నేను మీ కన్నుని
నాకంటే సంక్లిష్టమైన అవయవం మరొకటి లేదు. నేను ఆనంద్ కన్నును. సున్నుండ సైజులో ఉంటాన్నేను. సైజు చూసి నన్ను తక్కువగా అంచనా వేయకండి. కోట్లాది ఎలక్ట్రికల్ కనెక్షన్ల సాయంతో నేను క్షణంలోనే పదిహేను లక్షల సందేశాలను స్వీకరిస్తాను. ఆనంద్ విజ్ఞానంలో ఎనభైశాతం నా ద్వారా వచ్చినదే. చరిత్రపూర్వ యుగంలోని ఆనంద్ పూర్వీకుల్లో నా పనితీరే వేరు. వాళ్లకు ఎదురయ్యే అపాయాలు ఎంతదూరంలో ఉన్నాయో చూపడమే నా పని. ఇప్పటికి కూడా దూరంగా ఉండే వాటిని చూడటానికి అనువుగానే నా నిర్మాణం ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆనంద్ నన్ను చాలా కష్టపెడుతున్నాడు. చదవడం, టీవీ చూడటం వంటి పనులతో బలవంతంగా క్లోజప్‌లో చూసేలా చేస్తున్నాడు. ఆనంద్ ఒక్కడనే కాదు గానీ, ఈ కాలంలో మనుషులందరూ ఇదే పని చేస్తున్నారు.
ఇదీ నా నిర్మాణం
నా ముందు గదిలో ఒక కిటికీ ఉంటుంది. ప్రస్ఫుటంగా కనిపించే దానిని ‘కార్నియా’ అంటారు. నల్లగుడ్డు అని కూడా అంటారు. చూసే ప్రక్రియ ఇక్కడి నుంచే మొదలవుతుంది. కాంతి కిరణాలను ఇది ఒక క్రమపద్ధతిలో నాలోకి వంచుతుంది. దీని తర్వాత ‘ప్యూపిల్’ అనే భాగం ఉంటుంది. అది కాంతికిరణాల ప్రవేశద్వారం. కాంతికిరణాలు ఎక్కువగా ఉంటే, అవన్నీ ఒకేసారి లోపలకు పోకుండా ఇది ముడుచుకుంటుంది. చీకటిగా ఉన్నప్పుడు విశాలంగా తెరుచుకుంటుంది. నాలోని అద్భుతం అంతా ప్యూపిల్ తర్వాత ఉండే లెన్స్ నుంచి మొదలవుతుంది. ఇది బాదం ఆకారంలో ఉంటుంది. అత్యంత బలమైన కండరాలు లెన్స్ అంచుల మీద కవర్ అయ్యేలా ఉంటాయి. ఇవి లెన్స్‌ను పట్టి ఉంచుతాయి. ఈ కండరాలు బిగుతుగా మారినప్పుడు నేను దగ్గరి వస్తువులను చూస్తాను. దూరపు వాటిని చూడాలంటే, ఈ కండరాలు కాస్త రిలాక్స్ అవుతాయి.
చూపు ఓ విద్యుత్స్రాయనిక చర్య
ఆనంద్ ఏదైనా వస్తువును చూసేటప్పుడు దాని నుంచి వచ్చే కాంతి కిరణాలు నాలోని లెన్స్ నుంచి లోపలకు ప్రవేశిస్తాయి. అవన్నీ ఉల్లిపొరలాంటి ‘రెటీనా’ అనే తెరపై పడతాయి. రెటీనా విస్తీర్ణం కేవలం మూడు చదరపు సెంటీమీటర్లే. అయినా, అందులో కాంతిని గ్రహించే 13.7 కోట్ల రిసెప్టార్ కణాలు ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ దృశ్యాలను చూసేందుకు వీలుగా రాడ్ ఆకారంలో 13 కోట్ల కణాలు, రంగులను చూసేందుకు కోన్ ఆకారంలో 70 లక్షల కణాలు ఉంటాయి. రాడ్స్లో ఉండే ఎరుపు-ఊదా రంగులో ‘రడాప్సిన్’ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఈ పిగ్మెంట్‌లో జరిగే విద్యుత్స్రాయనిక చర్య వల్లే చూడటం అనే ప్రక్రియ జరుగుతుంది. రంగులను చూడటానికి ఉపయోగపడే కోన్స్‌లో ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగులను గుర్తించడానికి వేర్వేరు పిగ్మెంట్లు ఉంటాయి. ప్రాథమికమైన ఈ రంగులను ఉపయోగించి చిత్రకారులు వివిధ వర్ణాలను రాబట్టినట్లే, కోన్స్లోని ఈ పిగ్మెంట్ల సాయంతోనే వివిధ రంగులను, వాటి ఛాయలను మెదడు గుర్తిస్తుంది. ఉదాహరణకు ఆనంద్ చిమ్మచీకట్లో ఒక మిణుగురును క్షణకాలం చూశాడనుకోండి. అప్పుడు రాడ్ కణాల మీద పడ్డ కాంతి కాస్త వెలిసిపోయినట్లుగా (బ్లీచ్) అవుతుంది. ఆ సమయంలో రాడ్ కణాల్లో ఒక వోల్టులోని పది లక్షలవ వంతు విద్యుత్తు పుడుతుంది. దాని ఫలితంగా ఆ దృశ్యం ఆప్టిక్ నెర్వ్ ద్వారా మెరుపు వేగంతో మెదడుకు చేరుతుంది. ఈ విద్యుత్స్రాయన చర్యకు పట్టే సమయం 0.002 సెకండ్లే! అయితే, కోన్స్‌లో మాత్రం చీకటిలో ఈ విద్యుత్స్రాయనిక చర్య చాలా తక్కువగా జరుగుతుంది. అందుకే చీకట్లో ఆనంద్ మెదడు రంగులను గుర్తించలేదు. ఆ పనిని రాడ్స్ కణాలే చేస్తుండటంతో రంగులు ఉన్నా, అవన్నీ నలుపు తెలుపుల్లో బూడిద రంగులోనే కనిపిస్తాయి.
అంతా తల వెనుకే...
చూపును కలిగించే మెదడులోని దృష్టి కేంద్రం తల వెనుక భాగంలో ఉంటుంది. ఆనంద్‌కు తల వెనుక బలంగా దెబ్బ తగిలిందనుకోండి. అతడి దృష్టి కేంద్రం తీవ్రంగా గాయపడి శాశ్వతంగా చూపు కోల్పోవచ్చు. ఒక మోస్తరు దెబ్బతగిలిందనుకోండి. క్షణకాలం అతడికి చుక్కలు కనిపిస్తాయి. దెబ్బ తాకిన సమయంలో కళ్లలో జరిగే విద్యుత్ ప్రక్రియకు విఘాతం ఏర్పడటం వల్ల అలా జరుగుతుందన్న మాట.
చూసేదంతా మెదడే...
చూడటానికి నేనో సాధనాన్ని మాత్రమే. నిజానికి చూసేదంతా మెదడే. ఆనంద్ నిద్రపోతున్నా కలలో అతడికి అనేక దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఆ సమయంలో అతడి కళ్లు మూసుకుని ఉన్నా, చుట్టూ చిమ్మచీకటి ఆవరించి ఉన్నా అతడికి కల కనిపిస్తూనే ఉంటుంది. ఒకవేళ ఆనంద్ పుట్టుగుడ్డి అనుకోండి. అలాంటప్పుడు అతడికి కలలోనూ ఎలాంటి దృశ్యాలూ కనిపించవు. కేవలం స్పర్శ, వినికిడి, వాసనల ద్వారా కలిగిన జ్ఞానాలే కలలో వ్యక్తమవుతూ ఉంటాయి.
అపారం నా కండరబలం
నా కండరాల బలం అపారం. రోజుకు దాదాపు నాలుగు లక్షల సార్లు నా కండరాలు కదులుతూ ఉంటాయి. ఆనంద్ రోజుకు యాభై మైళ్లు నడిస్తే, అతడి కాళ్ల కండరాలకు ఎంతటి శ్రమ కలుగుతుందో, రోజూ నా కండరాలకు అంతే శ్రమ కలుగుతుంది.
నాలోని లాక్రిమల్ గ్రంథులు స్రవించే కన్నీళ్లను చిమ్మేలా చేసుకుని క్షణకాలంలో నన్ను నేను శుభ్రం చేసుకుంటూ ఉంటాను. నా కార్నియాను తేమగా ఉంచుకుంటాను. నా కన్నీళ్లలో ఉండే ‘లైసోజైమ’ నన్ను ఇన్ఫెక్షన్లు కలిగించే సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తూ ఉంటుంది.
అలసట నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తుంటాను. ఆనంద్ కనురెప్ప కొట్టినప్పుడల్లా ‘హమ్మయ్య’ అనుకుంటుంటా. ఒక్కోసారి అవతలి వైపు ఉండే నా సోదరుడు కాస్త విశ్రాంతి తీసుకుంటే, తొంభై శాతం పనిభారాన్ని నేనే తీసుకుంటా. నేను రిలాక్స్ అయ్యేటప్పుడు వాడు ఆ భారాన్ని తీసుకుంటాడనుకోండి.
నాకో అద్భుతమైన గూడు...
ప్రకృతి నాకో అద్భుతమైన గూడు ఏర్పాటు చేసింది. ఒక పక్క చెక్కిలి ఎముకలు, మరోపక్క నుదుటి ఎముక... వాటి మధ్య ఉండే చిన్ని తొర్రలో నేనుంటా. ఏదైనా దెబ్బ తగిలితే... మొదట వాటికే తగిలేలా నా గూడు ఉంటుంది. అప్పటికీ అగ్నికణాల్లాంటివి ఏవో దూసుకొస్తూనే ఉంటాయి. ఇలాంటి రేణువులు ఎగిసే చోట పనిచేసే వారు కళ్లజోడు ధరిస్తే మేలు. ఇక నన్ను మరింత బాధపట్టే అంశాల్లో జబ్బులు మరొకటి. కొన్నిసార్లు నాలోంచి పోయే ద్రవాల కంటే నాలోకి వచ్చే ద్రవాలు పెరిగే స్థితి ఒకటి ఉంటుంది. అలా జరిగితే నాలోని ఆప్టిక్ నర్వ్ దెబ్బతిని, చూపు తగ్గుతుంది. ఈ పరిస్థితినే గ్లకోమా అంటారు. ఈ పరిస్థితి అదేపనిగా కొనసాగితే ఆనంద్‌కు శాశ్వతంగా చూపు పోవచ్చు. ఆనంద్‌కు ఈ వయసులో వచ్చే అవకాశం ఉన్న జబ్బు ఇదే. దీనికోసం ఆనంద్ ఏటా తప్పనిసరిగా డాక్టర్‌తో పరీక్ష చేయించుకోవాలి. టోనోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగించి డాక్టర్ గ్లకోమా ఉన్నది లేనిదీ నిర్ధారిస్తారు.
ఇక ఈ వయసులో ఆనంద్‌కు ఆస్టిగ్మాటిజమ్ అనే జబ్బు వచ్చే అవకాశాలూ ఉన్నాయి. అద్దం మీద నీటి బుడగ ఉన్నప్పుడు దాంట్లోంచి చూస్తే ఎలా మసగ్గా కనిపిస్తుందో, ఆస్టిగ్మాటిజమ్ వచ్చినప్పుడు అలాగే కనిపిస్తుంది. ఇక రెటీనా ఊడిపోవడం అనేది మరో సీరియస్ సమస్య. విపరీతమైన కాంతిని వెదజల్లే మెరుపును చూసినప్పుడు ఇలా జరగవచ్చు. ఇదే జరిగితే ఊడిన రెటీనాను యథాస్థానంలో అతికించడానికి శస్త్రచికిత్స చేయక తప్పదు. ఎనభై శాతం కేసుల్లో శస్త్రచికిత్సలు విజయవంతమవుతాయి. నాలోని కార్నియా, లెన్స్... ఈ రెండూ పారదర్శకంగా ఉంటాయి. వాటిలో తలెత్తే లోపాల వల్ల వచ్చే అంధత్వాన్ని కార్నియా మార్పిడి శస్త్రచికిత్స ద్వారా దూరం చేయవచ్చు. లెన్స్‌లో పారదర్శకత తగ్గితే కాటరాక్ట్ ఆపరేషన్‌తో సరిచేయవచ్చు.
అదృష్టవశాత్తూ... ఇలాంటి చాలా సమస్యలను ఆనంద్ ఇప్పటి వరకూ అధిగమించాడు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ అతడి ఇతర కండరాల్లాగే కంటి కండరాలూ బలహీనమవుతాయి. రెటీనాకు రక్తసరఫరా చేసే రక్తనాళాలూ బిరుసెక్కుతాయి. రెటీనాకు మునపటిలా రక్తసరఫరా జరగకపోవచ్చు. ఇలా జరుగుతందేమోనని ఆనంద్ భయపడాల్సిందేమీ లేదు. నాపై కాస్త దృష్టి పెడితే చాలు. ఆనంద్‌కు జీవితాంతం దృష్టి మెరుగ్గా ఉంటుంది.
చూపు కలకాలం పదిలంగా ఉండాలంటే బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే క్యారట్, విటమిన్ ‘ఏ’ ఉండే గుడ్లు, పాలు వంటి పోషకాహారాలు తీసుకోవాలి.