వడ్ల పైసలస్తలేవు..! | - | Sakshi
Sakshi News home page

వడ్ల పైసలస్తలేవు..!

Published Wed, Jun 14 2023 1:00 AM | Last Updated on Wed, Jun 14 2023 11:30 AM

- - Sakshi

సాక్షి, కామారెడ్డి: ధాన్యం కాంటా వేసిన వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఆచరణలో అమలు కావడంలేదు. ధాన్యం కొనుగోళ్లు నేటితో ముగియనున్నాయి. అయితే నెల క్రితం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. సకాలంలో ధాన్యం డబ్బులు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లా లో యాసంగిలో సోమవారం నాటికి 3,52, 418.600 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ రూ. 725.98 కోట్లు. కాగా ఇప్పటి వరకు రైతులకు రూ. 401.14 కోట్లు చెల్లించారు. అంటే ఇంకా రైతులకు రావాల్సిన బకాయిలు రూ. 325 కోట్లు ఉన్నాయి. వడ్ల పైసలు వస్తే డబ్బులు ఇవ్వాల్సిన వారికి ఇచ్చేయా లని రైతులు ఎదురుచూస్తున్నారు.

వరి కోతలు, పంట నూర్పిడి, రవాణా, లేబర్‌ ఖర్చులకు తెచ్చిన అప్పులు, అప్పటికే పంట సాగు కోసం చేసిన అప్పులు రైతులకు భారంగా మారాయి. డబ్బుల గురించి అధికారులను ఎప్పుడు అడిగినా రెండు, మూడు రోజుల్లో జమ అవుతాయనే సమాధానం చెబుతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పైసలు రాక ఇబ్బందులు

ఆరుగాలం కష్టపడి పండించిన పంట తెగుళ్లతో దెబ్బతినడం, వడగళ్ల వానలతో వడ్లు రాలిపోవడం, కోతలకు చైన్‌ మిషన్లకు అడ్డగోలుగా వెచ్చించాల్సిన పరిస్థితి ఆపై దిగుబడులు తగ్గిపోవడం, కేంద్రాల వద్ద ధాన్యం నానిపోయి రోజుల తరబడి జాగారం చేయాల్సిన పరిస్థితుల్లో రైతులు అనేక అవస్థలు పడ్డారు. ఎలాగోలా ధాన్యం కాంటా అయి మిల్లులకు చేరి రోజులు గడుస్తున్నా డబ్బులు రాకపోవడం రైతులకు సమస్యగా మారింది.

దాదా పు అందరు రైతులు పంట సాగుకోసం అప్పలు చేసి పెట్టుబడులు పెట్టిన వారే. పంట చేతికి వచ్చిన తర్వాత అప్పులు చెల్లించడం, మళ్లీ పంట సాగుకోసం అప్పులు చేస్తుంటారు. ఈ సారి వడ్ల పైసలు రాకపోవడంతో అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. వడ్లు అమ్మినా అప్పు కట్టడం లేదంటూ చాలామంది రైతులను వడ్డీ వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు రాలేదని సర్ది చెప్పలేక అవస్థలు పడుతున్నారు. వెంటనే వడ్ల డబ్బులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

వానాకాలం సాగుకు కష్టాలు

యాసంగిలో సాగు చేసిన వరి దెబ్బతిని దిగుబడులు పడిపోయి పెట్టుబడులు కూడా చేతికి రాని పరిస్థితుల్లో రైతులు వానాకాలం సాగుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో వరికి తెగుళ్లు, వడగళ్ల వానలతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. చాలా మంది రైతులకు దిగుబడి పడిపోయి పెట్టుబడులు కూడా చేతికి అందే పరిస్థితి లేదు. వానాకాలం సీజన్‌ దగ్గర పడుతోంది.

ముందస్తుగా పంటలు సాగు చేయాలని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. విత్తనాలు కొనుగోలు చేయడం, దున్నకాలకు పెట్బుడులు ఎక్కడి నుంచి తేవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఎకరాకు ఇచ్చే రూ. 5వేలు కూడా ఇంకా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో రైతులకు వానాకాలం సాగు ఇబ్బందికరంగా మారింది.

నెల రోజులైనా పైసలు రాలేదు

మూడు ఎకరాల్లో వరి పంట సాగు చేసిన. నెల రోజుల క్రితమే వరి కోసి వడ్లను కేంద్రానికి తీసుకువెళ్లాను. 150 బస్తాలు అయ్యాయి. అమ్మి నెల రోజులైనా డబ్బులు రాలే దు. పంట సాగు కోసం, కోతకు అప్పులు చేసిన. డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మళ్లీ వానాకాలం పంట వేయడానికి సమ యం దగ్గర పడుతోంది. ఎప్పుడు వస్తయో ఏమో తెలుస్తలేదు. – కిష్టారెడ్డి, రైతు,

డబ్బులు జమ కాలేదు

నేను 36 రోజుల కిందట కొనుగోలు కేంద్రంలో 83 బస్తాల వడ్లు అమ్మినా. ఇప్పటికీ నయాపైసా రాలేదు. డబ్బులకు ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడు వస్తయో చెప్తలేరు. లాగోడీకి తెచ్చిన డబ్బులు సర్దుబాటు చేయాల్సి ఉంది. వానాకాలం సీజన్‌ కూడా ముంచుకు వచ్చింది. తొందరగా డబ్బులు ఇవ్వాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement