ఏడాదికి ఆరు సిలిండర్లు చాలు: పనబాక లక్ష్మి
బాపట్ల, న్యూస్‌లైన్ : గ్యాస్ సిలిండర్ల వినియోగంపై కేంద్ర పెట్రోలియంశాఖ చేయించిన సర్వేలో వినియోగదారులు ఏడాదికి 6.5 సిలిండర్లు మాత్రమే వాడుతున్నట్లు తేలిందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. మిగిలిన సిలిండర్లను శుభకార్యాలకు, వంటశాలలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వల్ల కొందరు వినియోగదారులు, డీలర్లు లబ్ధిపొందుతున్నారని తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సబ్సిడీ నేరుగా వినియోగదారుల ఖాతాలో వేయటం వలన సిలిండర్ల బుకింగ్ తగ్గిపోయి బుక్‌చేసిన వెంటనే గ్యాస్ అందుతోందన్నారు. ఏడాదికి తొమ్మిది సిలిండర్లకు మించి ఇవ్వటం అనవసరమన్నారు.
ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు డీలర్లు అక్రమ మార్గాలు వెతుకుతూనే ఉన్నారని పేర్కొన్నారు. ఆధార్‌కార్డు నమోదు జరిగితే అవకతవకలు ఉండవ న్నారు. గ్యాస్ సరఫరాలో ఆధార్ కార్డు లింకేజీ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్డులో పిటిషన్ వేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టవచ్చా..? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ ఆయన సమైక్యావాది అని, అయినా ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని పేర్కొన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ విషయం తనకు తెలియదన్నారు.