petroleum ministry
-
తొలి క్రాస్‌బోర్డర్ ‘పెట్రోలైన్’.. ప్రారంభించిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాసియాలోని తొలి క్రాస్‌బోర్డర్ పెట్రోలియం పైప్‌లైన్ భారత్, నేపాల్ మధ్య ప్రారంభమైంది. బిహార్‌లోని మోతీహరి- నేపాల్‌లోని అమ్లేక్గంజ్ మధ్య నిర్మించిన ఈ పెట్రో పైప్‌లైన్‌ను ప్రధాని నరేంద్రమోదీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతోపాటు పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 69 కిలోమీటర్ల ఈ పైప్‌లైన్ కోసం కేంద్రం రూ. 350 కోట్లు వెచ్చించింది. కేవలం 15 నెలల రికార్డ్ సమయంలో ప్రాజెక్ట్ పూర్తికావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. నేపాల్ ప్రభుత్వ సహకారం, ఇరుదేశాల అధికారుల సమర్థత కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. -
‘చమురు’ కేటాయింపు అధికారం మంత్రులకే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ముడిచమురు, గ్యాస్ క్షేత్రాల లైసెన్సుల్ని కంపెనీలకు కేటాయించే అధికారాన్ని ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వశాఖలకు అప్పగిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం ఈ లైసెన్సులను జారీచేసే అధికారం కేబినెట్ కమిటీకే ఉండేది. ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ సెక్రటరీస్(ఈసీఎస్) సిఫార్సుల మేరకు బిడ్డింగ్‌లో విజేతలుగా నిలిచిన సంస్థలకు బ్లాకుల్లో పెట్రోలియం, సహజవాయువు వెలికితీతకు ఆర్థిక, పెట్రోలియం శాఖ మంత్రులు లైసెన్సులు జారీచేస్తారని కేంద్రం తెలిపింది. కాంట్రాక్టును దక్కించుకున్న కంపెనీలు తమ వాటాల్లో కొంతమొత్తాన్ని ఇతర సంస్థలకు అమ్ముకునేందుకు ఇకపై అనుమతిస్తారు. -
వ్యక్తి కాదు.. దేశమే ముఖ్యం
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంగారెడ్డి టౌన్: ‘నేను.. నా దేశం... ఈ రెండింటిలో నా దేశమే ముఖ్యం’ అన్న బీఆర్ అంబేద్కర్ నినాదంతో ముందుకు సాగాలని యువతకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. వ్యక్తి కంటే దేశం ముఖ్యమని, యువత స్వార్ధ చింతన వీడి లోక కల్యాణం కోసం పాటుపడాలని ఉద్బోధించారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 33వ రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడారు. ఏబీవీపీ మత సంస్థ కాదని, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి సురేష్, క్షేత్ర సంఘటన కార్యదర్శి రామ్మోహన్ జీ, రాష్ట్ర అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి, కార్యదర్శి అయ్యప్ప, స్వాగత సమితి అధ్యక్షుడు దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ నూతన అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా చెన్న కృష్ణారెడ్డి, కార్యదర్శిగా అయ్యప్ప ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా బాబురావు వ్యవహరించారు. -
డాక్యుమెంట్ల దొంగలకు నెలవారీ వేతనం
న్యూఢిల్లీ: కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖలో పత్రాలను లీక్ చేసిన వారికి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ భారీ మొత్తాన్ని నెలవారీ వేతనం కింద చెల్లించేవారని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. డాక్యుమెంట్ల లీకు కేసులో చార్జిషీట్‌ను సోమవారం ఇక్కడి ఒక కోర్టుకు సమర్పించారు. లల్తా ప్రసాద్, రాకేష్ కుమార్ అనే నిందితులు నెలవారీ మొత్తం రూ. 2.5 లక్షలు తీసుకునేవారి చార్జిషీట్లో పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని ఆర్ఐఎల్కు చెందిన శైలేశ్ సక్సేనా, ఎస్సార్‌కు చెందిన వినయ్ కుమార్, కెయిర్న్స్ ఇండియా నుంచి కేకే నాయక్, జుబిలంట్ ఎనర్జీ నుంచి సుభాష్ చంద్ర, అడాగ్‌కు చెందిన రిషి ఆనంద్‌తో పాటు ఎనర్జీ కన్సల్టెంట్ ప్రయాస్ జైన్, జర్నలిస్ట్ శంతను సైకియా చెల్లించేవారని పేర్కొన్నారు. తమ వ్యాపార లావాదేవీల కోసం నిందితులకు నెలవారీగా చెల్లింపులు చేసేవారమని ఆయా కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ కేసుకు సంబంధించి 13 మంది నిందితులపై ఢిల్లీ పోలీసులు సమర్పించిన చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. -
కేంద్ర బడ్జెట్ పత్రాల లీకు: ఇద్దరి అరెస్టు
అత్యంత రహస్యమైన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పత్రాలను లీక్ చేసిన కేసులో పెట్రోలియం మంత్రిత్వశాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు సహా పలువురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కార్పొరేట్ పెద్దలకు ఈ రహస్యాలను అందజేయాలన్నది వారి పథకంగా తెలిసింది. గతంలోనూ కొన్నిసార్లు బడ్జెట్ పత్రాలను లీక్ చేసే ప్రయత్నాలు జరిగాయి. ఈసారి బడ్జెట్ లో దిగుమతులతో పాటు ధరల నిర్ణయానికి సంబంధించి కేంద్రం తీసుకోదలచిన విధాన నిర్ణయాలన్నీ ఈ పత్రాల్లో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు దొంగతనం, మోసం కేసుల్లో మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దోషులు ఎవరినీ వదిలేది లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. పెట్రోలియం కంపెనీల ప్రలోభాలకు లోను కావడం వల్లే అధికారులు ఈ పనికి పాల్పడి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఢిల్లీలోని పలు పెట్రోలియం కంపెనీల కార్యాలయాలపై క్రైం బ్రాంచి పోలీసులు దాడులు చేశారు. -
గ్యాస్, కిరోసిన్, డీజిల్ ధరలు పెంచం: పెట్రోలియం శాఖ
న్యూఢిల్లీ: సబ్సిడీ గ్యాస్ సిలెండర్లు, కిరోసిన్, డిజీల్ ధరలను పెంచే ఉద్దేశం లేదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదనలేమి లేవని ప్రధాన్ తెలిపారు. కిరోసిన్, డీజిల్, ఎల్ పీజీ గ్యాస్ సిలెండర్ల ధరల పెంచేందుకు ప్రభుత్వ ప్రతిపాదన ఉందని వస్తున్న వార్తలను ఖండించారు. ఎల్ పీజీ గ్యాస్ సిలెండర్ ధర 250 రూపాయలు, కిరోసిన్ 5 రూపాయలు పెంచాలని కిరిటీ పరేఖ్ ప్యానల్ సిఫారసు చేసినప్పటికి ఇప్పట్లో ధరల పెంపు ఉండదన్నారు. బుధవారం నాన్ సబ్సిడీ ఎల్ పీజీ ధరను 16.50 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. -
ఆర్ఐఎల్ గ్యాస్ కేసులో విదేశీ ఆర్బిట్రేటర్ ఎంపిక
న్యూఢిల్లీ: కేజీ-డీ6 గ్యాస్ వివాదానికి సంబంధించి మూడో ఆర్బిట్రేటర్‌గా ఆస్ట్రేలియా మాజీ జడ్జి జేమ్స్ జాకబ్ స్పిగెల్మ్యాన్ని సుప్రీం కోర్టు ఎంపిక చేసింది. జస్టిస్ ఎస్ఎస్ నిజ్జర్ సారథ్యంలోని సుప్రీం కోర్టు బెంచ్ ఆయన పేరును సూచించింది. విదేశీ ఆర్బిట్రేటర్‌గా స్పిగెల్మ్యాన్ పక్షపాతం లేకుండా వ్యవహరిస్తారని బెంచ్ పేర్కొంది. కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి భారీగా పడిపోయిన అంశంలో ఆర్‌ఐఎల్‌పై కేంద్రం 1.79 బిలియన్ డాలర్ల మేర జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిపైనే ఆర్ఐఎల్ ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వ) ప్రక్రియ ప్రారంభిం చింది. ఇందుకు సంబంధించిన త్రిసభ్య ఆర్బిట్రేషన్ ప్యానెల్లో ఇప్పటికే ఇద్దరు నియమితులు కాగా.. మూడో ఆర్బిట్రేటర్‌గా స్పిగెల్మ్యాన్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో చీఫ్ జస్టిస్‌గాను, లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. -
ఏడాదికి ఆరు సిలిండర్లు చాలు: పనబాక లక్ష్మి
బాపట్ల, న్యూస్‌లైన్ : గ్యాస్ సిలిండర్ల వినియోగంపై కేంద్ర పెట్రోలియంశాఖ చేయించిన సర్వేలో వినియోగదారులు ఏడాదికి 6.5 సిలిండర్లు మాత్రమే వాడుతున్నట్లు తేలిందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. మిగిలిన సిలిండర్లను శుభకార్యాలకు, వంటశాలలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వల్ల కొందరు వినియోగదారులు, డీలర్లు లబ్ధిపొందుతున్నారని తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సబ్సిడీ నేరుగా వినియోగదారుల ఖాతాలో వేయటం వలన సిలిండర్ల బుకింగ్ తగ్గిపోయి బుక్‌చేసిన వెంటనే గ్యాస్ అందుతోందన్నారు. ఏడాదికి తొమ్మిది సిలిండర్లకు మించి ఇవ్వటం అనవసరమన్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు డీలర్లు అక్రమ మార్గాలు వెతుకుతూనే ఉన్నారని పేర్కొన్నారు. ఆధార్‌కార్డు నమోదు జరిగితే అవకతవకలు ఉండవ న్నారు. గ్యాస్ సరఫరాలో ఆధార్ కార్డు లింకేజీ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్డులో పిటిషన్ వేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టవచ్చా..? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ ఆయన సమైక్యావాది అని, అయినా ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని పేర్కొన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ విషయం తనకు తెలియదన్నారు. -
'వంటగ్యాస్, డీజిల్, కిరోసిన్ ధరలు పెంచాలని సిఫారసు'
వంట గ్యాస్, డీజిల్, కిరోసిన్ ధరలు పెంచాలని కిరీట్ పారిఖ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రభుత్వంపై సబ్సిడీ భారం ఎక్కువగా పడుతోందని, దీంతో ధరలు పెంచకతప్పదని సూచించింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు బుధవారం ఈ మేరకు నివేదిక సమర్పించింది. వంటగ్యాస్‌పై 250 రూపాయలు, డీజల్‌పై ఐదు, కిరోసిన్‌పై నాలుగు రూపాయల చొప్పున పెంచాలని పారిఖ్ కమిటీ సూచించింది. పెట్రోలియం వనరుల సబ్సిడీ భారం 80 వేల కోట్ల నుంచి 1.30 లక్షల కోట్లకు పెరిగిందని ప్రభుత్వానికి తెలియజేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడం, డాలర్‌తో రుపాయి మారకం విలువ తగ్గిన నేపథ్యంలో ధరలు పెంచక తప్పదని కమిటీ పేర్కొంది.