Donald Trump Was Allowed To Leave Court Without Conditions Or Travel Curbs - Sakshi
Sakshi News home page

సాక్షులతో మాట్లాడొద్దు

Published Thu, Jun 15 2023 5:59 AM | Last Updated on Thu, Jun 15 2023 10:03 AM

Donald Trump was allowed to leave court without conditions or travel curbs - Sakshi

మయామీలో ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికాలో ప్రభుత్వ రహస్య పత్రాలను తన నివాసంలో దాచిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై మంగళవారం ఉదయం మయామీ కోర్టులో దాదాపుగా 45 నిముషాల సేపు విచారణ కొనసాగింది. ఈ కేసులో తన తప్పేమీ లేదని ట్రంప్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. న్యాయ విచారణ ప్రారంభం కావడానికి 15 నిముషాల ముందే కోర్టుకు హాజరయ్యారు. ట్రంప్‌కు తోడుగా ఆయన వెంట  కుమారుడు ఎరిక్‌ ట్రంప్‌ కూడా న్యాయస్థానానికి వచ్చారు.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం శ్రమిస్తున్న ట్రంప్‌కు ఈ కేసు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. కోర్టులో కేసు విచారణ సాగినంత సేపు ట్రంప్‌ మౌనంగా తలవంచుకొని చూస్తూ కూర్చున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు రాసింది. దేశ భద్రతకు సంబంధించిన రహస్య పత్రాలను ట్రంప్‌ తనతో పాటు ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌కు తీసుకువెళ్లి ఉంచారని, దేశానికి చెందిన అణు రహస్యాలు ప్రైవేటు వ్యక్తులతో పంచుకున్నారంటూ ఆయనపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే.

గూఢచర్యం చట్టం కింద 31 నిబంధనల్ని అతిక్రమించారంటూ ట్రంప్‌పై 37 అభియోగాలు నమోదయ్యాయి. దేశానికి చెందిన ఒక మాజీ అధ్యక్షుడు క్రిమినల్‌ కేసులో ఈ స్థాయిలో అభియోగాలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. కోర్టులో విచారణ సమయంలో ట్రంప్‌ అమాయకుడని, ఆయనకే పాపం తెలీదని ఆయన తరఫు లాయర్‌ టాన్‌ బ్లాంచ్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేసుని విచారించిన న్యాయమూర్తి జోనథాన్‌ గూడ్‌మ్యాన్‌ ట్రంప్‌ ఈ కేసుకు సంబంధించిన సాక్షులు, ఇతరులెవరితోనూ నేరుగా మాట్లాడవద్దని షరతు విధించారు.

అధ్యక్ష పదవిలో అవినీతి పరుడు: ట్రంప్‌
కోర్టులో విచారణ ముగిసిన అనంతరం ట్రంప్‌ నిధుల సమీకరణ కోసం న్యూజెర్సీలోని గోల్ఫ్‌ కోర్టుకు మంగళవారం రాత్రి వెళ్లారు. ఆయనకు అక్కడ ఘనంగా స్వాగతం లభించింది. జూన్‌ 14 బుధవారం ట్రంప్‌ పుట్టిన రోజు కావడంతో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. హ్యాపీ బర్త్‌ డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌ తన అభిమానులతో మాట్లాడుతూ తనపై మోపిన ఈ కేసు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ఆరోపించారు. అధ్యక్ష పీఠంపై ఒక అవినీతి పరుడు కూర్చొని , తన రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement