న్యూఢిల్లీ: వర్షాకాలం సమీపిస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకొని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎమ్సీ) సోమవారం పారిశుద్ధ్య డ్రైవ్ ప్రారంభించింది. తమ పరిధిలోని మధ్య, దక్షిణ, పశ్చిమ, నజఫ్‌గఢ్ జోన్లలో ఈ కార్యక్రమాన్ని ఆరంభించినట్టు కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. మేయర్ ఖుషీరామ్ చునర్ గ్రేటర్ కైలాష్ నుంచి, స్థాయీసంఘం చైర్మన్ సతీశ్ ఉపాధ్యాయ్, సభా నాయకుడు సుభాష్ ఆర్య, స్థాయీసంఘం డిప్యూటీ చైర్మన్ పంకజ్ సింగ్ సాకేత్, రాజోరీ గార్డెన్, నజఫ్‌గఢ్ నుంచి ఈ డ్రైవ్‌ను మొదలుపెట్టారు. అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ, ఘనవ్యర్థాలను పారబోయడం, బహిరంగ మూత్రశాలలను శుభ్రపర్చడం తదితర కార్యక్రమాలను ఈ సందర్భంగా చేపడతారు. అంటువ్యాధుల నిరోధం, రోడ్లకు మరమ్మతులు, పార్కులు, వీధి దీపాల నిర్వహణకు కూడా ప్రతేక శ్రద్ధ చూపిస్తామని మేయర్ రామ్ తెలిపారు.
తమ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు ఎస్డీఎమ్సీ, నివాసుల సంక్షేమ సంఘాలు, ఇతర ప్రభుత్వ విభాగాలకు సహకరిస్తుందని ప్రకటించారు. వ్యర్థాల కేంద్రాలను శుభ్రపర్చడం, అనధికార కాలనీల్లో రోడ్లకు మరమ్మతులపై మరింత శ్రద్ధ చూపిస్తామని తెలిపారు. తమ ప్రాంతంలో పారిశుద్ధ్యం బాగా లేకుంటే స్థానికులు ఎస్డీఎమ్సీ కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదు చేయవచ్చని స్థాయీసంఘం చైర్మన్ సుభాష్ ఆర్య ఈ సందర్భంగా అన్నారు. ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య డ్రైవ్ కొనసాగుతున్న తీరును ఉన్నతాధికారులు తరచూ తనిఖీ చేస్తారని వెల్లడించారు. ఇదిలా ఉంటే దోమల కారక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఉత్తరఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎమ్సీ) ‘ప్రివెన్షన్ ఆఫ్ మలేరియా అండ్ డెంగీ డే’ పేరుతో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
వర్షాకాలం సమీపిస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమంలో ఉత్తరఢిల్లీ ఎంపీ ఉదిత్ రాజ్, మేయర్ యోగేందర్ చందోలియా కూడా పాల్గొన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో తన పరిధిలోని అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పశ్చిమఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎమ్సీ) కూడా శనివారం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. ఈడీఎమ్సీ మేయర్ మీనాక్షి షహద్రాలోని అన్నార్ మసీదు నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమం పక్షం రోజులపాటు కొనసాగుతుంది. అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులపై రోజువారీ సమీక్ష, ఘనవ్యర్థాల తొలగింపు, మూత్రశాలలను శుభ్రపర్చడం తదితర కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్వహిస్తారు.
అంటువ్యాధుల నివారణ, రోడ్లకు మరమ్మతులు, పార్కులు, వీధి దీపాల ఆధునీకరణ తదితర కార్యక్రమాలనూ చేపడతామని మేయర్ మీనాక్షి పేరిట విడుదలైన ప్రకటన పేర్కొంది. పారిశుద్ధ్యంపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తామని పేర్కొంది. ఈ డ్రైవ్‌లో పాల్గొనాల్సిందిగా ప్రచార, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, నివాసుల సంక్షేమ సంఘాలు, మార్కెట్ సంఘాల ద్వారా ఈడీఎమ్సీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
పారిశుద్ధ్య డ్రైవ్ ప్రారంభించిన ఎస్డీఎమ్సీ
Published Mon, Jun 23 2014 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM
Advertisement
Advertisement