సాక్షి, సిటీబ్యూరో: సినీ రంగంలో కో–ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్న ఓ ప్రబుద్ధుడు ప్రముఖుల పీఏనంటూ అనేక మందిని ఇష్టం వచ్చినట్లు ‘వాడేశాడు’. ఇతడి బారినపడిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు సైతం ఉన్నారు. ఉద్యోగాల కోసం పైరవీ నుంచి సినిమా టికెట్ల వరకు దేన్నీ వదలకుండా అందరినీ ‘వినియోగించుకున్నాడు’. ఉద్యోగాలు ఇప్పిస్తాని డబ్బు దండుకున్నాడు. బుధవారం పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.60 వేల నగదు, సెల్‌ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా, అమలాపురానికి చెందిన వంగ ఆనంద్ బాబు నగరానికి వలసవచ్చి యూసుఫ్‌గూడ బస్తీలో స్థిరపడ్డాడు. సినీ రంగంలో కో–ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్న ఇతను తన స్వస్థలానికి వెళ్ళినప్పుడల్లా పెద్దలతో పరిచయాలు ఉన్నాయంటూ గొప్పలు చెప్పేవాడు. కొన్నాళ్ళకు ‘ఈ పరిచయాలనే’ క్యాష్ చేసుకోవాలని భావించాడు. తన స్నేహితురాలి పేరుతో ఓ సిమ్‌కార్డు తీసుకున్న ఆనంద్ బాబు వెబ్‌సైట్లు, డైరెక్టరీల ఆధారంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లు, వారి హోదాలు తెలుసుకోవడం ప్రారంభించాడు.
నిందితుడు వంగా ఆనంద్ బాబు
వారి మాదిరిగానే ప్రముఖులకు ఫోన్లు చేయడం, ఎస్సెమ్మెస్‌లు పంపించడం చేసేవాడు. ఉద్యోగాలకు సిఫార్సులు, పోస్టింగ్స్‌తో పాటు తిరుమలలో దర్శనాలు, అనేక ప్రాంతాల్లో బసలు ఆ ప్రముఖులతోనే ఏర్పాటు చేయించుకున్నాడు. చివరకు కొందరు అధికారులకు సదరు ప్రముఖుడిగా ఫోన్లు చేసి తన వాళ్ళు వస్తున్నారంటూ సినిమా టిక్కెట్లు సైతం సిద్ధం చేయించుకుని తన స్నేహితురాలితో కలిసి వెళ్ళేవాడు. ఆనంద్‌బాబు ప్రధానమంత్రి కార్యాలయం అదనపు సెక్రటరీ ఏకే శర్మ, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు తదితరుల పేర్లు వాడుకున్నాడు.
ఈ పేర్లతో వివిధ జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో పాటు ఉన్నతాధికారులనూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో రెండేళ్ల క్రితం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు. బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు తన ‘సినిమా పని’ చూసుకున్నాడు. అయితే అలా వచ్చే డబ్బుతో జల్సాలు చేయడం సాధ్యం కాకపోవడంతో మళ్లీ పాత పంథా అనుసరించాడు. తన స్నేహితుల సాయంతో ఢిల్లీ నుంచి ఓ సిమ్‌కార్డు కొనుగోలు చేసిన దాని ద్వారా కాల్స్ చేసి తాను కొందరు ప్రముఖులకు పీఏ అని పరిచయం చేసుకునేవాడు.
ఉద్యోగాలు, పోస్టింగ్స్, బదిలీలను సిఫార్సు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లోని పోలీసుస్టేషన్లలో పని చేస్తున్న అనేక మంది ఎస్సైలకు ఫోన్లు చేసి కొన్ని కేసుల్ని సెటిల్ చేశాడు. ఇందుకుగాను సంబంధీకుల నుంచి డబ్బు వసూలు చేశాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ స్కూల్ యజమానికి కాల్ చేసి సీటు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నుంచి రూ.65 వేలు తీసుకుని మోసం చేశాడు. హెచ్‌డీఎఫ్‌సీలో మేనేజర్‌గా ఓ యువతికి ఫోన్ చేసిన ఆనంద్‌బాబు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.90 వేలు కాజేశాడు. తనకు ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలను వినియోగించి ఏ పని అయినా చేసి పెడతానంటూ ఓ వ్యక్తి నుంచి రూ.7 లక్షలు తీసుకుని మోసం చేశాడు. ఓ వ్యక్తి గుర్తింపుకార్డులు, బ్యాంకు వివరాలు వినియోగించుకుని కారు కొనుగోలు చేశాడు.
ఆపై నెలసరి వాయిదాలు చెల్లించడం మానేయడంతో బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి ఆ డబ్బు కట్ అవసాగింది. ఇలాంటి ఆరోపణలపై ఆనంద్ బాబుపై జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, హయత్‌నగర్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్ ముజఫర్ అలీలు వలపన్ని బుధవారం పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment