రాహుల్ గాంధీ.. ఓ కొబ్బరికాయ!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రసంగాల మీద పదే పదే జోకులు పేలుతున్నాయి. తాజాగా ఆయన చేసిన మరో ప్రసంగం కూడా సోషల్ మీడియాలో జోకులకు కారణమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన 'మేకిన్ ఇండియా' నినాదాన్ని అంది పుచ్చుకోవాలనుకున్నారో ఏమో గానీ.. అచ్చం ఆయన మాట్లాడినట్లే మాట్లాడేందుకు రాహుల్ ప్రయత్నించి, బొక్కబోర్లా పడ్డారు. మణిపూర్ ఎన్నికల ప్రచారం కోసం ఆయన అక్కడకు వెళ్లారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో పైనాపిల్, వక్క, తమలపాకులు ఇలాంటివి చాలా విస్తృతంగా పండుతాయి. అందువల్ల అక్కడ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేయాలన్నది రాహుల్ డిమాండు.
ఆ విషయం చెప్పడానికి ఆయన చెప్పిన మాటలే చిత్రంగా ఉన్నాయి. ''లండన్లో ఎవరో ఒకరు కొబ్బరి రసం తాగుతూ ఉండాలి.. ఆ బాటిల్ మీద మేడిన్ మణిపూర్ అని రాసి ఉండాలన్నది నా ఆశ'' అని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ అచ్చం ఇలాగే మాట్లాడుతుంటారు. కానీ, విషయం ఏమిటంటే.. మణిపూర్ వాతావరణానికి అక్కడ అసలు కొబ్బరిచెట్లే పెరగవు, కొబ్బరికాయలు కాయవు. ఆ సంగతి తెలుసుకోకుండా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొబ్బరి నీళ్ల గురించి మాట్లాడటంతో ట్విట్టర్ జనాలు ఆయన మీద జోకులు పేల్చారు. బహుశా మణిపూర్ సీఎం ఓక్రమ్ ఇబోబి సింగ్ ఆయనకు స్పీచ్ రాసిచ్చేటపుడు మర్చిపోయారేమోనని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు.