co producer
-
రామాయణంకి ఎంతైనా కష్టపడతాను: యశ్
‘‘నమిత్, నేను కలిసి రామాయణంపై మూవీ చేస్తే బాగుంటుందని చాలా సార్లు అనుకున్నాం. కానీ, అంత పెద్ద సబ్జెక్టు తియ్యాలంటే అది మామూలు విషయం కాదు.. బడ్జెట్స్ కూడా సరిపోవు.. అందుకే నేను కూడా కో ప్రోడ్యూస్ చెయ్యాలనుకున్నాను. ఈ ‘రామాయణం’ కోసం ఎంతైనా కష్టపడతాను’’ అన్నారు ‘కేజీఎఫ్’ ఫేమ్ హీరో యశ్. ఆయన నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి రామాయణం నేపథ్యంలో ఓ సినిమా నిర్మించనున్నాయి. ఈ చిత్రానికి నితీష్ తివారి దర్శకుడు. నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తీయడంలో న్యాయం చేయగలను అనిపిస్తోంది’’ అన్నారు. కాగా నితీష్ తివారి దర్శకత్వంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ‘రామాయణ్’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికే నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలనే టాక్ వినిపిస్తోంది. -
ఇప్పుడు చెప్పాల్సిన కథ ఇది
ఏఆర్ రెహమాన్ మరో సినిమా నిర్మించనున్నారు. ఆల్రెడీ ‘99 సాంగ్స్’ చిత్రం ద్వారా ఆయన నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘నో ల్యాండ్స్ మ్యాన్’ అనే చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది యూఎస్–ఇండియా–బంగ్లాదేశ్ సినిమా. జాతిపరంగా విభజించబడిన ఈ ప్రపంచంలోని హానికర వ్యక్తులపై ఫోకస్ చేస్తూ సాగే చిత్రం ఇది. ఈ సినిమా నిర్మించాలనుకోవడానికి గల ముఖ్య కారణం గురించి రెహమాన్ చెబుతూ – ‘‘కొత్త ప్రపంచంలో ఎప్పుడూ కొత్త సవాళ్లు ఉంటాయి. అందుకని కొత్త కథలు చెప్పడానికి కుదురుతుంది. ఈ చిత్రకథ అలాంటిదే. ఇప్పటి ప్రపంచానికి చెప్పాల్సిన కథ, ఇప్పటి సమయానికి తగ్గ కథ ఇది’’ అన్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన హిందీ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా నాకు ఓ సవాల్‌లా అనిపించింది. అయినప్పటికీ నటుడిగా సంతృప్తినిచ్చింది. ఏఆర్ రెహమాన్ ప్రతిభ ‘నో ల్యాండ్స్ మ్యాన్’ని గొప్ప సినిమాగా నిలబెడుతుంది’’ అన్నారు. ఈ సినిమా కథ విషయానికొస్తే... దక్షిణాసియాకి చెందిన ఓ వ్యక్తి జీవితం యూఎస్‌లో ఓ ఆస్ట్రేలియన్ యువతిని కలిశాక ఎంత సంక్లిష్టంగా మారిందనేది కథ. ఆసిఫ్ మాండ్వి రాసిన ‘నో ల్యాండ్స్ మ్యాన్’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారని సమాచారం. హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో సంభాషణలు ఉంటాయి. నిర్మాణానంతర కార్యక్రమాలను యూ ఎస్, ఇండియా, బంగ్లాదేశ్‌లో జరపాలనుకున్నారు. లాక్డౌన్ వల్ల ఆ పనులు ఆగాయి. బంగ్లాదేశ్ దర్శకుడు మొస్తోఫా సర్వార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. -
అనేక మందిని ఇష్టం వచ్చినట్లు ‘వాడేశాడు’
సాక్షి, సిటీబ్యూరో: సినీ రంగంలో కో–ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్న ఓ ప్రబుద్ధుడు ప్రముఖుల పీఏనంటూ అనేక మందిని ఇష్టం వచ్చినట్లు ‘వాడేశాడు’. ఇతడి బారినపడిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు సైతం ఉన్నారు. ఉద్యోగాల కోసం పైరవీ నుంచి సినిమా టికెట్ల వరకు దేన్నీ వదలకుండా అందరినీ ‘వినియోగించుకున్నాడు’. ఉద్యోగాలు ఇప్పిస్తాని డబ్బు దండుకున్నాడు. బుధవారం పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.60 వేల నగదు, సెల్ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా, అమలాపురానికి చెందిన వంగ ఆనంద్ బాబు నగరానికి వలసవచ్చి యూసుఫ్‌గూడ బస్తీలో స్థిరపడ్డాడు. సినీ రంగంలో కో–ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్న ఇతను తన స్వస్థలానికి వెళ్ళినప్పుడల్లా పెద్దలతో పరిచయాలు ఉన్నాయంటూ గొప్పలు చెప్పేవాడు. కొన్నాళ్ళకు ‘ఈ పరిచయాలనే’ క్యాష్ చేసుకోవాలని భావించాడు. తన స్నేహితురాలి పేరుతో ఓ సిమ్‌కార్డు తీసుకున్న ఆనంద్ బాబు వెబ్సైట్లు, డైరెక్టరీల ఆధారంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లు, వారి హోదాలు తెలుసుకోవడం ప్రారంభించాడు. నిందితుడు వంగా ఆనంద్ బాబు వారి మాదిరిగానే ప్రముఖులకు ఫోన్లు చేయడం, ఎస్సెమ్మెస్‌లు పంపించడం చేసేవాడు. ఉద్యోగాలకు సిఫార్సులు, పోస్టింగ్స్‌తో పాటు తిరుమలలో దర్శనాలు, అనేక ప్రాంతాల్లో బసలు ఆ ప్రముఖులతోనే ఏర్పాటు చేయించుకున్నాడు. చివరకు కొందరు అధికారులకు సదరు ప్రముఖుడిగా ఫోన్లు చేసి తన వాళ్ళు వస్తున్నారంటూ సినిమా టిక్కెట్లు సైతం సిద్ధం చేయించుకుని తన స్నేహితురాలితో కలిసి వెళ్ళేవాడు. ఆనంద్‌బాబు ప్రధానమంత్రి కార్యాలయం అదనపు సెక్రటరీ ఏకే శర్మ, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు తదితరుల పేర్లు వాడుకున్నాడు. ఈ పేర్లతో వివిధ జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో పాటు ఉన్నతాధికారులనూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో రెండేళ్ల క్రితం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు. బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు తన ‘సినిమా పని’ చూసుకున్నాడు. అయితే అలా వచ్చే డబ్బుతో జల్సాలు చేయడం సాధ్యం కాకపోవడంతో మళ్లీ పాత పంథా అనుసరించాడు. తన స్నేహితుల సాయంతో ఢిల్లీ నుంచి ఓ సిమ్‌కార్డు కొనుగోలు చేసిన దాని ద్వారా కాల్స్ చేసి తాను కొందరు ప్రముఖులకు పీఏ అని పరిచయం చేసుకునేవాడు. ఉద్యోగాలు, పోస్టింగ్స్, బదిలీలను సిఫార్సు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లోని పోలీసుస్టేషన్లలో పని చేస్తున్న అనేక మంది ఎస్సైలకు ఫోన్లు చేసి కొన్ని కేసుల్ని సెటిల్ చేశాడు. ఇందుకుగాను సంబంధీకుల నుంచి డబ్బు వసూలు చేశాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ స్కూల్ యజమానికి కాల్ చేసి సీటు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నుంచి రూ.65 వేలు తీసుకుని మోసం చేశాడు. హెచ్‌డీఎఫ్‌సీలో మేనేజర్‌గా ఓ యువతికి ఫోన్ చేసిన ఆనంద్‌బాబు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.90 వేలు కాజేశాడు. తనకు ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలను వినియోగించి ఏ పని అయినా చేసి పెడతానంటూ ఓ వ్యక్తి నుంచి రూ.7 లక్షలు తీసుకుని మోసం చేశాడు. ఓ వ్యక్తి గుర్తింపుకార్డులు, బ్యాంకు వివరాలు వినియోగించుకుని కారు కొనుగోలు చేశాడు. ఆపై నెలసరి వాయిదాలు చెల్లించడం మానేయడంతో బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి ఆ డబ్బు కట్ అవసాగింది. ఇలాంటి ఆరోపణలపై ఆనంద్ బాబుపై జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, హయత్‌నగర్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్ ముజఫర్ అలీలు వలపన్ని బుధవారం పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. -
స్పీడ్ పెరిగింది
షారుక్ ఖాన్ నిర్మాతగా ఫుల్ స్పీడ్‌లో ఉన్నారు. కానీ, హీరోగా చేసే కొత్త ప్రాజెక్ట్‌ను అంగీకరించడానికి మాత్రం టైమ్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ‘బార్డ్ ఆఫ్ బ్లడ్, క్లాస్ ఆఫ్ 83’ సినిమాలను నెట్‌ఫ్లిక్స్ కోసం నిర్మిస్తున్న ఆయన తాజాగా ఓ హారర్ సిరీస్‌కు సహ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలిసింది. ‘బీతాల్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సిరీస్‌లో వినీత్ కుమార్ సింగ్, ఆహనా కుమ్రా ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. రాధికా ఆప్టే ‘గౌల్’ సిరీస్‌ను డైరెక్ట్ చేసిన ప్యాట్రిక్ గ్రహం ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. షారుక్ సినిమాల విషయానికి వస్తే అట్లీ దర్శకత్వంలో ఓ సినిమలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. -
వీవీఐపీలు తెలుసంటూ కో ప్రొడ్యూసర్ ఏం చేశాడంటే..
హైదరాబాద్: సినీ రంగంలో కో–ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న ఓ ప్రబుద్ధుడు వీవీఐపీల పేర్లు చెప్పి అనేక మంది ప్రముఖుల్ని ‘ఇష్టం వచ్చినట్లు వాడేశాడు’. ఉద్యోగాలకు పైరవీ నుంచి సినిమా టిక్కెట్ల వరకు ‘వినియోగించుకున్నాడు’. ఇద్దరు నిరుద్యోగులకు ఢిల్లీలో ఉద్యోగాల పేరుతో భారీగా దండుకున్నాడు. చివరకు సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన వంగ ఆనంద్‌బాబు నగరానికి వచ్చి ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో స్థిరపడ్డాడు. సినీ రంగంలో కో–ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న ఇతగాడు.. తన స్వస్థలానికి వెళ్లినప్పుడల్లా పెద్దలతో పరిచయాలు ఉన్నాయంటూ డాంబికాలకు పోయేవాడు. కొన్నాళ్లకు ‘ఈ పరిచయాలనే’ క్యాష్ చేసుకోవాలని భావించాడు. తన స్నేహితురాలి పేరుతో ఓ సిమ్‌కార్డు తీసుకున్న ఆనంద్‌బాబు వెబ్సైట్లు, డైరెక్టరీల ఆధారంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లు, వారి హోదాలు తెలుసుకున్నాడు. వారి మాదిరిగానే ప్రముఖులకు ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పంపించడం మొదలెట్టాడు. ఉద్యోగాలకు సిఫార్సులు, పోస్టింగ్స్‌తో పాటు తిరుమలలో దర్శనాలు, అనేక ప్రాంతాల్లో బసలు ఆ ప్రముఖులతోనే ఏర్పాటు చేయించుకున్నాడు. చివరకు కొందరు అధికారులకు సదరు ప్రముఖుడిగా ఫోన్లు చేసి తన వాళ్ళు వస్తున్నారంటూ సినిమా టిక్కెట్లు సైతం సిద్ధం చేయించుకుని తన స్నేహితురాలితో కలిసి వెళ్ళేవాడు. ఆనంద్‌బాబు ఇప్పటి వరకు ప్రధానమంత్రి కార్యాలయం అదనపు సెక్రటరీ ఏకే శర్మ, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు తదితర పేర్లు వాడుకున్నాడు. ఈ పేర్లతో వివిధ జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరెంటెండెంట్లతో పాటు ఉన్నతాధికారులనూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. ఇద్దరు నిరుద్యోగులకు ఢిల్లీలోని సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉన్నతోద్యోగాలు ఇప్పిస్తాంనంటూ భారీగా దండుకున్నాడు. ఇతడి వ్యవహారాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందింది. ఏసీపీ కేసీఎస్ రఘువీర్ ఆదేశాలతో ఇన్స్పెక్టర్ బి.చాంద్‌బాష, ఎస్సై బి.మధుసూదన్ వలపన్ని అరెస్టు చేశారు. ఇతగాడి మోసాలను పూర్తిస్థాయిలో గుర్తించడానికి న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని సైబర్ క్రైమ్ అధికారులు నిర్ణయించారు.