Cologne
-
కొలోన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
కొలోన్ : వికారినామ సంవత్సర ఉగాది, శ్రీరామనవమి వేడుకలు జర్మనీలో కొలోన్ తెలుగు వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కొలోన్లోని స్థానిక ఆడిటోరియంలో అత్యంత శోభాయమానంగా జరిగిన ఈ కార్యక్రమానికి కొలోన్ చుట్టు పక్కన ప్రాంతాలైన ఆకెన్, బాన్, డ్యూస్సెల్ డోర్ఫ్, డ్యూస్బెర్గ్, కొబ్లెంస్, ఫ్రాంక్ఫర్ట్లతో పాటూ ఇతర ప్రాంతాలనుంచి 200మందికి పైగా తెలుగు వారు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినాన ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, వడపప్పు, పానకం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు, పెద్దలు తమ ప్రదర్శనలతో ఆహుతులను ఎంతగానో అలరించారు. నాటకాలు, పద్యాలు, శాస్త్రీయ సంగీతం, భరతనాట్యం, అన్నమయ్య కీర్తనలు, టాలీవుడ్ నృత్యాలు, తెలుగుదనం ఉట్టిపడే సమకాలీన నృత్యాలతో అందరినీ ఆద్యంతం ఆసక్తికరంగా అలరించారు. ప్రతేకించి చిన్నారులు ఆలపించిన హనుమాన్ చాలీసా, పంచాంగ శ్రవణంతో పాటూ, కూచిపూడి, భరతనాట్యం వంటి కార్యక్రమాలతో వేడుక అంతా ఉత్సాహంగా గడిచింది. విశ్వవిద్యాలయాలలో చదువుతున్న తెలుగు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. అతిథులందరికి రుచికరమైన తెలుగు వంటకాలతో భోజనాలు వడ్డించారు. సాయంత్రం వరకు ఎంతో సరదాగా, సంబరంగా ఈ వేడుక సాగి పోయింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక సహాయ సహకారాలు అందించిన సంఘ సభ్యులకు అతిథులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. -
కోలి కార్నివాల్లో లైంగిక దాడులు
కోలి: జర్మనీలోని కోలి నగరంలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా వందలాది మంది మహిళలపై లైంగిక దాడులు జరిగిన భయానక సంఘటలను మరచిపోకముందే మళ్లీ అదే నగరంలో గురువారం ‘విమెన్స్ కార్నివాల్’ సందర్భంగా మహిళలపై లైంగిక దాడులు చోటు చేసుకున్నాయి. నూతన సంవత్సరం వేడుకల్లో వలసవచ్చిన ఉత్తర ఆఫ్రికా, అరబిక్ జాతికి చెందిన యువుకులు లైంగిక దాడులకు పాల్పడగా, ఈసారి యూరోపియన్లే లైంగిక దాడులకు దిగడం గమనార్హం. విమెన్స్ కార్నివాల్లో దాదాపు 250 నేరపూరిత సంఘటనలు జరగ్గా, 220 ఫిర్యాదులు పోలీసులకు అందాయి. వాటిలో 22 లైంగికపరమైన సంఘటనలు ఉన్నాయి. తప్పతాగిన కొంత మంది యువకులు మహిళల దుస్తుల్లోకి చేతులు దూర్చి అసభ్యంగా ప్రవర్తించగా, మరికొంత మంది యువకులు రేప్‌లకు పాల్పడ్డట్టు ఫిర్యాదులు అందాయని పోలీసు అధికారులు తెలిపారు. సీఎన్ఎన్కు అనుబంధంగా పనిచేస్తున్న ఆర్టీటీబీఎఫ్ రేడియో టెలివిజన్ జర్నలిస్టు పట్ల కూడా యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. వారిస్తున్నా వినకుండా ఆమెను ముద్దు పెట్టుకునేందుకు తెగబడ్డారు. కార్నివాల్ వేడుకలకు ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుండగానే ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టారు. వాటిని ప్రసారం చేయకూడదని భావించిన ఛానెల్ నిర్వాహకులు రెండు ఫొటోలను మాత్రం విడుదల చేశారు. నూతర వేడుకల్లో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈసారి భారీ ఎత్తున భద్రతా దళాలకు మోహరించిన లైంగిక దాడులు జరగడం శోచనీయమని పోలీసు అధికారులు అన్నారు. ఇప్పటి వరకు కేసులకు సంబంధించి 190 మందిని అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు. కార్నివాల్ సందర్భంగా ఇలాంటి లైంగిక దాడులు ప్రతి ఏటా జరుగుతున్నాయని, అయితే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగా ఉందని వారు వివరించారు.