కంపెనీల మధ్య పోటీతో.. కస్టమర్లకే ప్రయోజనం
♦ మొబైల్ కంపెనీల మధ్య పోటీ
♦ ఆషాఢం సేల్‌లో 51 శాతం దాకా డిస్కౌంట్
♦ బిగ్ సి మొబైల్స్ సీఎండీ బాలు చౌదరి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మొబైల్స్ తయారీలో ఉన్న చైనా కంపెనీలు నేరుగా భారత్‌లో అడుగుపెడుతున్నాయి. దీంతో కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నువ్వా నేనా అన్నట్టు స్మార్ట్ ఫీచర్స్‌తో మొబైల్స్‌ను ప్రవేశ పెడుతున్నాయని బిగ్ సి మొబైల్స్ సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు. అది కూడా అందుబాటు ధరలో విక్రయించడంతో కస్టమర్లకే అధిక ప్రయోజనం చేకూరుతోందని శుక్రవారమిక్కడ మీడియాతో చెప్పారు. బ్రాండ్‌కు బదులు వినియోగదార్లు విలువ చూస్తున్నారని అన్నారు. రూ.3 వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టిన రిలయన్స్ జియో భారత టెలికం రంగంలో సంచలనం సృష్టించడం ఖాయమన్నారు. ఉచిత డేటాతో కస్టమర్లను ఈ కంపెనీ ఆకట్టుకుంటోందని వివరించారు.
ముప్పు తొలగింది..: ఈ-కామర్స్ కంపెనీలు గతేడాది భారీ డిస్కౌంట్లతో ఉపకరణాలను విక్రయించడంతో రిటైలర్లు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడా కంపెనీలు డిస్కౌంట్లు ఇవ్వడం మానేశాయని బాలు చౌదరి తెలిపారు. ‘రిటైల్ వ్యాపారులు ఈ-కామర్స్ ముప్పు నుంచి బయటపడ్డారు. బిగ్-సి ప్రతినెలా 30-40% వృద్ధి నమోదు చేస్తోంది. 115 స్టోర్లతో 1.8 కోట్ల మంది వినియోగదార్లకు చేరువయ్యాం. వీరిలో 80% మంది రిపీటెడ్ కస్టమర్లు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ఒకరు బిగ్ సి వినియోగదారు. మొబైల్స్ సగటు విక్రయ ధర ఏడాదిలో రూ.4,400 నుంచి రూ.5 వేలకు వచ్చి చేరింది’ అని తెలిపారు.
భారీ డిస్కౌంట్లతో..
ఆషాఢం సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై 51 శాతం దాకా డిస్కౌంట్‌ను బిగ్ సి ప్రకటించింది. ఏడేళ్లుగా ఈ ఆఫర్‌ను కొనసాగిస్తున్నామని, కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన ఉందని వివరించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి సేల్‌లో 50 శాతం ఎక్కువ మోడళ్లను జోడించారు. ఐఫోన్ 6 ప్లస్‌పై రూ.18 వేల డిస్కౌంట్, ఎల్జీ మాగ్నాపై 55 శాతం, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ సిల్వర్‌పై 53 శాతం, లైఫ్ విండ్-1పై 35 శాతం, శాంసంగ్ గెలాక్సీ నోట్-5పై 30 శాతం డిస్కౌంట్ ఉంది. ఎంపిక చేసిన మోడళ్లపై రెండు ఫీచర్ ఫోన్లు, వీఆర్ బాక్స్, హెడ్సెట్లలో ఒకదానిని రూ.51లకే అందుకోవచ్చు. జీరో డౌన్‌పేమెంట్ సౌకర్యమూ ఉంది.