500 స్టింగ్ ఆపరేషన్లు, 400 సీడీలు
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుతర్వాత బ్యాంకులపై ఐటీ దాడుల నేపథ్యంలో అవినీతి బ్యాంకు ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వం చురుగ్గా కదులుతోంది. ఐటీ అధికారులు అందించిన సమాచారం, సేకరించిన కచ్చితమైన సాక్ష్యాలతో మేరకు ఆయా అధికారులపై కొరడా ఝుళిపించేందుకు ఆర్థిక శాఖ కసరత్తును ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
నల్ల కుబేరులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్న బ్యాంకు అధికారులకు చెక్ పెట్టేందుకు ఐటీ అధికారులు దాదాపు 500 బ్యాంకు బ్రాంచ్ లపై స్ట్రింగ్ ఆపరేషన్లు నిర్వహించారు. దాదాపు 400 సీడీల సాక్ష్యాధారాలను సేకరించారు. ఈ నేపథ్యంలో అవినీతి బ్యాంకు ఉద్యోగుల బండారానికి సంబంధించిన సమాచారమంతా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేరింది. దీంతో నల్లధనాన్ని వైట్ గా మార్చుకునేందుకు సహాయం చేస్తున్న వివిధ బ్యాంకుల సిబ్బందిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి.
కాగా నగదు కొరత సమస్యను అధిగమించేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థలో నోట్ల సరఫరాకు సంబంధించి ఆర్థిక శాఖ , ఆర్బీఐ అనేక చర్యలకు దిగింది. మరోవైపు డిమానిటైజేషన్ తరువాత నల్లధనాన్ని వెలికితీసే చర్యల్లో భాగంగా ఐటీ దాడులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో భారీ ఎత్తున కొత్త కరెన్సీ నోట్లను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకు పోయిన అవినీతికి అద్దం పడుతూ కొత్త రూ 2,000, రూ. 500నోట్లను అధికారులు భారీగా సీజ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులపై దాడులు చేసిన ఆదాయపన్ను అధికారులు పాత కొత్త, కరెన్సీ నోట్లను భారీ ఎత్తున స్వాధీనం చేసుకోవడం తెలిసిందే.