నో హెల్మెట్.. నో ఫైన్
‘ఆగాగు.. హెల్మెట్ లేకుండా వెళ్తున్నావ్.. బండాపు. సార్ అక్కడున్నారు. వెళ్లి ఫైన్ కట్టు’ అంటూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై వచ్చీపోయేవారిని ఏలూరు పోలీసులు శనివారం ఇలా అడ్డుకున్నారు. ఒక్కరోజే నగరంలో 276 కేసులు నమోదు చేసి రూ.32 వేలు జరిమానా వసూలు చేశారు. అయితే, హెల్మెట్ లేకుండా వెళ్లే వారికి జరిమానాలు విధించవద్దని కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశాలిచ్చారు. రెండు నెలలపాటు హెల్మెట్ వాడకంపై వాహన చోదకులకు అవగాహన కల్పించాలని.. ఆ తరువాతే జరిమానా వసూలు చేయాలని స్పష్టం చేశారు.
ఏలూరు (ఆర్ఆర్ పేట) : హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే ద్విచక్ర వాహన చోదకుల నుంచి రెండు నెలలపాటు జరిమానాలు వసూలు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారని కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. కలెక్టర్లు, పోలీస్, రవాణా శాఖ అధికారులతో శనివారం ఆయన వీడియో కాన్ఫెరెన్స్‌లో మాట్లాడుతూ ఈ మేరకు ఆదేశాలిచ్చారన్నారు. రానున్న రెండు నెలలపాటు ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ వాడేవిధంగా చైతన్యపరచాల్సి ఉంటుందన్నారు. ఆ తరువాత మాత్రమే ఫైన్ వసూలు చేయాలన్నారు. ఈ మేరకు జిల్లాలోని పోలీస్, రవాణా అధికారులకు ఆదేశాలిచ్చినట్టు కలెక్టర్ చెప్పారు.
హెల్మెట్ ఎందుకు వాడాలి, దానివల్ల ప్రాణానికి ఎంత మేలు కలుగుతుందనే విషయాలపై ఈ రెండు నెలలపాటు వాహన చోదకులకు అవగాహన కల్పించేందుకు ‘ఫైన్ వద్దు.. చైతన్యం ముద్దు’ అనే కార్యక్రమం నిర్వహించాల్సి ఉందన్నారు. రెండు రోజుల్లో హెల్మెట్లకు సంబంధించి మార్గదర్శక సూత్రాలు పంపిస్తామని ప్రధాన కార్యదర్శి చెప్పారని, ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా.. నిబంధనల మేరకు తయారైన హెల్మెట్లను మాత్రమే మార్కెట్లో విక్రయించేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌కు ఇన్చార్జి జేసీ షరీఫ్, డీఆర్వో కె.ప్రభాకరరావు, డ్వామా పీడీ రమణారెడ్డి, రవాణా శాఖ ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాస్, రవాణా శాఖ పరిపాలనాధికారి మాణిక్యాలరావు పాల్గొన్నారు.