cleanliness drive
-
పరిశుభ్రతతో వ్యాధులు దూరం: హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత పరిశుభ్రతతోనే వ్యాధులు దరిచేరవని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు శుభ్రతను పాటించాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బంజారాహిల్స్‌లోని తన ఇంటి పరిసరాలను మహమూద్ అలీ శుభ్రంచేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఓవైపు కరోనా విజృంభణ, మరోవైపు సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్న క్రమంలో అందరూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. బయటికి వెళ్లేవారు తప్పకుండా మాస్కు, శానిటైజర్ వెంట తీసుకెళ్లాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. -
బిహార్‌లో మోదీ ‘స్వచ్ఛాగ్రహం’
సాక్షి, పాట్నా : జాతిపిత మహాత్మా గాంధీ వందేళ్ల కిందట చేపట్టిన సత్యాగ్రహం ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బిహార్‌లోని మోతిహారిలో మంగళవారం 20,000 మంది స్వచ్ఛాగ్రాహి (పరిశుభ్రత రాయబారులు)లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బిహార్‌లో తన సత్యాగ్రహంతోనే గాంధీజీ మహాత్ముడిగా, బాపూగా మారారని కొనియాడారు. సత్యాగ్రహ స్ఫూర్తితో పరిశుద్ధ భారత్కోసం స్వచ్ఛాగ్రాహిలు కృషిచేస్తున్నారన్నారు. ఇది నూతన ఆరంభానికి నాందిగా పరిగణించాలని పిలుపు ఇచ్చారు. జయప్రకాష్ నారాయణ్ సైతం తన ఉద్యమానికి మహాత్మా గాంధీ నుంచే స్ఫూర్తి పొందారన్నారు. బిహార్‌లో సీఎం నితీష్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీలు స్వల్ప కాలంలోనే మెరుగైన అభివృద్ధిని సాధిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో టాయ్లెట్ల నిర్మాణం చేపట్టారని అన్నారు. -
యోగి ఎఫెక్ట్: దుకాణాల్లో ఏమైందంటే..
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడా పాన్ మసాలా, గుట్కా మరకలు కనిపించడానికి వీల్లేదు... సీఎం యోగి ఆర్డర్ అక్రమ కబేళాలను వెంటనే మూసేయాలి. అవి నడవడానికి వీల్లేదు.. ముఖ్యమంత్రి ఆదేశం గ్యాంగ్ రేప్ చేసి, యాసిడ్ తాగించిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.. ఆస్పత్రిలో పోలీసులతో ఆదిత్యనాథ్ వరుసపెట్టి పలు అంశాల్లో తన మార్కు చూపిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎఫెక్ట్ రాష్ట్రం మీద బాగానే కనపడుతోంది. ముఖ్యమంత్రి స్వయంగా ఆస్పత్రికి వచ్చి గ్యాంగ్ రేప్ బాధితురాలిని పరామర్శించిన తర్వాత.. రెండు గంటల్లోనే ఆ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఒక్కటే కాదు.. ఇంకా చాలా విషయాల్లో యోగి మార్క్ కనిపిస్తోంది. ప్రధానంగా దుకాణదారులు తమ దుకాణాల వద్ద బోర్డులు పెట్టి మరీ.. కస్టమర్లను తప్పనిసరిగా డస్ట్బిన్లు ఉపయోగించమని కోరుతున్నారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. లక్నో మహాత్మాగాంధీ మార్గ్ ప్రాంతంలోని కొంతమంది దుకాణదారులు పరిశుభ్రత కోసం స్వయంగా కృషి చేయడమే కాక.. కస్టమర్లకు కూడా చేతులు జోడించి మరీ చెబుతున్నారు. జితేందర్ కుమార్ యాదవ్ అనే వర్తకుడు లక్నోలో ఓ ధాబా నిర్వహిస్తారు. ఇటీవలి కాలంలో తన వ్యాపారం ఒక్కసారిగా బాగా పుంజుకుందని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలవడానికి వచ్చిన జనాలు తమ ధాబాకు వచ్చి తింటున్నారని చెప్పారు. ఆయన తన ధాబా వద్ద డస్ట్బిన్లు పెట్టడమే కాక, నోటీసులు కూడా అతికించారు. అంతకుముందు వరకు కస్టమర్లు వదిలేసిన ఆహార పదార్థాల చుట్టూ ఈగలు ముసిరేవని, కానీ ఇప్పుడు డస్ట్బిన్లు పెట్టిన తర్వాత అవి లేవని అన్నారు. అంతేకాదు, తన ధాబా పక్కనున్న ఫుట్‌పాత్ మొత్తాన్ని తన వర్కర్లతో శుభ్రం చేయిస్తున్నారు. సామాన్యులు కూడా తలుచుకుంటేనే స్వచ్ఛభారతం సాధ్యం అవుతుందని జితేందర్ అన్నారు. తనతో పాటు చాలామంది వర్తకులు ఇప్పుడు డస్ట్బిన్లు పెట్టారని, తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారని చెప్పారు. జితేందర్ దుకాణం పక్కనే ఉమాశంకర్ యాదవ్‌కు చెందిన టీకొట్టు ఉంది. అక్కడ మట్టి పాత్రలో ఇచ్చే టీ తాగడం జనానికి ఇష్టం. తాగిన తర్వాత ఇంతకుముందు ఆ పాత్రలను రోడ్డుమీదే పారేసేవారు. కానీ ఇప్పుడు డస్ట్బిన్లు పెట్టడంతో వాటిలో వేస్తున్నారు. పలు ప్రభుత్వ శాఖలు పరిశుభ్రత కార్యక్రమానికి పెద్దపీట వేస్తూ, సీఎం యోగి చేపట్టిన మిషన్‌ను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. లక్నో సీనియర్ ఎస్పీ స్వయంగా పోలీసు స్టేషన్‌ను శుభ్రం చేసి ఉదాహరణగా నిలిచారు. విద్యుత్ శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ కూడా తన కార్యాలయాన్ని తానే శుభ్రం చేసుకున్నారు. ఇలా క్రమంగా ఈ కార్యక్రమానికి మంచి ఊతం లభిస్తోంది. -
డ్రైనేజీ క్లీన్ చేసిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి సమీపంలోని మురికివాడలో డ్రైనేజీ క్లీన్ చేశారు. పేదలు ఎక్కువగా నివసించే బీఆర్ క్యాంపు ప్రాంతంలో మురికి కాలువలను శుభ్రం చేసే పనుల్లో సఫాయి కార్మికులతో పాటు ఆయన పాల్గొన్నారు. తర్వాత వారితో కలిసి టీ కూడా సేవించారని 'ఆప్' వర్గాలు వెల్లడించాయి. బీఆర్ క్యాంపు తన నియోజకవర్గంలోనే ఉండడంతో ఆయనీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్టోబర్ 2 నుంచి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్టు 'ఆప్' ట్వీట్ చేసింది. తమ ఎమ్మెల్యేలందరూ ఇందులో పాల్లొంటారని పేర్కొంది. ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ తాము భాగస్వాములం కాబోమని స్పష్టం చేసింది. ప్రధాని మోదీ గురువారం 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ప్రారంభించిన నేపథ్యంలో 'ఆప్' కూడా 'క్లీన్' కార్యక్రమం చేపట్టింది. -
పారిశుద్ధ్య డ్రైవ్ ప్రారంభించిన ఎస్డీఎమ్సీ
న్యూఢిల్లీ: వర్షాకాలం సమీపిస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకొని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎమ్సీ) సోమవారం పారిశుద్ధ్య డ్రైవ్ ప్రారంభించింది. తమ పరిధిలోని మధ్య, దక్షిణ, పశ్చిమ, నజఫ్‌గఢ్ జోన్లలో ఈ కార్యక్రమాన్ని ఆరంభించినట్టు కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. మేయర్ ఖుషీరామ్ చునర్ గ్రేటర్ కైలాష్ నుంచి, స్థాయీసంఘం చైర్మన్ సతీశ్ ఉపాధ్యాయ్, సభా నాయకుడు సుభాష్ ఆర్య, స్థాయీసంఘం డిప్యూటీ చైర్మన్ పంకజ్ సింగ్ సాకేత్, రాజోరీ గార్డెన్, నజఫ్‌గఢ్ నుంచి ఈ డ్రైవ్‌ను మొదలుపెట్టారు. అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ, ఘనవ్యర్థాలను పారబోయడం, బహిరంగ మూత్రశాలలను శుభ్రపర్చడం తదితర కార్యక్రమాలను ఈ సందర్భంగా చేపడతారు. అంటువ్యాధుల నిరోధం, రోడ్లకు మరమ్మతులు, పార్కులు, వీధి దీపాల నిర్వహణకు కూడా ప్రతేక శ్రద్ధ చూపిస్తామని మేయర్ రామ్ తెలిపారు. తమ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు ఎస్డీఎమ్సీ, నివాసుల సంక్షేమ సంఘాలు, ఇతర ప్రభుత్వ విభాగాలకు సహకరిస్తుందని ప్రకటించారు. వ్యర్థాల కేంద్రాలను శుభ్రపర్చడం, అనధికార కాలనీల్లో రోడ్లకు మరమ్మతులపై మరింత శ్రద్ధ చూపిస్తామని తెలిపారు. తమ ప్రాంతంలో పారిశుద్ధ్యం బాగా లేకుంటే స్థానికులు ఎస్డీఎమ్సీ కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదు చేయవచ్చని స్థాయీసంఘం చైర్మన్ సుభాష్ ఆర్య ఈ సందర్భంగా అన్నారు. ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య డ్రైవ్ కొనసాగుతున్న తీరును ఉన్నతాధికారులు తరచూ తనిఖీ చేస్తారని వెల్లడించారు. ఇదిలా ఉంటే దోమల కారక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఉత్తరఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎమ్సీ) ‘ప్రివెన్షన్ ఆఫ్ మలేరియా అండ్ డెంగీ డే’ పేరుతో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. వర్షాకాలం సమీపిస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమంలో ఉత్తరఢిల్లీ ఎంపీ ఉదిత్ రాజ్, మేయర్ యోగేందర్ చందోలియా కూడా పాల్గొన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో తన పరిధిలోని అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పశ్చిమఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎమ్సీ) కూడా శనివారం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. ఈడీఎమ్సీ మేయర్ మీనాక్షి షహద్రాలోని అన్నార్ మసీదు నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమం పక్షం రోజులపాటు కొనసాగుతుంది. అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులపై రోజువారీ సమీక్ష, ఘనవ్యర్థాల తొలగింపు, మూత్రశాలలను శుభ్రపర్చడం తదితర కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్వహిస్తారు. అంటువ్యాధుల నివారణ, రోడ్లకు మరమ్మతులు, పార్కులు, వీధి దీపాల ఆధునీకరణ తదితర కార్యక్రమాలనూ చేపడతామని మేయర్ మీనాక్షి పేరిట విడుదలైన ప్రకటన పేర్కొంది. పారిశుద్ధ్యంపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తామని పేర్కొంది. ఈ డ్రైవ్‌లో పాల్గొనాల్సిందిగా ప్రచార, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, నివాసుల సంక్షేమ సంఘాలు, మార్కెట్ సంఘాల ద్వారా ఈడీఎమ్సీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.