అక్కడ కోడి కూత వినబడదు
పల్లెల్లో కోడి కూస్తే తెల్లారినట్టు.. కోడి కూతతోనే గ్రామీణులు మంచాలు దిగుతారు. అందుకే ఆ కూతను జగతికి మేలుకొలుపుగా వర్ణించాడో సినీ కవి. కానీ కొత్తూరు మండలం ఎన్ని రామన్నపేటలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. ఈ ఊళ్లో కోడి కూతే వినబడదు. కోడి జాడే కనిపించదు. సుమారు 40 సంత్సరాలు క్రితం గ్రామంలో కోడి పెంపకాలను పెద్దలు నిషేధించారు. ఇప్పటికీ ఆ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది.
ఏడాదికోసారి వచ్చే అమ్మవారికి మొక్కులకు మాత్రం చిన్నపాటి మినహాయింపు. అది కూడా ముందు రోజు రాత్రి తీసుకొచ్చి తెల్లవారుజామున చడీచప్పుడు లేకుండా కోడిని కోస్తారు. ఇక్కడ జనాభా సుమారు 500 మంది ఉంటారు. కోళ్లు పంటలకు నష్టం కలిగిస్తున్నాయని తరచూ వివాదాలు చెలరేగడంతో అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామానికి చెందిన జి.సింహచలం, రామయ్య తెలిపారు. కోడిమాంస ప్రియులు మాత్రం పొరుగూరుకు వెళ్లి చికెన్ తెచ్చుకుంటున్నారు.
-కొత్తూరు