collapsed house
-
తండ్రికొడుకు ప్రాణం తీసిన మంచం
సేలం: ఇనుప మంచం పడి తండ్రి, కుమారుడు మృతి చెందిన ఘటన దిండుగల్ లో ఆదివారం వేకువజా మున చోటు చేసుకుంది. దిండుగల్ సమీపంలో ఉన్న సానర్పట్టి కాలియమ్మన్ కోవిల్ వీధికి చెందిన గోపీకన్నన్ (35) టైలర్‌గా పని చేస్తున్నాడు. ఇతని భార్య యోగేశ్వరి (32) నత్తం ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తుంది. వీరికి కుమారుడు కార్తిక్ (10) ఐదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం రాత్రి యోగేశ్వరి పనికి వెళ్లడంతో ఇంట్లో గోపీకన్నన్ మద్యం మత్తులో ఇనుప మంచంపై పడుకుని నిద్రపోయాడు. అతని పక్కన నేలపై కార్తిక్ పడుకున్నాడు. ఈ స్థితిలో వేకువజామున ఇనుప మంచం బోల్టు ఊడి కింద పడింది. దీంతో మంచం మధ్యలో తల చిక్కుకుని గోపికన్నన్ కింద పడుకుని ఉన్న కుమారుడు కార్తిక్‌పై పడ్డాడు. దీంతో తండ్రీ, కొడుకులు మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున లోగేశ్వరి తన భర్త, కుమారుడిని తనిఖీ చేసేందుకు వెళ్లింది. విరిగిన ఇనుప మంచంలో తన భర్త, కొడుకు చనిపోయి పడి ఉండటాన్ని ఆమె గుర్తించింది. ఆమెతో పాటు ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. సానర్పట్టి పోలీసులు కేసు నమోదు చేశారు -
బుల్డోజర్ రాజ్యం!
భారత రాజకీయ నిఘంటువులో కొత్తగా చేరిన పదం బుల్డోజర్. పరిహాసంగా మొదలైన బుల్ డోజర్ అనే మాట ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాస్త్రమై, చివరకు దేశమంతటా ఊడలు దిగుతోంది. మతఘర్షణలకు కారకులైన వారి ఇళ్ళనూ, ఆస్తులనూ బుల్డోజర్లతో కూల్చివేయడం మొదలుపెట్టి ‘బుల్డోజర్ బాబా’ అనిపించుకున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇప్పుడది అనేక బీజేపీ పాలిత ప్రాంతాలకు ఆదర్శమైంది. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్ళు రువ్వారని ఆరోపణలొచ్చిన చోట అక్కడి సీఎం శివరాజ్ చౌహాన్ ఇళ్ళ కూల్చివేతల మంత్రం ప్రయోగించి, ‘బుల్డోజర్ మామ’ అయ్యారు. బుధవారం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఏకంగా 9 జేసీబీ బుల్డోజర్లతో అదే సీన్. కర్ణాటకలోని హుబ్బలి హింసాకాండలోనూ తక్షణ బుల్డోజర్ న్యాయం ప్రస్తావనే. మహారాష్ట్రలో నవనిర్మాణ సేన నేత రాజ్‌థాకరే ఏకంగా మసీదుల నుంచి ప్రార్థన పిలుపు (‘అజాన్)ను వినిపించే లౌడ్స్పీకర్లను మే 3 కల్లా తొలగించాలంటున్నారు. లేదంటే పోటీగా మరింత గట్టిగా హనుమాన్ చాలీసా వినిపిస్తామనీ తొడ కొడుతున్నారు. వెరసి, మనుషుల మధ్య మత విద్వేషాన్ని రగిలిస్తున్న తాజా ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. దేశరాజధాని ఘటనకొస్తే – పేరుకు ఢిల్లీ ఒకటే అయినా, సామాజిక, ఆర్థిక కోణాలలో అది అనేకానేక ఢిల్లీల సముదాయం. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినవారు సైతం పలువురున్న జహంగీర్‌పురిలోని కుశల్చౌక్ ప్రాంతం కేవలం కొద్ది గజాల తేడాలోనే మందిరం, మసీదు – రెండూ ఉన్న శాంతియుత సహజీవన ప్రతీక. కానీ, పోలీసుల అనుమతి లేకనే, చేతులో కత్తులు, తుపాకులతో ఏప్రిల్ 16న సాగిన హనుమాన్ జయంతి యాత్ర రేపిన ఘర్షణతో తంటా వచ్చింది. కొద్దిరోజులుగా ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా, ఉద్విగ్నంగా మారిపోయింది. దోషులు ఎవరైనా శిక్షించాల్సిందే. అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా, అవి ఏ వర్గానికి చెందినవైనా సరే చర్య చేపట్టాల్సిందే. కానీ, రోహింగ్యాలు, బంగ్లాదేశీల పేరుతో అమాయకులైన శ్రామికులకు, అదీ ఒకే వర్గానికి చెందినవారి షాపులనే కూల్చివేశారని ప్రత్యక్ష సాక్షుల కథనం. 1970ల నుంచి ఉన్న షాపుపై, అదీ అధికారిక కాగితాలన్నీ పక్కాగా ఉన్న దానిపై బుల్డోజర్ ప్రయోగం పరాకాష్ఠ. ఏళ్ళ తరబడిగా ఈ నిర్మాణాలున్నా, తాము అధికారంలోకి వచ్చి ఏళ్ళు గడిచినా... నిన్నటి దాకా గుర్తు లేని జహంగీర్‌పురి అక్రమ కట్టడాలు ఉన్నట్టుండి ఇప్పుడే తెరపైకి రావడమే విచిత్రం. పైపెచ్చు, కేవలం ఒక ధార్మిక స్థలం ముంగిట దుకాణాలనే కూల్చివేసి, ఆ పక్కనే ఉన్న మరో ధార్మిక స్థలం చుట్టూ నిర్మాణాల ఊసే ఎత్తకపోవడం మరీ విడ్డూరం. ముందస్తు నోటీసుల లాంటివేమీ లేకుండా, తెల్లవారుతూనే బుల్డోజర్లతో విరుచుకుపడడం అసాధారణం. యథాతథ స్థితి కొనసాగించాల్సిందిగా దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పినా సరే, ఆ తర్వాత కనీసం గంటన్నర సేపు కూల్చివేత సాగడం కోర్టు ధిక్కారం కాదా? అధికారిక ఉత్తర్వులు అందలేదనే మిషతో అధికారులు న్యాయస్థానం ఆదేశాన్ని సైతం పెడచెవిన పెట్టవచ్చా? నాలాపై అక్రమంగా నిర్మాణాలు ఉన్నాయన్నా, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందన్నా ఇన్నేళ్ళు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? తాజా శోభాయాత్ర ఘటనకు ప్రతిగానో, ప్రతీకారంగానో ఈ చర్య చేపట్టారంటే ఏం జవాబిస్తారు? యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ – అన్నిటా ఒకటే వర్గాన్ని లక్ష్యంగా చేసుకొన్న కూల్చివేతల్ని చూస్తే, మనుషుల్ని మరింతగా విడదీస్తున్నారని అనుమానాలు రేగడం సహజం. నిజానికి, ఈ నిరంకుశ రాజ్యాధికారానికి కూలిపోతున్నది ఇళ్ళు, షాపులు కాదు... న్యాయపాలన, రాజ్యాంగం. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినవారి నుంచి నష్టపరిహారం వసూలు ఆదేశాలతో మొదలుపెట్టిన యూపీ సర్కార్ రెండేళ్ళ క్రితం దాన్ని ఏకంగా చట్టం చేసింది. బుల్డోజర్లతో భయపెట్టడం యూపీ నుంచి ఢిల్లీ దాకా పాకింది. ఘర్షణలకు పాల్పడ్డారనే ఆరోపణతో ఇళ్ళ కూల్చివేత సామూహిక శిక్ష విధింపు కిందే లెక్క. ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం కింద సామాన్యుడికి సంక్రమించిన గృహ నివాస హక్కును కాలరాయడమే అని నిపుణుల మాట. కొద్ది నెలలుగా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఒక పద్ధతి ప్రకారం మతవిద్వేష ప్రయత్నాలు, ఘర్షణలు సాగుతున్నాయి. అయితే ముందే పసిగట్టి, ఘర్షణల్ని నివారించడంలో వ్యవస్థాగత వైఫల్యం వెక్కిరిస్తోంది. మరో పక్క చట్టబద్ధంగా పని చేయాల్సిన పోలీసులను, పాలకుల ఆదేశా లను మాత్రమే పాటించే గులాములుగా మారుస్తుండడం ఇంకో సమస్య. సమాజంలోని సాంస్కృతిక, ధార్మిక భేదాలను గుర్తించి, అంగీకరించే పెద్ద మనసు ప్రజలకున్నా, పాలకులు ఉండనిచ్చేలా లేరు. జేసీబీ అంటే ‘జిహాద్ కంట్రోల్ బోర్డ్’ లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఏం చెప్పదలుకున్నారు? భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతిని ఏం చేయదలుచుకున్నారు? భావోద్వేగాలు పెంచి, పరమత సహనాన్ని హననం చేసినందు వల్ల ఎవరికి లాభం? ‘తొక్కుకుంటూ పోవాలె... ఎదురొచ్చినవాణ్ణి ఏసుకుంటూ పోవాలె’ లాంటి డైలాగులు సినిమాల్లో బాగుంటాయేమో కానీ, ప్రజాస్వామ్యంలో సరిపడవని పాలకులు మర్చిపోతే కష్టం. కూల్చివేస్తున్నది కట్టడాలను కాదు... శతాబ్దాల సహజీవన పునాదిపై నిర్మాణమైన సామరస్యాన్ని అని గ్రహించకపోతే సమాజానికే తీరని నష్టం. పాలకుడనే వాడు ఎప్పటికైనా గెలవాల్సింది – తాత్కాలికమైన ఎన్నికలను కాదు... విభిన్న వర్గాల ప్రజల మనసుల్ని! -
కుప్పకూలిన ఐదంతస్తుల బిల్డింగ్
ముంబై: మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లా మహద్‌లో సోమవారం దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద 200 మందికి పైగా చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన పట్ల పలువురు విషాదం వ్యకం చేస్తున్నారు. ఈ సంఘటనలో గాయపడిన వారికి తక్షణ సాయం అందించాలని సీఎం ఆదేశించారు. చదవండి: ‘అసంతృప్త నేతలపై చర్యలు లేవు’ -
కులాంతర వివాహం.. వరుడి ఇల్లు ధ్వంసం
కర్ణాటక,మాలూరు: యువతీ యువకుడు కులాంతర వివాహం చేసుకోగా వధువు తల్లిదండ్రులు వరుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఈఘటన గురువారం రాత్రి తాలూకాలోని హురళగెరె గ్రామంలో చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన శశికుమార్(25 డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదే క్రమంలో ఇదే గ్రామానికి చెందిన రమ్య (21)తో పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరు కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. దీంతో ప్రేమికులు ఇతర ప్రాంతానికి వెళ్లి వివాహం చేసుకొని గ్రామానికి వచ్చారు. కోపోద్రిక్తులైన రమ్య పోషకులు రాత్రి 11 గంటల సమయంలో శశికుమార్ ఇంటిపై దాడి చేశారు. శశికుమార్‌ను చితకబాది ఇంటిని ధ్వంసం చేశా రు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమ్య తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. -
అధికార పార్టీ నేతల దౌర్జన్యం
-
అధికార పార్టీ నేతల దౌర్జన్యం
► నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతల ఇల్లు కూల్చివేత ►ఎర్రచందనం స్మగ్లర్ మహేష్‌నాయుడు తదితరులపై కేసు నమోదు ►సంఘటన స్థలాన్ని పరిశీలించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సుండుపల్లి: సుండుపల్లిలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆనందరెడ్డి, ఎంపీపీ అజంతమ్మలకు చెందిన నిర్మాణంలో ఉన్న భవనాన్ని అధికారపార్టీకి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ మహేష్ నాయుడు, శివారెడ్డిలు సోమవారం అర్ధరాత్రి సమయంలో కూల్చి వేశారు. సంఘటన స్థలాన్ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఇంటికి సమీపంలో వేరెవరూ ఇల్లు నిర్మించుకోకూడదా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. సొంత భూమిలో వైఎస్సార్సీపీ నాయకులు ఇల్లు కట్టుకుంటుంటే టీడీపీ నాయకులు అర్ధరాత్రి సమయంలో మనుషులు, మారణాయుధాలతో వచ్చి జేసీబీతో ఇంటిని కూల్చి వేసి భయోత్పాతం సృష్టించడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరంరెడ్డి మాట్లాడుతూ ఎంపీపీ, మండల వైఎస్సార్సీపీ నాయకుడు 20 ఏళ్లుగా అనుభవంలో ఉన్న వారి పూర్వీకుల స్థిరాస్తిలో ఇల్లు కట్టుకుంటుంటే దౌర్జన్యానికి పాల్పడటం తగదన్నారు. ఎంపీపీ అజంతమ్మ మాట్లాడుతూ తాము బెంగళూరులో ఉంటున్నామని, తమ సొంత భూమిలో ఇంటి నిర్మాణం జరుగుతుండగా సోమవారం అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేశారన్నారు. తాము ప్రతి దాడికి దిగితే పరిస్థితి ఏమవుతుందన్నారు. ఏదైనా సమస్య ఉంటే మండల మేజిస్ట్రేట్ రావాలి. పోలీసులు రావాలి కానీ ఇలా టీడీపీ నాయకుడు మహేష్‌నాయుడు వచ్చి అతని ఇంటికి వెళ్లేందుకు దారి లేదంటూ తమ స్థలంలో నిర్మిస్తున్న ఇంటిని కూల్చి వేయడం ఏమిటన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నిర్మాణంలో ఉన్న ఇంటిని అధికార పార్టీ నాయకులు కూల్చివేయడంపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎంపీపీ అజంతమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరంరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి సుండుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు రాయచోటి సీఐ నరసింహరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సిరాజుదీ్దన్, సర్పంచ్ బ్రహ్మానందం, ఎంపీటీసీ బాబు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు జయరామిరెడ్డి, రంగారెడ్డి, రాజారెడ్డి, బెల్లం సంజీవరెడ్డి, గౌరవసలహాదారుడు కృష్ణంరాజు, ఎస్సీసెల్ మండల కన్వీనర్ చిన్నప్ప, మండల కోఆప్షన్ మెంబర్ పండూస్, బీసీ నాయకులు సూరి ఆచారి, జిల్లా ఎస్టీ నాయకుడు చంద్రానాయక్ తదితరులు పాల్గొన్నారు.