ఆత్మరక్షణలో టీఆర్ఎస్!
- ప్రాణ హిత డిజైన్ మార్పుతో ఇరుకునపడిన అధికారపార్టీ
- సీఎం ప్రకటనతో ఆత్మరక్షణలో ప్రజాప్రతినిధులు
- విపక్షాల దాడిని ఎదుర్కోలేక దాటవేత ధోరణి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్పుతో అధికార పార్టీ ఇరుకున పడింది. గోదావరి జలాలను మెదక్ జిల్లా వరకే పరిమితం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. డిజైన్ మార్పుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని దాటవేసిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు సమాధానం చెప్పుకోలేక ముఖం చాటేస్తున్నారు. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు నుం చి రంగారెడ్డి జిల్లాను ఎత్తివేయడంపై కాంగ్రెస్ నేతృత్వం లోని అఖిలపక్షం ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ప్రాజె క్టు పనులను పరిశీలించడమే కాకుండా.. క్షేత్రస్థాయిలో ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకొని ప్రభుత్వంపై దాడిచేసింది.
అయితే, మొదట్నుంచీ రక్షణాత్మక వైఖరిని అవలంబించిన టీఆర్ఎస్.. సీఎం ప్రకటనతో దిక్కుతోచని పరిస్థితిలో పడింది. జెడ్పీ సమావేశాన్ని కాంగ్రెస్, టీడీపీ అడ్డుకున్న సమయంలో ఇంకా దీనిపై విధానపర నిర్ణయం తీసుకోలేదని మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటిం చారు. అంతేకాకుండా ప్రాజెక్టు ఆయకట్టు నుంచి జిల్లా తొలగించకుండా వారం రోజుల్లో సీఎంను కలిసే ఏర్పా టు చేస్తానని హామీ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఖరా రు కాలేదు కానీ, ప్రాజెక్టును మెదక్ వరకే పరిమితం చేస్తున్నట్లు సీఎం విస్పష్ట ప్రకటన చేశారు.
దీంతో విపక్షాలన్నీ రాజకీయ పోరాటానికి పిలుపునిచ్చాయి. జిల్లా ప్రయోజనాలకు భంగం కలిగించేలా సర్కారు నిర్ణయం తీసుకుంటున్నా.. జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు నోరుమెదపకపోవడంపై విమర్శనాస్త్రాలు సంధించాయి. శని వారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ అంశంపై ఫిర్యా దు చేయాలని నిర్ణయించాయి. ఒత్తిడి పెంచినా ప్రభుత్వం దిగిరాకపోతే న్యాయపోరాటానికి సిద్ధం కావాలని ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి.
ఎవరికివారే..
ప్రాణహిత పనుల మళ్లింపుపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేతులె త్తేశారు. ప్రాజెక్టు డిజైన్ మార్పు నిర్ణయాన్ని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమర్థించగా, మిగతా నేతలు ఈ అంశంపై నోరు విప్పేందుకు వెనుకాడుతున్నారు. జిల్లా రైతాంగానికి లబ్ధి చేకూర్చే ఈ ప్రాజెక్టును పక్కనపెట్టి.. ఎలాంటి అనుమతుల్లేని కృష్ణా జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తామనే ప్రభుత్వ ప్రకటనను ప్రజలు విశ్వసించడంలేదని సాక్షాత్తూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే అనధికారికంగా అంగీకరిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రాణహిత నమూనా మార్పుపై ప్రభుత్వ తీరును ప్రశ్నించలేక.. జిల్లా ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడలేక కప్పదాటు ధోరణి అవలంబిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శల కు సమాధానం ఇచ్చేందుకు మంత్రి మహేందర్‌రెడ్డే ఇష్టపడడం లేదు. మేమేందుకు దూకుడు ప్రదర్శించాలి’ అని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు ప్రశ్నించారు. డి జైన్ మార్పులేదని ఇన్నాళ్లు బుకాయించి.. ఇప్పుడు నిర్ణయం సరైందేనని వాదించడం కూడా మాకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోతున్నాం అని స్పష్టం చేశారు.