పేద రోగులపై చిత్తశుద్ధి ఉందా?
కర్నూలు(హాస్పిటల్) : పేద రోగుల పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జూనియర్ వైద్యులతో చర్చలు జరపాలని జూడాల సంఘం నేతలు నాగరాజు, ఆదిత్య, వినయ్, మౌనిక, వంశీవిహార్ తదితరులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏడవ రోజు హౌస్సర్జన్లు, పీజీ వైద్య విద్యార్థులు, రెసిడెంట్ స్పెషలిస్టులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను బహిష్కరించారు.
ఆసుపత్రి ప్రాంగణంలోని క్లినికల్ లెక్చర్ గ్యాలరీ నుంచి 107 జీవోతో శవయాత్ర నిర్వహించారు. ఈ శవయాత్ర గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం, సర్జరీ విభాగం, సెంట్రల్ ల్యాబ్ మీదుగా క్యాజువాలిటీ వరకు కొనసాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జూడా నేతలు మాట్లాడుతూ వైద్య వృత్తి పట్ల ఎంతో ఆసక్తితో వస్తే, ప్రభుత్వం నీరుగార్చే విధంగా వ్యవహరించడం తగదన్నారు.
ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవలు అందిస్తున్న జూనియర్ వైద్యుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని విమర్శించారు. మూడు నెలలుగా తమ సమస్యను విన్నవిస్తున్నా పరిష్కరించకుండా జాప్యం చేస్తోందన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నా, ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తుందని ప్రశ్నించారు. వైద్య విద్యను పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు హైకోర్టు స్పష్టంగా చెబుతున్నా సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకోవడం లేదని పేర్కొన్నారు.