస్యమయ్యాయని అధికారులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో ట్రాన్స్‌పోర్టు సమస్యతో పాటు గోడౌన్‌లు ఖాళీ లేవంటూ మిల్లర్లు ధాన్యం తీసుకోవట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల లోపు ధాన్యం సేకరించే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ లెక్క కడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment