చూస్తూ ఊరుకోం
పోలీసులకు సీఎం సిద్ధరామయ్య హెచ్చరిక
సామూహిక సెలవు అల్టిమేటంపై ఆగ్రహం
పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం
బెంగళూరు : నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు నిరసనకు దిగితే వారిపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు. వేతన పెంపుతో పాటు మరిన్ని డిమాండ్ల సాధన కోసం జూన్ 4న సామూహిక సెలవులపై వెళ్లనున్నట్లు రాష్ట్ర పోలీసు ఉద్యోగుల సంఘం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర హోంశాఖ మంత్రి పరమేశ్వర్తోపాటు పలువురు రాష్ట్ర హోంశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అత్యవసర సమీక్ష సమావేశం జరిపారు.
సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... హోంశాఖలోని కింది స్థాయి సిబ్బంది కొన్ని ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమన్నారు. వాటిని పరిష్కరించడం కోసం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈలోపు పోలీసు సిబ్బంది నిరసనకు దిగితే కఠిన చర్యలు తప్పవని సీఎం సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు.