Closure of schools
-
నాడు చతికిల‘బడి’.. నేడు ఉజ్వలంగా మారి..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ బడులను గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా నిర్వీర్యం చేశారు. బడుల అభివృద్ధిని పూర్తిగా వదిలేయడంతో చాలా వరకూ శిథిలావస్థకు చేరాయి. ఇలాంటి బడుల్లో ఉండలేక చాలామంది పేదింటి పిల్లలు చదువుకు దూరమయ్యారు. బడులను బాగు చేయాల్సిన ఆ ప్రభుత్వం.. సరిపడినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో 2014–19 మధ్య 1,785 పాఠశాలలను మూసివేసింది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను సైతం విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా పూర్తిస్థాయిలో అందివ్వలేకపోయింది. పేద పిల్లలకోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతలేకుండా చేసింది. తన వర్గంగా భావించిన నారాయణ, శ్రీచైతన్య వంటి విద్యా సంస్థలకు మేలు చేసేలా ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేశారు. చివరికి ఎంతో అనుభవం ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా నారాయణ విద్యా సంస్థల సిబ్బందితో శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టు అప్పగించేలా దిగజార్చింది. జగన్ హయాంలో బడులకు మహర్దశ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని అనేక సంస్కరణలను అమలు చేసింది. 58 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్ల నిధులను వెచ్చింది 45 వేల ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేలా ప్రణాళికను అమలు చేసింది. ఓ పక్క పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లి ఖాతాలో జగనన్న అమ్మఒడి కింద రూ.15 వేలు జమ చేసే సంక్షేమ పథకాన్ని అందిస్తూనే మరో పక్క విద్యా సంస్కరణలను అమలు చేసింది. తద్వారా బడిలో హాజరుశాతం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2021లో విద్యా సంస్కరణలపై అధ్యయనం చేసింది. ఎంతోమంది నిపుణులైన ఉపాధ్యాయుల సూచనలతో ‘నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టింది. మూడో తరగతి నుంచే అత్యున్నత ప్రమాణాలను అందిస్తూ సబ్జెక్టు టీచర్లతో విద్యా బోధన చేపట్టింది. ఫలితంగా 3వ తరగతి నుంచే విద్యార్థులకు బీఈడీ అర్హత గల సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. అంతేగాక 2014–2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం మూసివేసిన 1,785 పాఠశాలలను తిరిగి తెరిపించింది. సర్కారు బడుల నిర్వహణలో ఇద్దరికీ ఉన్న వ్యత్యాసం ఇది. గత ప్రభుత్వం సర్కారు బడులపై చిన్నచూపు చూసింది. ప్రైవేటు యాజమాన్యాల మత్తులో పడి పూర్తిగా నిర్వీర్యం చేసింది. రకరకాల కారణాలతో పెద్ద సంఖ్యలో మూసివేసింది. పైగా విద్యనందించడం ప్రభుత్వ బాధ్యత కాదంటూ సరికొత్త భాష్యం చెప్పింది. ఫలితంగా వేలాదిమంది నిరుపేదలు చదువులకు దూరమయ్యారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు విద్యారంగంలో ప్రత్యేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఆధునిక దేవాలయాలుగా తీర్చిదిద్దింది. ప్రతి గ్రామంలో సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత ఆకర్షణీయంగా తరగతిగదులను మార్చింది. మూతపడిన పాఠశాలలను తెరిపించడమే గాకుండా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేసింది. ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసి... జాతీయ స్థాయి పరీక్షలను సమర్థంగా ఎదుర్కొనేలా పిల్లలకు తర్ఫీదునిచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న విద్యావిప్లవం నేడు అంతర్జాతీయ వేదికల ప్రశంసలు అందుకునేలా చేసింది. ఉత్తమ ఫలితాల సాధనలో ముందంజ గత ప్రభుత్వం విధానాలతో నిర్వీర్యమైన ప్రభుత్వ విద్యను గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అప్పటికే పలు సంస్థలు చేసిన అధ్యయనాల్లో ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు వయసుకు తగిన అభ్యాస ఫలితాలను సాధించలేకపోతున్నారని, బోధనా ప్రమాణాలు సైతం తక్కువగా ఉన్నాయని తేల్చారు. ఆరో తరగతికి వచ్చే విద్యార్థులు తక్కువ లెర్నింగ్ స్టాండర్డ్స్‌తో ఉంటున్నారని, సిలబస్‌ను సైతం అర్థం చేసుకోలేకపోతున్నారని, బేసిక్స్ కూడా తెలియడం లేదని తెలుసుకున్నారు. అప్పటినుంచి దానిని అధిగమించేందుకు ప్రత్యేక దృష్టిసారించారు. ► 2021–22 విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీల నుంచి ఉన్నత పాఠశాలల వరకు ప్రభుత్వంలోని అన్ని మేనేజ్మెంట్లలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. ► అంగన్వాడీలను పీపీ–1, పీపీ–2 బోధన స్థాయికి పెంచడంతో పాటు ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో, హైస్కూళ్లల్లో 62 వేల ఐఎఫ్‌పీ స్క్రీన్స్‌తో డిజిటల్ విద్యాబోధన ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బడిపిల్లలు ఇంగ్లిష్‌లో రాణించేందుకు టోఫెల్ శిక్షణను ప్రవేశపెట్టారు. ► బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టి ఇంగ్లిష్ నేర్చుకోవడం సులభతరం చేశారు. ప్రాధమిక పాఠశాలల్లోని ఒకటి నుంచి 5 తరగతుల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో పదాలతోనే పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించి అందించారు. ‘రోజుకో ఇంగ్లిష్ పదం’ నేర్చుకునే విధానం ప్రవేశపెట్టారు. ► 1000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అమలు చేశారు. ఈ సంస్కరణల ఫలితాలను సైతం తల్లిదండ్రులు చూశారు. 2023–24 విద్యా సంవత్సరంలో దాదాపు 94 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. 2022–23లో పదో తరగతి, ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు అన్నీ ప్రభుత్వ విద్యార్థులే కైవసం చేసుకున్నారు. 2025 జూన్ నుంచి ఇంటర్నేషనల్ బాకలారియెట్ బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. -
బడుల మూసివేతతో ఒక తరం మొత్తానికి నష్టం!
న్యూఢిల్లీ: కరోనా కారణంగా బడులు మూసివేతతో ఒక తరం మొత్తం దుర్బలమయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక హెచ్చరించింది. ప్రస్తుత విలువ ప్రకారం లెక్కిస్తే ఒక తరం విద్యార్ధులు బడుల మూసివేతతో 17 లక్షల కోట్ల డాలర్ల జీవితకాల ఆర్జనను నష్టపోతారని అంచనా వేసింది. ఈ మొత్తం ప్రస్తుత ప్రపంచ జీడీపీలో 14 శాతానికి సమానమని తెలిపింది. కరోనా కారణంగా పలు దేశాల్లో విద్యా సంస్థలను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిన సంగతి తెలిసిందే. యునెస్కో, యూనిసెఫ్‌తో కలిసి ప్రపంచబ్యాంకు ‘‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ క్రైసిస్’’ పేరిట ఈ నివేదికను రూపొందించింది. గతంలో అనుకున్నదానికన్నా విద్యాసంస్థల మూసివేతతో వచ్చే నష్టం అధికమని తెలిపింది. బడుల మూసివేతతో 10 లక్షల కోట్ల డాలర్లు నష్టమని 2020లో ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. గతంలో అల్పాదాయ దేశాల్లోని పిల్లల్లో 53 శాతం మంది పేదరికంతో జీవించడాన్ని నేర్చుకునేవారని, స్కూల్స్ మూసివేతతో వీరి సంఖ్య 70 శాతానికి చేరనుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో ప్రపంచ విద్యావ్యవస్థలు స్తంభించాయని, కరోనా బయటపడిన 21 నెలల తర్వాత కూడా కోట్లాదిమంది పిల్లల బడులు మూసివేసే ఉన్నాయని వ్యాఖ్యానించింది. వీరిలో చాలామందికి ఇకపై బడికి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చని అంచనా వేసింది. జ్ఞానార్జనకు పిల్లలు దూరం కావడం నైతికంగా సహించరానిదని, ఒకతరం పిల్లలు పేదరికంలోకి జారడం భవిష్యత్ ఉత్పాదకతపై, ఆదాయాలపై పెను ప్రభావం చూపుతుందని ప్రపంచ బ్యాంకు ఎడ్యుకేషన్ గ్లోబల్ డైరెక్టర్ జైమె సావెద్రా వివరించారు. నిజాలను చూపుతున్న గణాంకాలు బడుల మూసివేతతో గతంలో చేసిన అంచనాల కన్నా తీవ్ర ఫలితాలున్నాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నట్లు నివేదిక తెలిపింది. గ్రామీణ భారతం, పాకిస్తాన్, బ్రెజిల్, మెక్సికో తదితర ప్రాంతాల్లో పిల్లలు లెక్కలు, చదవడంలో నష్టపోయారని గణాంకాలు వివరిస్తున్నట్లు తెలిపింది. బడుల మూసివేత ఎంతకాలం కొనసాగింది, విద్యార్థుల సామాజికార్థిక పరిస్థితి, గ్రేడ్ లెవల్‌ను బట్టి నష్టాలుంటాయని వివరించింది. ప్రభుత్వాలు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల్లో కేవలం 3 శాతం కన్నా తక్కువ మొత్తమే విద్యారంగానికి అందాయని విమర్శించింది. చాలా దేశాల విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసుల్లాంటివి చేపట్టినా, వీటి విస్తృతి, నాణ్యత వేర్వేరుగా ఉన్నాయని తెలిపింది. అల్పాదాయ దేశాల్లో సుమారు 20 కోట్ల మంది విద్యార్ధులు నూతన విద్యాబోధనా పద్ధతులకు దూరంగా ఉన్నారని పేర్కొంది. -
మళ్లీ మొదటికి..
►ఎట్టకేలకు ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్ ►మొదటికొచ్చిన రేషనలైజేషన్ ►అధికారులకు కొత్త తలనొప్పులు ►స్థాన చలనం కోసం 9 వేల మంది దరఖాస్తు ►67 ప్రాథమిక పాఠశాలలు మూత ►యూపీ స్కూల్స్ 100కు తగ్గే అవకాశం నెల్లూరు (టౌన్) : ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు తాజా షెడ్యూల్ ప్రకటించింది. దీంతో హేతుబద్ధీ్దకరణ (రేషనలైజేషన్) వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. రేషనలైజేషన్, వెబ్ కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టిన విషయం విదితమే. ప్రభుత్వం తాత్సారం చేయడంతో నెల రోజులపాటు గందరగోళం నెలకొంది. బదిలీలకు సంబంధించిన జీఓలో సవరణలు చేయగా.. ఉపాధ్యాయులు మెట్టు దిగకపోవడంతో పాయింట్లు, ఇతర నిబంధనల మార్పు, పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అంగీకరించిన ప్రభుత్వం తాజాగా రేషనలైజేషన్, బదిలీలకు సంబంధించి కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. విద్యార్థులకూ తప్పని అవస్థలు తాజా షెడ్యూల్ జిల్లా విద్యాశాఖ అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే పూర్తిచేసిన రేషనలైజేషన్ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. పాఠశాలలు ప్రారంభించి నెల రోజులు కావస్తోంది. ఈ నేపథ్యంలో రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టి తగినంత మంది విద్యార్థులు లేని పాఠశాలల్ని మూసివేయడం, వారిని సమీపంలోని పాఠశాలలో విలీనం చేయడం కష్టతరం కానుంది. ఇదిలావుంటే.. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాయింట్లపై కుస్తీ పడుతూ విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో బోధన పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఫలితంగా విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. తాజా షెడ్యూల్ విడుదలతో మరో నెల రోజులపాటు బోధన మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో విద్యార్థులు చదువులో రెండు నెలలపాటు వెనుకబడే దుస్థితి నెలకొంది. కార్పొరేట్ పాఠశాలల్లో తొలి విడత సిలబస్ పూర్తిచేసి ఫార్మెటివ్ పరీక్షలకు సిద్ధమవుతుంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. 67 ప్రాథమిక పాఠశాలల మూసివేత గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. తాజా నిర్ణయం వల్ల ఈ కార్యక్రమం మొదటికొచ్చింది. ప్రస్తుత అంచనాల ప్రకారం 63 ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా మూతపడనున్నాయి. వీటితోపాటు 100 ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయిని తగ్గించి ప్రాథమిక పాఠశాలలుగా మారుస్తారు. ఉన్నత పాఠశాలల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని అధికారులు చెబుతున్నారు. 6 వేల మందికి బదిలీ తప్పనిసరి జిల్లాలో 9 వేల మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒకేచోట 8 ఏళ్లు పనిచేసిన ఉపాధ్యాయులు 6 వేల మందికి పైగా ఉన్నట్టు సమాచారం. వీరంతా తప్పనిసరిగా బదిలా అవుతారని చెబుతున్నారు. వీరుకాకుండా మరో 3 వేల మంది బదిలీ కోసం విజ్ఞాపన దరఖాస్తు చేకున్నారు. వీరిలో ఎంతమందికి బదిలీ అవుతుందనేది తేలాల్సి ఉంది. మిగులు ఉపాధ్యాయులు 500 మంది తాజా మార్గదర్శకాల ప్రకారం చూస్తే జిల్లాలో 500 మంది మిగులు ఉపాధ్యాయులుగా ఉంటారని భావిస్తున్నారు. వీరందరినీ కొరత ఉన్న పాఠశాలలకు సబ్జెక్టుల వారీగా నియమిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.