బీబీసీ సహా.. ప్రధాన వెబ్సైట్లు క్రాష్!
బీబీసీ, ఉబెర్, నెట్ఫ్లిక్స్.. ఇలాంటి డజన్ల కొద్దీ ప్రధాన వెబ్సైట్లు ఉన్నట్టుండి క్రాష్ అయ్యాయి. అయితే వీటిలో చాలావరకు కొద్ది సేపటికే మళ్లీ మామూలుగా పనిచేయడం ప్రారంభించాయి. ఇలా ఎందుకు క్రాష్ అయ్యాయన్న విషయం తెలియలేదు గానీ, క్లౌడ్ సర్వీసులో లోపం వల్లే అయ్యిందేమోనని అంటున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఇదేదో కుట్ర జరిగిందన్న వదంతులు బాగా వ్యాపించాయి.
మొబైల్, ట్యాబ్, డెస్క్టాప్, ల్యాప్టాప్.. ఇలా అన్ని డివైజ్లలోనూ సమస్య వచ్చినట్లు నెట్ఫ్లిక్స్ తన కస్టమర్ సర్వీస్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అల్ట్రాడీఎన్ఎస్ క్లౌడ్ సర్వీసులో సాంకేతిక సమస్య కారణంగానే తమకు ఇబ్బంది ఎదురైందని నెట్ఫ్లిక్స్ ప్రతినిధి జోరిస్ ఎవర్స్ తెలిపారు. దాదాపు రెండు డజన్ల వెబ్సైట్లు ఇలా క్రాష్ అయినట్లు ఇంటర్నెట్ ట్రబుల్ ట్రాకర్ కరెంట్లీడౌన్.కామ్ తెలిపింది. ఆ వెబ్సైట్ల జాబితాను కూడా అది వెల్లడించింది. ద ఎకనమిస్ట్, అమెరిట్రేడ్ లాంటి సైట్లు కూడా ఇందులో ఉన్నాయి.