Classified documents leakage
-
సాక్షులతో మాట్లాడొద్దు
వాషింగ్టన్: అమెరికాలో ప్రభుత్వ రహస్య పత్రాలను తన నివాసంలో దాచిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మంగళవారం ఉదయం మయామీ కోర్టులో దాదాపుగా 45 నిముషాల సేపు విచారణ కొనసాగింది. ఈ కేసులో తన తప్పేమీ లేదని ట్రంప్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. న్యాయ విచారణ ప్రారంభం కావడానికి 15 నిముషాల ముందే కోర్టుకు హాజరయ్యారు. ట్రంప్‌కు తోడుగా ఆయన వెంట కుమారుడు ఎరిక్ ట్రంప్ కూడా న్యాయస్థానానికి వచ్చారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం శ్రమిస్తున్న ట్రంప్‌కు ఈ కేసు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. కోర్టులో కేసు విచారణ సాగినంత సేపు ట్రంప్ మౌనంగా తలవంచుకొని చూస్తూ కూర్చున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు రాసింది. దేశ భద్రతకు సంబంధించిన రహస్య పత్రాలను ట్రంప్ తనతో పాటు ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌కు తీసుకువెళ్లి ఉంచారని, దేశానికి చెందిన అణు రహస్యాలు ప్రైవేటు వ్యక్తులతో పంచుకున్నారంటూ ఆయనపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. గూఢచర్యం చట్టం కింద 31 నిబంధనల్ని అతిక్రమించారంటూ ట్రంప్‌పై 37 అభియోగాలు నమోదయ్యాయి. దేశానికి చెందిన ఒక మాజీ అధ్యక్షుడు క్రిమినల్ కేసులో ఈ స్థాయిలో అభియోగాలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. కోర్టులో విచారణ సమయంలో ట్రంప్ అమాయకుడని, ఆయనకే పాపం తెలీదని ఆయన తరఫు లాయర్ టాన్ బ్లాంచ్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేసుని విచారించిన న్యాయమూర్తి జోనథాన్ గూడ్‌మ్యాన్ ట్రంప్ ఈ కేసుకు సంబంధించిన సాక్షులు, ఇతరులెవరితోనూ నేరుగా మాట్లాడవద్దని షరతు విధించారు. అధ్యక్ష పదవిలో అవినీతి పరుడు: ట్రంప్ కోర్టులో విచారణ ముగిసిన అనంతరం ట్రంప్ నిధుల సమీకరణ కోసం న్యూజెర్సీలోని గోల్ఫ్ కోర్టుకు మంగళవారం రాత్రి వెళ్లారు. ఆయనకు అక్కడ ఘనంగా స్వాగతం లభించింది. జూన్ 14 బుధవారం ట్రంప్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. హ్యాపీ బర్త్ డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ తన అభిమానులతో మాట్లాడుతూ తనపై మోపిన ఈ కేసు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ఆరోపించారు. అధ్యక్ష పీఠంపై ఒక అవినీతి పరుడు కూర్చొని , తన రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. -
నేను అమాయకుడిని.. డోనాల్డ్ ట్రంప్
జార్జియా, నార్త్ కరోలినాలో రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులతో నిర్వహించిన సమావేశంలో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఆయనపై నేరాభియోగాలు మోపిన తర్వాత పబ్లిక్ మీటింగుకి రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ శనివారం తన మద్దతుదారులకు ధైర్యం చెబుతూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే బైడెన్ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, నాకే పాపం తెలియదని అన్నారు. 20 ఏళ్ళు జైలులోనే... అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పదవీకాలం ముగిసిన తర్వాత వైట్ హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ పెంటగాన్, జాతీయ ఇంటెలిజెన్స్, దేశ భద్రతకు సంబంధించిన అనేక రహస్య పత్రాలను తనతో పాటు తీసుకువెళ్లారని ఫెడరల్ న్యాయస్థానంలో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఇందులో 37 అభియోగాలపై చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. నేరం రుజువైతే డోనాల్డ్ ట్రంప్ కనీసం 20 ఏళ్లపాటు జైలులోనే గడపాల్సి ఉంటుందని అంటున్నారు ఫెడరల్ న్యాయాధికారులు. ఎన్నికల భయంతోనే.. జార్జియా, నార్త్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశాల్లో మాట్లాడిన ట్రంప్ తానే నేరం చేయలేదని అన్నారు. జార్జియాలో జరిగిన సమావేశంలో తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని నేనే తప్పు చేయలేదని చెప్పిన ట్రంప్ నార్త్ కరోలినాలో మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానే ముందున్న నేపథ్యంలో అధికారం చేజారిపోతుందేమోనన్న భయంతో బైడెన్ ప్రభుత్వం ఈ తరహా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. నాపై ఉన్నవన్నీ హాస్యాస్పదమైన, నిరాధారమైన ఆరోపణలే. బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అమెరికా చరిత్రలోనే అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా మిగిలిపోతాయని అన్నారు. ఇది కూడా చదవండి: కెనడాలోని భారత విద్యార్ధులకు గుడ్ న్యూస్ -
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మెడకు రహస్య పత్రాల గొడవ
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మెడకు రహస్య పత్రాల గొడవ -
కాటేస్తున్న ‘రహస్యాలు’!
అమెరికాలో మొన్న నవంబర్ మధ్యంతర ఎన్నికలు డెమోక్రాటిక్ పార్టీకి అంచనాలకు మించిన విజయాలనందించాయి. ఇప్పుడిప్పుడే ద్రవ్యోల్బణం సద్దుమణిగిన జాడలు కనిపిస్తున్నాయి. ఆర్థిక రంగం అంతో ఇంతో పుంజుకుంటున్నదని కూడా అంటున్నారు. ఈ విజయోత్సాహంతోనే కావొచ్చు... రెండోసారి సైతం తానే డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థినని అధ్యక్షుడు జో బైడెన్ ఢంకా బజాయిస్తున్నారు. ఇంతటి శుభ తరుణంలో ఉరుము లేని పిడుగులా ‘రహస్యపత్రాలు’ బయటికొస్తూ బైడెన్‌ను ఇరుకున పడేస్తున్నాయి. ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువై రెండేళ్లక్రితం అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలై నిష్క్రమించిన డోనాల్డ్ ట్రంప్ పోతూ పోతూ అత్యంత రహస్యమైన ఫైళ్లను సంగ్రహించారన్న ఆరోపణలు ఏడాదిన్నర క్రితం గుప్పుమన్నాయి. ఆ వ్యవహారంపై విచారణ సాగుతోంది. ట్రంప్ ఎస్టేట్‌లో, ఆయన కార్యాలయాల్లో అటువంటి రహస్యపత్రాలు దొరి కాయి కూడా. ఆ మరకను ఎలా వదుల్చుకోవాలో తెలియక రిపబ్లికన్లు కకావికలవుతున్న తరుణంలో బైడెన్ సైతం ఆ తానులోని ముక్కేనని వెల్లడికావటం డెమొక్రాట్లకు సహజంగానే దుర్వార్త. ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతగా భావించక స్వప్రయోజనాలు నెరవేర్చుకునే సాధనంగా పరిగ ణించేవారే చట్టాలను బేఖాతరు చేస్తారు. నిబంధనలు అతిక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. ట్రంప్, బైడెన్‌లిద్దరూ ఆ పనే చేశారా అన్నది ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న. వాషింగ్టన్‌లోని బైడెన్ కార్యాలయంలో నిరుడు నవంబర్ 2న కొన్ని రహస్యపత్రాలు దొరికాయని గత వారం ఆయన న్యాయవాదులు ప్రకటించారు. 2017లో ఒబామా హయాంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి పత్రాలివి. దానిపై రిపబ్లికన్లు రచ్చ చేస్తుండగానే విల్మింగ్టన్లోని బైడెన్ సొంతింట్లో గురువారం ఆ కాలానికి సంబంధించినవే మరికొన్ని రహస్యపత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ట్రంప్ పుణ్యమా అని అమెరికా సమాజం నిట్టనిలువునా చీలింది. ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేని ఆయన మద్దతుదార్లు ఫలితాలు వెల్లడైనరోజు విధ్వంసానికి తెగించారు. దౌర్జన్యాలకు దిగారు. ఆ ఉదంతంపై విచారణ సాగుతున్న కాలంలోనే ట్రంప్ చేతివాటం బయటికొచ్చింది. అధ్యక్షుడిగా తన పరిశీలనకు వచ్చిన అత్యంత రహస్యమైన పత్రాలను ఆయన కట్టలకొద్దీ పోగేసుకున్నారని వెల్లడైంది. ఈ విషయంలో ట్రంప్‌పై అనర్హత వేటు పడే ప్రమాదమున్నదని కూడా అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇప్పుడు బైడెన్‌కూ అలాంటి ప్రారబ్ధమే చుట్టుకుంటుందా? ఎన్ని లోటుపాట్లున్నా ఇప్పటికీ ప్రపంచంలో అగ్రరాజ్యంగానే కొనసాగుతున్న అమెరికాను గత దశాబ్దకాలంగా ‘రహస్యపత్రాలు’ అడపా దడపా కాటేస్తూనే ఉన్నాయి. అమెరికా రక్షణ విభాగంలో పనిచేస్తున్న చెల్సియా ఎలిజెబెత్ మానింగ్ తొలిసారి 2010లో వికీలీక్స్‌కు అత్యంత కీలకమైన రహస్య ఫైళ్లు అందజేశారు. అందులో ఇరాక్, అఫ్ఘానిస్తాన్‌లలో అమెరికా సైన్యం సాగించిన దురాగతాలకు సంబంధించిన వీడియోలు, అధికారిక పత్రాలు, ఉన్నతస్థాయిలో సాగిన సంభాషణలు వగైరాలున్నాయి. ప్రస్తుతం రష్యాలో తలదాచుకుంటున్న ఎడ్వర్డ్ స్నోడెన్ సైతం అప్పట్లో వివిధ దేశాధినేతలపై అమెరికా రాయబారులు తమ అధ్యక్షుడికి పంపిన కేబుల్స్ లీక్ చేసి ఆ దేశం పరువును పాతాళానికి నెట్టారు. వారి మాదిరిగా ట్రంప్, బైడెన్లు రహస్య ఫైళ్లలోని అంశాలు బయటపెట్టి ఉండకపోవచ్చు. కానీ అధికారం వెలగబెట్టినవారు చెల్సియా, స్నోడెన్ మాదిరే సొంతానికి ఫైళ్లు పట్టుకెళ్లారని వెల్లడికావటం అమెరికాను ప్రపంచంలో నవ్వులపాలు చేయదా? ఇప్పుడు డెమొక్రాట్లకు వచ్చిపడిన సమస్యేమంటే... ట్రంప్ చౌర్యం బయటికొచ్చిన ప్పుడు వారు కాలరెగరేశారు. ఘనమైన రాజకీయ అనుభవం, పాలనకు కావలసిన సమర్థత, జాతీయ భద్రత అంశంలో రాజీపడని తత్వం తమ సొంతమని దండోరా వేశారు. కానీ బైడెన్ ‘రహస్యపత్రాల’ వ్యవహారం కాస్తా వారి గాలి తీసేసింది. ట్రంప్ ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ విభాగం రహస్యపత్రాలు పట్టుకున్నప్పుడు ‘ఒక దేశాధ్యక్షుడు ఇంత బాధ్యతారహితంగా ఎలా ఉంటార’ని బైడెన్ బోలెడు ఆశ్చర్యపోయారు. ఇప్పుడాయనే ఇరకాటంలో పడ్డారు. రెండుచోట్లా రహస్యపత్రాలే దొరికినా ఇద్దరినీ ఒకేగాటన కట్టొచ్చా? దొరకడంలో సారూ ప్యత ఉన్నా దొరికిన పత్రాల తీవ్రతలో తేడాలుండొచ్చు. ఆ సంగతి పత్రాల పరిశీలన పూర్తయితే గానీ తేలదు. అలాగే అవి ఎవరెవరి కంటపడ్డాయో కూడా తెలియవలసి ఉంది. ట్రంప్ దగ్గర 33 బాక్సుల్లోపట్టేన్ని పత్రాలు దొరికితే అందులో అనేకపత్రాలు ‘టాప్ సీక్రెట్’కు సంబంధించినవి. బైడెన్ దగ్గర సంఖ్యరీత్యా ఇంతవరకూ దొరికినవి తక్కువ. పైగా ‘మీ హయాంలోని రహస్యపత్రాలు తీసుకుపోయారట. వాటిని తక్షణం మాకు అప్పగించండ’ని జాతీయ పత్రాల భాండాగారం ఏడా దిగా కోరుతున్నా ట్రంప్ బేఖాతరు చేశారు. న్యాయశాఖను కూడా ఆయన లెక్క చేయలేదు. అందుకే ఎఫ్బీఐను ఉరికించాల్సివచ్చింది. ఇక బైడెన్ న్యాయవాదులు స్వచ్ఛందంగానే పత్రాలు అప్పగించినా వారి వ్యవహారశైలిలో దోషముంది. రెండునెలలపాటు వాటి సంగతి దాచి ఉంచారు. గత నెల 20న న్యాయశాఖకు చెప్పినా ఆ శాఖ సైతం మూగనోము పాటించింది. చివరకు గత సోమవారం బయటపెట్టింది. ట్రంప్‌ను ఎలాగైనా శిక్షింపజేయాలని చూస్తున్న అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్‌కు తాజా పరిణామం మింగుడుపడనిదే. ఇప్పుడు రాబర్ట్ కె. హర్ నేతృత్వంలో సాగబోయే విచారణ బైడెన్ భవితనూ, డెమొక్రాట్ల రాతనూ నిర్ణయిస్తుంది. చేసుకున్నవారికి చేసుకున్నంత! -
కేంద్ర బడ్జెట్ పత్రాల లీకు: ఇద్దరి అరెస్టు
అత్యంత రహస్యమైన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పత్రాలను లీక్ చేసిన కేసులో పెట్రోలియం మంత్రిత్వశాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు సహా పలువురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కార్పొరేట్ పెద్దలకు ఈ రహస్యాలను అందజేయాలన్నది వారి పథకంగా తెలిసింది. గతంలోనూ కొన్నిసార్లు బడ్జెట్ పత్రాలను లీక్ చేసే ప్రయత్నాలు జరిగాయి. ఈసారి బడ్జెట్ లో దిగుమతులతో పాటు ధరల నిర్ణయానికి సంబంధించి కేంద్రం తీసుకోదలచిన విధాన నిర్ణయాలన్నీ ఈ పత్రాల్లో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు దొంగతనం, మోసం కేసుల్లో మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దోషులు ఎవరినీ వదిలేది లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. పెట్రోలియం కంపెనీల ప్రలోభాలకు లోను కావడం వల్లే అధికారులు ఈ పనికి పాల్పడి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఢిల్లీలోని పలు పెట్రోలియం కంపెనీల కార్యాలయాలపై క్రైం బ్రాంచి పోలీసులు దాడులు చేశారు.