పట్టు బిగించిన హర్యానా
కల్నల్ సీకే నాయుడు అండర్-23 రాష్ట్రస్థాయి క్రికెట్ మ్యాచ్ సోమవారం కడపలో ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హర్యానా జట్టు నిలకడగా రాణించింది. తొలిరోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 234 పరుగులతో పటిష్టస్థితిలో ఉంది.
కడప స్పోర్ట్స్ : కల్నల్ సీకే నాయుడు అండర్-23 రాష్ట్రస్థాయి మ్యాచ్ సోమవారం కడపనగరంలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రీడామైదానంలో ప్రారంభమైంది. ఆంధ్రా-హర్యానా జట్ల మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ హర్యానా జట్టును వరించడంతో బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్లు జి.ఏ. సింగ్, ఎస్.జే బుద్వార్లు నిలకడగా రాణించడంతో మంచి ప్రారంభాన్నిచ్చారు.
ఎస్జే బుద్వార్ను 58 పరుగుల వద్ద వినీల్ బౌల్డ్ చేయడంతో తొలివికెట్ పడింది. అనంతరం జి.ఏ. సింగ్ 43 పరుగులు, రోహిత్‌శర్మ 36 పరుగులు చేసి అవుటయ్యారు. అనంతరం బరిలోకి దిగిన డాగర్ 79 పరుగులతో క్రీజులో ఉండగా ఈయనకు జతగా యాదవ్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 234 పరుగులతో హర్యానా పటిష్టస్థితిలో ఉంది. కాగా ఆంధ్రా జట్టు బౌలర్ శశికాంత్ 2 వికెట్లు, వినీల్ 1 వికెట్ తీశారు.
జాతీయజట్టులో చోటు సంపాదించాలి : వెంకటశివారెడ్డి
జాతీయజట్టులో చోటు సంపాదించేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి అన్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు, సంయుక్త కార్యదర్శి ఎ. నాగసుబ్బారెడ్డి, సభ్యులు శివప్రసాద్, ఖాజా, మీడియాసెల్ మేనేజర్ నాగేష్కుమార్రాజు తదితరులు పాల్గొన్నారు.