ఉద్రిక్తత
- ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ నాయకుల కలెక్టరేట్ ముట్టడి
- లోపలికి చొచ్చుకెళ్లిన కార్యకర్తలు
- కలెక్టర్ కార్యాలయం పెకైక్కి నిరసన
అనంతపురం అర్బన్ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలనే డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్ (కృష్ణమాదిగ వర్గం) ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. జిల్లా అధ్యక్షుడు ఎగ్గడి మల్లయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. వారు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయినా కొందరు గేటు ఎక్కి లోపలికి ప్రవేశించారు. మరికొందరు గేటును నెట్టుకుని వెళ్లారు. దీంతో కలెక్టర్ ఛాంబర్‌కు వెళ్లే ద్వారాన్ని పోలీసులు మూసేశారు.
ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. అప్పటికే కొందరు కలెక్టర్ కార్యాలయంపైకి చేరుకుని నిరసన తెలిపారు. మరికొందరు మొదటి అంతస్తులో ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) హేమసాగర్ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారందరినీ కిందకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఒక కార్యకర్త సొమ్మసిల్లి పడిపోవడంతో పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
చంద్రబాబు అవకాశవాది
ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అవకాశవాది. ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగనవుతానని ఎన్నికల ముందు చెప్పి మాదిగల ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వర్గీకరణ ఊసెత్తడం లేదు. అసెంబ్లీలో వర్గీకరణ బిల్లుపై ఏకగ్రీవ తీర్మానం చేయకపోతే తగిన రీతిలో బుద్ధిచెబుతామ’ని ఎమ్మార్పీఎస్ నాయకులు హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లయ్య, ఇతర నాయకులు మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి పదహైదు నెలలవుతున్నా ఎస్సీ వర్గీకరణ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు.
ఇదే తరహాలో వ్యవహరిస్తే మాదిగల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. నిరుపేదలైన మాదిగలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇప్పటికే ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డీఆర్ఓ హేమసాగర్ అక్కడి చేరుకుని నాయకులతో మాట్లాడారు. ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబుళేసు, ఎమ్పార్పీఎస్ నాయకులు పోతులయ్య, కదిరప్ప, ప్రకాశ్, బేదెప్ప తదితరులు పాల్గొన్నారు.