అత్యంత రహస్యమైన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పత్రాలను లీక్ చేసిన కేసులో పెట్రోలియం మంత్రిత్వశాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు సహా పలువురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కార్పొరేట్ పెద్దలకు ఈ రహస్యాలను అందజేయాలన్నది వారి పథకంగా తెలిసింది. గతంలోనూ కొన్నిసార్లు బడ్జెట్ పత్రాలను లీక్ చేసే ప్రయత్నాలు జరిగాయి.
ఈసారి బడ్జెట్ లో దిగుమతులతో పాటు ధరల నిర్ణయానికి సంబంధించి కేంద్రం తీసుకోదలచిన విధాన నిర్ణయాలన్నీ ఈ పత్రాల్లో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు దొంగతనం, మోసం కేసుల్లో మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
దోషులు ఎవరినీ వదిలేది లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. పెట్రోలియం కంపెనీల ప్రలోభాలకు లోను కావడం వల్లే అధికారులు ఈ పనికి పాల్పడి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఢిల్లీలోని పలు పెట్రోలియం కంపెనీల కార్యాలయాలపై క్రైం బ్రాంచి పోలీసులు దాడులు చేశారు.