Civil Works
-
పెద్దాసుపత్రికి రూ.3.35 కోట్లు మంజూరు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మంగళవారం రూ.3.35కోట్లు మంజూరు చేస్తూ జీవో-384 జారీ చేశారు. ఈ నిధులను ఆసుపత్రిలో సివిల్ పనులకు వినియోగించనున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ నిధుల నుంచి ప్రభుత్వం ఈ మొత్తాన్ని విడుదల చేసింది. -
ఆమోదమా..! తిరస్కారమా..?
► చిత్తూరు నగరంలో రూ.5.50 కోట్ల పనులపై మల్లగుల్లాలు ► అధికార పార్టీ నాయకులకు పనులు కట్టబెట్టే యత్నం ► టెండర్లకు పోటీ రావడంతో సతమతం ► నిశితంగా పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డామిట్ కథ అడ్డం తిరిగింది. చిత్తూరు నగరంలో లేకలేక రూ.5 కోట్లకు పైగా విలువచేసే సివిల్ పనులకు టెండర్లు పిలిస్తే ఎవరెవరో దరఖాస్తులు వేశారు. దీంతో టెండర్లను రద్దుచేసి అప్రతిష్ట పాలవుదామా..? ఆమోదించి పారదర్శకత పాటిద్దామా..? అంటూ చిత్తూరు కార్పొరేషన్ పాలకులు, అధికారులు సతమతమవుతున్నారు. చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలో టీడీపీ నాయకుల మధ్య అంతర్గత పోరు అంతా ఇంతాకాదు. ఒకరు పనులు చేయాలంటే మరొకరు చేయకూడదనడం ఇక్కడ ఆనవాయితీ. నగరం మొత్తంలో కేవలం ఆరు డివిజన్లలో మాత్రమే పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులు జరిగాయి. ఒక్కో డివిజన్‌కు రూ.10 లక్షల విలువ చేసే సివిల్ పనులు చేయాలని రెండేళ్ల క్రితం చిత్తూరు కార్పొరేషన్ కౌన్సిల్ ఆమోదించినా కార్యరూపం దాల్చలేదు. చాలాకాలం తరువాత ఎక్కువ ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు నిర్మించడంతో పాటు నీటి పైపులైన్లు, నగర సుందరీకరణ పనులకోసం గతనెల కార్పొరేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం 77 సివిల్ పనులతో పాటు మూడు కూడళ్లల్లో సుందరీకరణ పనుల కోసం రూ.5.50 కోట్లతో ఆన్లైన్ టెండర్లు పిలిచారు. పంచేసుకున్న వాటికి పోటీ ఆన్లైన్, ఆఫ్‌లైన్ టెండర్లు పిలిచినా ఇక్కడ టీడీపీ ప్రజాప్రతినిధుల అనుగ్రహం పొందిన వాళ్లు, కొందరు టీడీపీ కార్పొరేటర్ల భర్తలకు మాత్రమే పనులు దక్కుతుంటాయి. రూ.5.50 కోట్ల పనులను ప్రజాప్రతినిధుల సమక్షంలో పంచుకున్న అధికారపార్టీ నాయకులు ముందస్తు ఒప్పందం ప్రకారం ఒక్కో పనికి ముగ్గురు చొప్పున టెండర్లు వేయడం.. ఇందులోనూ నిర్ణీత విలువకంటే ఎక్కువ (ఎక్సెస్) కోట్ చేసి పనులు దక్కించుకునేలా పరస్పర అంగీకారం చేసుకున్నారు. అయితే ఊహించని విధంగా చిత్తూరుకు చెందిన ఓ ప్రముఖ సంస్థ ఆన్లైన్లో 40 పనులకు టెండర్లు దాఖలుచేసింది. వీటిల్లో చాలా పనులకు తక్కువ మొత్తంలో (లెస్) కోట్ చేశారు. తమ్ముళ్లు ముందుగా ఒకటి అనుకుంటే.. ఇప్పుడు పరిస్థితి మరోలా అయ్యింది. వెంటనే అన్ని టెండర్లను రద్దుచేసి తొలి నుంచి టెండర్ల ప్రక్రియ చేపట్టాలని అధికారులపై, పాలకులపై ఒత్తిళ్లు పెంచుతున్నారు. గమనిస్తున్న కలెక్టర్ కార్పొరేషన్లో టెండర్లు పిలవడం, అయిన వాళ్లకు పనులు దక్కకుంటే వాటిని రద్దు చేయడం కొత్తేమీకాదు. గతంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి. అయితే గతంలో ఉన్న కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఏడాది క్రితం ఉన్న కమిషనర్ సురేష్‌ను తీవ్రంగా హెచ్చరించారు. తరచూ టెండర్లను రద్దుచేస్తే తీవ్ర పరిణామాలుంటాయని మందలించడంతో ఈ మధ్యకాలంలో ఏ పనులు రద్దు కాలేదు. అయితే కొత్త కలెక్టర్ ప్రద్యుమ్న చిత్తూరు కార్పొరేషన్లో అధికారుల పనితీరుపై నివేదిక తెప్పించుకున్నారు. కొందరు అధికారులు రాజకీయ నాయకులకు సాగిలపడి సేవలు చేయడం కూడా గమనిస్తున్నారు. టెండర్లకు దరఖాస్తులు ఆహ్వానించినప్పుడే కార్పొరేషన్ అధికారులకు కలెక్టర్‌కు సైతం తెలియజేశారు. మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్న కొత్త కలెక్టర్ అధికారుల యాక్షన్ ఆధారంగా తన రియాక్షన్ చూపించనున్నట్లు సమాచారం. -
రూ. 2 వేల కోట్లతో ఎస్ఎస్ఏ కార్యక్రమాలు
ఆమోదం తెలిపిన ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు 110 కేజీబీవీలు, 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లకు ఓకే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద రూ. రెండు వేల కోట్లకు పైగా నిధులతో విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) ఓకే చెప్పింది. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో పీఏబీ రాష్ట్రంలో విద్యా కార్యక్రమాలకు ఓకే చెప్పింది. 2017–18 విద్యా సంవత్సరంలో చేపట్టే విద్యా కార్యక్రమాలకు వెచ్చించే ఈ మొత్తంలో కేంద్రం 60 శాతం నిధులను ఇవ్వనుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను వెచ్చించనుంది. వాస్తవానికి రాష్ట్ర విద్యా శాఖ రూ. 2,933 కోట్లతో ప్రతిపాదనలు పంపించినా, సివిల్ వర్క్స్‌కు నిధులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. వాటిని తొలగించి రూ. 2 వేల కోట్ల రాష్ట్ర ప్రణాళికలను ఓకే చేసింది. ఇందులో అత్యధికంగా రూ. 1,064 కోట్లు 20,823 మంది టీచర్ల వేతనాల కింద ఇచ్చేందుకే వెచ్చించనున్నారు. ఇప్పటికే ఉన్న 391 కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల (కేజీబీవీ) అభివృద్ధికి రూ. 264 కోట్లు వెచ్చించనున్నారు. వీటికి అదనంగా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటైన 125 మండలాల్లో విద్యా పరంగా వెనుకబడిన 110 మండలాల్లోనూ కేజీబీవీల ఏర్పాటుకు ఓకే చెప్పింది. ప్రస్తుతం హైదరాబాద్, ఖమ్మంలో వీధి బాలలు, అనాథ విద్యార్థుల కోసం అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా, మిగతా జిల్లాల్లోని పట్టణ కేంద్రాల్లో మరో 29 అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు అంగీకరించింది. ఈసారి పాఠ్య పుస్తకాలకు కూడా నిధులను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.